logo

సొంత భవనాలు లేక.. సమావేశాల నిర్వహణ గగనం

మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరితే పొదుపు చేయడం అలవాటుగా మారుతుంది. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. దీనివల్ల మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఇదే ఉద్దేశంతో

Published : 12 Aug 2022 01:08 IST

ఎల్లమ్మగూడలో చెట్టుకిందే గ్రామైక్య సంఘం సమావేశం

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరితే పొదుపు చేయడం అలవాటుగా మారుతుంది. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. దీనివల్ల మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఇదే ఉద్దేశంతో మహిళలు సంఘాల్లో సభ్యులుగా చేరుతున్నారు. మహిళలందరూ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరితే ఆయా కుటుంబాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. గ్రామైక్య సంఘాలు, మండల సమాఖ్యలు పొదుపు సంఘాలను సరైన మార్గంలో నడిపించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఆయా సంఘాలకు సొంత భవనాలు లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులపై కథనం..

జిల్లాలో 688 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. నెలకు రెండు సార్లు గ్రామైక్య సంఘాల సమావేశాలు నిర్వహస్తుంటారు. మొదటి సమావేశంలో బ్యాంకు, స్త్రీనిధి రుణాలు, రుణవాయిదాల వసూలు అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. రెండో సమావేశంలో ఆరోగ్యం, పౌష్టికాహారం అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. కొవిడ్‌ నేపథ్యంలో రెండో సమావేశాలు అంతంతమాత్రంగా సాగుతున్నాయి.

చాలా చోట్ల ఇదే పరిస్థితి
562 గ్రామైక్య సంఘాలకు సొంత భవనాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడైనా ఖాళీగా ఉంటే అక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల సామూహిక భవనాలు, అవి కూడా లేని చోట చెట్లకిందే సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి. సమావేశాల నిర్వహణకు సరైన చోటు లేకపోవడంతో అన్ని అంశాలపై చర్చించకుండానే ముగిస్తున్నారు. ప్రతి నెలా సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించడంతోపాటు లొకేషన్‌ వివరాలతో కూడిన లైవ్‌ ఫొటో కూడా అప్‌లోడ్‌ చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది.

మండల సమాఖ్యల్లో..
జిల్లాలో 27 మండలాలు ఉండగా 25 మండల సమాఖ్యలు ఉన్నాయి. ఎనిమిది చోట్ల మండల సమాఖ్యలకు సొంత భవనాలు లేకపోవడం గమనార్హం. ఇందులో కొత్త వాటితోపాటు పాత మండలాలు కూడా ఉన్నాయి. వట్‌పల్లి, నాగలిగిద్ద, నారాయణఖేడ్‌, సిర్గాపూర్‌, గుమ్మడిదల, కంగ్టి, కోహీర్‌, చౌటకూరు, మొగుడంపల్లిలో మండల సమాఖ్యలకు సొంత భవనాలు నిర్మించాల్సి ఉంది. గుమ్మడిదలలో గ్రామైక్య సంఘం కార్యాలయంలోనే మండల సమాఖ్య సమావేశాలు కొనసాగిస్తున్నారు. మిగతా చోట్ల మండల పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరాల్లో నిర్వహిస్తున్నారు. సొంత భవనాలు లేకపోవడంతో మండల సమాఖ్యకు సంబంధించిన దస్త్రాలను భద్రపరచడం ఇబ్బందిగా మారింది.

నిధులు మంజూరుతోనే ప్రయోజనం
గ్రామైక్య సంఘాలు, మండల సమాఖ్యలకు సొంత భవనాల నిర్మాణానికి జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు కేటాయించాలని విజ్ఞప్తిచేశారు. ప్రభుత్వం స్పందించి భవనాల నిర్మాణానికి నిధులు మంజూరుచేయాలని మహిళా సంఘల సభ్యులు విజ్ఞప్తిచేస్తున్నారు.

ప్రతిపాదనలు పంపాం: సూర్యారావు, అదనపు డీఆర్డీవో
సొంత భవనాలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్న మాట వాస్తవమే. ప్రభుత్వ భవనాలు అందుబాటులో అక్కడే సమావేశాలు నిర్వహించాలని సూచించాం. సొంత భవనాలకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని