logo

ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తేనే.. మురుగు ముందుకు.!

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియా పరిధిలో మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారంగా దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో భూగర్భ మురుగు పారుదల వ్యవస్థ పనులు సాగుతున్నాయి. పదికాలాల పాటు మన్నికగా ఉండేలా ప్రణాళికాబద్ధంగా

Published : 12 Aug 2022 01:08 IST

14వ వార్డులో మిషన్‌భగీరథ పైపులైన్‌న్ల చెంతనే ఛాంబర్ల నిర్మాణానికి తీసిన గుంత

న్యూస్‌టుడే, గజ్వేల్‌: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియా పరిధిలో మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారంగా దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో భూగర్భ మురుగు పారుదల వ్యవస్థ పనులు సాగుతున్నాయి. పదికాలాల పాటు మన్నికగా ఉండేలా ప్రణాళికాబద్ధంగా చేయాల్సిన పనులు ఇష్టారీతిన చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. పైపులైన్లు మొదలుకొని మ్యాన్‌హోళ్లు, అంతర్గత కనెక్షన్ల కోసం నిర్మిస్తున్న ఛాంబర్ల వరకు చేపట్టిన పనులపై పెదవి విరుస్తున్నారు. తాగునీటి పైపులైన్లను పట్టించుకోకుండా, రోడ్లపై ఎత్తుపల్లాలు చూసుకోకుండా పనులు చేపడుతున్నారని అంటున్నారు. బల్దియాలో మొత్తం 98,710 మీటర్ల పొడవునా గొట్టాలు బిగించాలని నిర్ణయించగా ఇప్పటిదాకా 80,580 మీటర్లు పూర్తి చేశారు. ఇందులో బీటీ రోడ్లపై 16 వేల మీటర్లకు సంబంధించి దాదాపు 14వేల మీటర్ల మేర పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అంతర్గత రోడ్లలో 4,350 మీటర్లకుగాను 3,700 మీటర్లు పూర్తి చేశారు. అంతర్గత కనెక్షన్ల కోసం 31,924 మీటర్ల పైపులైన్‌ నిర్మించాలని నిర్ణయించగా ఇప్పటిదాకా 5,724 మీటర్ల మేర అయింది. మొత్తంగా 5వేల వరకు మ్యాన్‌హోళ్లు నిర్మించారు.

బీడీ కాలనీలో కొనసాగుతున్న పనులు

తాగునీటి పైపులైన్ల ఉన్నా.. : ప్రస్తుతం పలు చోట్ల అంతర్గత కనెక్షన్లు ఇస్తున్నారు. కాలనీల్లో మూడు ఇళ్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్న ఛాంబర్‌ తాగునీటి పైపులైన్ల చెంతన నిర్మిస్తున్నారు. దీంతో 14 వార్డు వాసులు  జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఛాంబర్లు దెబ్బతిని మురుగు.. తాగునీటిలో కలిసే ప్రమాదం ఉన్నా పట్టించుకోకపోవటం లేదని  స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజ్ఞాపూర్‌లోని 4వ వార్డులో మ్యాన్‌హోల్‌ నిర్మించే చోట బండరాయి రావటంతో అక్కడ ఇతర పనులు చేపట్టి వదిలిపెట్టారు. ఏడాది దాటిపోతున్నా దాని ఊసే ఎత్తటం లేదు.

కొన్నింటికే మరమ్మతులు : ప్రజ్ఞాపూర్‌, గజ్వేల్‌ పాతబస్తీ, హౌజింగ్‌ బోర్డు, కాలనీలో పలు మ్యాన్‌హోళ్లు ఎగుడు దిగుడుగా నిర్మించారు. ఆటోలు, ద్విచక్రవాహనాలు, కార్లు వీటిపై వెళ్లే సమయంలో అదుపు తప్పుతూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తీరుపై నాలుగు నెలల కిందట ‘ముందు చూపు లేకుంటే ముప్పే’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితం కావటంతో అధికారులు గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ ప్రధాన రహదారిపై కొన్ని మ్యాన్‌హోళ్లను పునర్‌నిర్మించారు.

తగిన చర్యలు తీసుకుంటాం..
- ఎన్సీ రాజమౌళి, పురపాలిక అధ్యక్షుడు

నిర్మాణ పనులు ప్రణాళికాబద్దంగా చేపట్టేలా పర్యవేక్షిస్తున్నాం. మిషన్‌భగీరథ పైపులున్న చోట జాగ్రత్తగా పనులు చేయిస్తాం. ప్రమాదకరంగా మ్యాన్‌హోళ్లను పునర్‌నిర్మించేలా చర్యలు తీసుకుంటాం.  

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని