logo

విధి వెంటాడగా.. చదువుకు దూరంగా..

పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాన్ని విధి మరింత వెంటాడింది. అనారోగ్యం రూపంలో మరింత కష్టాల్లోకి నెట్టింది. చదువంటే ఇష్టమున్న ఆ విద్యార్థిని వెనుకడుగు వేయాల్సి వచ్చింది. తండ్రి పక్షవాతంతో మృతి చెందగా, తల్లి రొమ్ము క్యాన్సర్‌తో

Published : 12 Aug 2022 01:08 IST

పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాన్ని విధి మరింత వెంటాడింది. అనారోగ్యం రూపంలో మరింత కష్టాల్లోకి నెట్టింది. చదువంటే ఇష్టమున్న ఆ విద్యార్థిని వెనుకడుగు వేయాల్సి వచ్చింది. తండ్రి పక్షవాతంతో మృతి చెందగా, తల్లి రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఇటీవల పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించినా అమ్మ ఆరోగ్యం బాగాలేక ఖర్చుల కోసం కూలీ పనులకు వెళ్లాల్సి వస్తోంది. ఆ విద్యార్థిని దీనగాథపై  కథనం.

 

తండ్రి ఫొటోతో భార్గవి, పక్కన తల్లి పద్మ

న్యూస్‌టుడే, పాపన్నపేట: మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన మంగళి విఠల్‌, పద్మ దంపతులకు కూతురు భార్గవి ఉన్నారు. ఎలాంటి భూమి లేకపోగా, కూలీ పనులకు వెళ్తే తప్ప ఐదు వేళ్లు లోపలికి వెళ్లలేని పరిస్థితి వాళ్లది. ఈ క్రమంలో విఠల్‌ 2014లో పక్షవాతం బారిన పడ్డాడు. ఆరేళ్ల మంచానికే పరిమితమయ్యారు. ఇక కుటుంబ భారమంతా పద్మపై పడింది. ఆమె కూలీ పనులు చేస్తూ వచ్చిన డబ్బు కుటుంబ పోషణకే సరిపోయేది. విఠల్‌కు మంచి చికిత్స అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో భార్గవి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆ తర్వాత 2019లో పద్మ రొమ్ము క్యాన్సర్‌ బారిన పడింది. నిజామాబాద్‌లోని ఇందూరు క్యాన్సర్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుండి తల్లి కూడా బలహీనంగా మారడంతో కుటుంబ పోషణ మరింత భారమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో పద్మ కూలీ పనులకు వెళ్లక తప్పలేదు. ఇంట్లో మంచాన పడి ఉన్న తండ్రికి సపర్యలు చేయడంతో పాటు అటు క్యాన్సర్‌ బారిన పడిన తల్లికి చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి రావడంతో భార్గవి చదువుకు దూరమైంది. ఆరోగ్యం మరింత క్షీణించి 2020 సెప్టెంబరులో విఠల్‌ మృతి చెందాడు. ఇక భార్గవి తల్లిని ప్రతి మూడు నెలలకోసారి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చేది. చికిత్స ఉచితమే అయినా మందులు, పరీక్షలు, రవాణా ఖర్చులు భరించలేని పరిస్థితి. స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సాహంతో భార్గవి 2022 మేలో పదో తరగతి పరీక్షలు రాయగా.. 5.5 జీపీఏతో ఉత్తీర్ణత సాధించారు. ఉన్నతంగా చదవాలన్న ఆశ ఉన్నప్పటికీ పేదరికంతో ప్రభుత్వ కళాశాలకు వెళ్లాలన్నా చేతి ఖర్చులకు సైతం డబ్బు లేకపోవడంతో చదువు మానేయాల్సిన దుస్థితి. కుటుంబ పోషణకు భార్గవి అపుడప్పుడు కూలీ పనులకు వెళ్లాల్సి వస్తోంది. చేతిలో నగదు లేక మూడు నెలలుగా పద్మను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేకపోతున్నారు. ఈ తరుణంలో ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆపన్నహస్తం అందించాలని వేడుకుంటున్నారు ఈ తల్లీకూతుళ్లు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని