logo

సైబర్‌ నేరాల నియంత్రణకు అంబాసిడర్లు..!

రోజురోజుకు సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో బురుడీ కొట్టించి.. వివరాలను సేకరించి.. దోచుకుంటున్నారు. తీరా మోసపోయామని భావించిన వారు ఠాణా మెట్లు ఎక్కుతున్నారు. ఈ తరహా మోసాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కొరవడటంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది

Updated : 13 Aug 2022 05:09 IST

న్యూస్‌టుడే, మెదక్‌

ఇటీవల పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లిలో ఆన్‌లైన్‌ మోసాలపై వివరిస్తున్న విద్యార్థిని

రోజురోజుకు సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో బురుడీ కొట్టించి.. వివరాలను సేకరించి.. దోచుకుంటున్నారు. తీరా మోసపోయామని భావించిన వారు ఠాణా మెట్లు ఎక్కుతున్నారు. ఈ తరహా మోసాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కొరవడటంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టింది. పోలీస్‌, విద్యాశాఖల సమన్వయంతో విద్యార్థులను అంబాసిడర్లుగా ఎంపిక చేసి తర్ఫీదు ఇచ్చారు. పది నెలల పాటు శిక్షణ పొందిన వారు ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించనున్నారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా సైబర్‌ నేరస్థులు మోసాలకు పాల్పడుతున్నారు. చరవాణికి ఫోన్‌ చేసి ఆధార్‌, పాన్‌కార్డు అప్‌డేట్‌ చేయాలని, బ్యాంక్‌ ఖాతా వివరాలు, బహుమతులు వచ్చాయని చెబుతూ ఖాతాల్లోని నగదు మాయం చేస్తున్నారు. ఇలాంటి వాటిపై పోరు సాగించి నేరగాళ్ల ఆటకట్టించడానికి పోలీస్‌, విద్యాశాఖలు నడుం బిగించాయి.
తొలి విడత 51 పాఠశాలల్లో..
జిల్లాలో ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సైబర్‌ కాంగ్రెస్‌ పేరిట ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇద్దరు విద్యార్థులను అంబాసిడర్లుగా ఎంపిక చేశారు. వీరికి ఒక ఉపాధ్యాయుడిని మెంటార్‌గా నియమించారు. జిల్లాలో తొలి విడతలో 51 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. వీరికి గతేడాది నుంచి వర్చువల్‌ విధానంలో శిక్షణ ఇచ్చారు. ఇకపై వారు తోటి విద్యార్థులకు, పాఠశాల పరిసరాల్లోని గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.కేవలం  సైబర్‌ మోసాల గురించి కాకుండా మహిళలు, చిన్నారులకు జరుగుతున్న వేధింపుల విషయంలో అప్రమత్తంగా ఉండడం, డయల్‌ 100తో పాటు, సైబర్‌ హెల్ప్‌లైన్‌ 1930, చిల్డ్రన్‌ హెల్ప్‌లైన్‌ 1098 వివరాలపై చైతన్యం తీసుకురానున్నారు.


అవగాహనతోనే అడ్డుకట్ట..
- బాలస్వామి, జిల్లా అదనపు ఎస్పీ

చరవాణులు, ఆన్‌లైన్‌ వేదికల వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతోంది. మహిళలు, పిల్లలే లక్ష్యంగా మోసాలు జరుగుతున్నాయి. వాటిని నియంత్రించేందుకు పాఠశాలల్లో అంబాసిడర్లను ఎంపిక చేసి తర్ఫీదు ఇచ్చాం. సైబర్‌ కాంగ్రెస్‌ ద్వారా నేరాల నియంత్రణతో పాటు, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే అవకాశం ఉంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు