logo

ఆర్టీసీ ఆదాయానికి అడ్డంకులు!

సిద్దిపేట జిల్లాలో పలు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల సమీపంలో నిలిపి ఉంచుతున్న ప్రైవేట్‌ వాహనాల జోరుతో ఆర్టీసీ ఆదాయం తగ్గిపోతుంది. దుబ్బాక పట్టణంలో 1998లో 54 బస్సులతో ఏర్పడిన ఆర్టీసీ డిపో, రాన్రాను ప్రైవేట్‌

Published : 12 Aug 2022 01:08 IST

దుబ్బాక బస్టాండ్‌ ముందు నిలిపిన తీరు

దుబ్బాక, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లాలో పలు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల సమీపంలో నిలిపి ఉంచుతున్న ప్రైవేట్‌ వాహనాల జోరుతో ఆర్టీసీ ఆదాయం తగ్గిపోతుంది. దుబ్బాక పట్టణంలో 1998లో 54 బస్సులతో ఏర్పడిన ఆర్టీసీ డిపో, రాన్రాను ప్రైవేట్‌ వాహనాల పోటీని తట్టుకోలేక, ప్రస్తుతం 33 బస్సులతో ఆపసోపాలు పడుతోంది. నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. దుబ్బాకలో 40 ఏళ్ల క్రితం నిర్మించిన బస్టాండు శిథిలావస్థకు చేరింది. కొత్తదానికి శంకుస్థాపన గత జులైలో చేశారు. నూతన బస్టాండ్‌ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలోనే ఆర్టీసీ ప్రయాణికుల కోసం బస్సులను ప్రధాన రహదారి ముందు నిలిపి ఉంచుతున్నారు. దానికి ఎదురుగా, కుడివైపు, ఎడమ వైపు ప్రైవేటు వాహనాలు నిలుపుతున్నారు. రహదారి ఇరుకుగా మారుతోంది. నిబంధనల ప్రకారం బస్టాండు ఆవరణకు 250 మీటర్ల దూరం వరకు ప్రైవేటు వాహనాలు నిలపకూడదు. ఈ విషయాన్ని సూచిస్తూ హెచ్చరిక బోర్డును బస్టాండు ముందు ప్రదర్శనగా ఉంచారు. అయినా వాహనాల పార్కింగ్‌ ఆగడం లేదు. ఈ పార్కింగ్‌ తీరుపై ఆర్టీసీ సిబ్బందికి, ఇతర వాహనాల యజమానులకు మధ్య గొడవలు జరిగాయి. తొందరగా గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీకి ఆదాయం గండి పడుతోంది. ప్రస్తుతం దుబ్బాక బస్టాండ్‌లో ఆర్టీసీ సిబ్బంది మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. గతంలో ఈ డిపో నుంచి తిరుపతి, శ్రీశైలం, బోధన్‌, సంగారెడ్డి, వరంగల్‌ తదితర సుదూర సర్వీసులను నడిపారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి సికింద్రాబాద్‌, సిద్దిపేట, గజ్వేల్‌కు మాత్రమే నడుపుతున్నారు. ఇతర వాహనాల పార్కింగ్‌ను నియంత్రించాలని కోరుతూ గత మే 18న సిద్దిపేట డిపో మేనేజర్‌, దుబ్బాక ఇన్‌ఛార్జి కిషన్‌రావు స్థానిక సీఐ కృష్ణకు ఫిర్యాదు అందజేశారు. స్పందించిన సీఐ పట్టణంలోని వాహనాల డ్రైవర్లు, వాహనదారులతో రెండు సార్లు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 20 ఏళ్లుగా బస్టాంండ్‌ ప్రాంతాల్లోనే వాహనాలను నిలుపుతున్నామని.. అకస్మాత్తుగా తొలగించమంటే ఎలా అని.. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగి తాము సతమతమవుతున్నామని సమావేశాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో తమ వాహనాలకు అనువైన పార్కింగ్‌ స్థలాన్ని చూపించాలని వాహనదారులు కోరారు.

ప్రైవేటు వాహనాలు నిలపొద్దని సూచించే హెచ్చరిక బోర్డు ఉన్న చోటే  ఇలా..

అనువైన స్థలం చూపించి... తగిన చర్యలు తీసుకుంటాం
- మున్నూరు కృష్ణ, సీఐ, దుబ్బాక

గతంలో వాహనదారులతో సమావేశమై నిబంధనల ప్రకారం దూరంగా వాహనాలను నిలపాలని సూచించాం. పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. త్వరలోనే పురపాలిక అధ్యక్షురాలు, కమిషనర్‌తో మాట్లాడి, అనువైన స్థలం చూపించి, పరిష్కరిస్తాం.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts