logo

మువ్వన్నెల జండా..మదినిండా..

స్వాతంత్య్ర వజ్రోత్సవం.. మురిపించే వేళ. భారతావని ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రతి పౌరుడిలో దేశభక్తి ఉప్పొంగేలా.. ప్రతి పౌరుడి మది నిండా జాతీయ భావం నిండేలా..

Published : 13 Aug 2022 01:38 IST

న్యూస్‌టుడే, నర్సాపూర్‌, జహీరాబాద్‌

మెదక్‌లో..

స్వాతంత్య్ర వజ్రోత్సవం.. మురిపించే వేళ. భారతావని ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రతి పౌరుడిలో దేశభక్తి ఉప్పొంగేలా.. ప్రతి పౌరుడి మది నిండా జాతీయ భావం నిండేలా.. ప్రతి అణువులో స్వాతంత్య్ర ఫలాలు మెరిసేలా ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుంచి ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్నదే సర్కారు ఆకాంక్ష. ఇందుకు మేము సైతం ముందుకు రావాలి.

స్వాతంత్య్ర ఫలాలు జ్ఞప్తికి తెప్పించేది త్యాగం, శాంతి, ధర్మం, సౌభాగ్యం. దేశభక్తిని చాటడానికి నిదర్శనమైన జాతీయ పతాక విశిష్టతను చాటేందుకు ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసి ఇంటింటికీ జెండా పంపిణీ చేపట్టడం విశేషం. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని పూర్తిచేశారు.
తపాలా కార్యాలయల్లో..
పోస్టాఫీసుల్లోనూ జెండాలను రూ.25కు అందజేస్తున్నారు. కాగా మరోవైపు ప్రతి ఇంటిపై జెండా ఎగరవేసే కార్యక్రమంలో భాగంగా పుర, గ్రామ పంచాయతీల్లో ఇంటింటికి జెండాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. వాటిని గురువారం నుంచే ఇళ్లపై జెండాలను ఏర్పాటు చేసుకుంటూ దేశభక్తిని చాటుకుంటున్నారు. గతంలో కేవలం ప్రజా ప్రతినిధుల వాహనాలకు మాత్రమే ఉండే జెండాలు ప్రస్తుతం ప్రతి వాహనంపై ఏర్పాటవగా.. ఆకట్టుకుంటున్నాయి.  
ఏటా మూడు రోజులు..
రామాయంపేట పట్టణంలోని వివేకానంద ఆవాస విద్యాలయం ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని మూడు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయతీ. మూడు రోజుల ముందు నుంచి ప్రదర్శనలు చేపడతారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులందరూ ర్యాలీగా వెళ్తూ జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తారు. ఈ సారి 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలు మరింత ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

దసరా వేళ ప్రత్యేకంగా..
చేగుంట, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకునే దసరా రోజు జాతీయ జెండా ఆవిష్కరణ ఆనవాయితీగా వస్తోంది. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఎగురవేయడంతో పాటు ఆ రోజున సదరు కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందుకు గ్రామస్థులందరూ ర్యాలీగా కూడలి వద్దకు వెళ్లి పూజలు చేపడుతుంటారు. స్వాతంత్రోద్యమ సమయంలో ఇది మొదలవగా.. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

నిత్యం జాతీయ గీతాలాపన
న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం: అక్కన్నపేట మండలం చౌటపల్లిలో నిత్యం జాతీయ గీతాలాపన చేస్తుండటం విశేషం. సాధారణంగా జాతీయ గీతాన్ని విద్యాసంస్థల్లో ఆలపిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం నిత్యం అందరిలో జాతీయ భావం పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ సర్పంచి గద్దల రమేశ్‌కు దేశభక్తి ఎక్కువ. గ్రామస్థులందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది సత్ఫలితాన్ని ఇస్తోంది. ఇందుకు నీటి ట్యాంకుపై అన్ని చోట్లకు వినిపించేలా మూడు పెద్ద మైకులు బిగించారు. నిత్యం ఉదయం 8.30 గంటలకు గీతాలాపన ప్రారంభమవుతుంది. అంతకుముందు అందరూ సన్నద్ధమయ్యేలా మైక్‌లో సైరన్‌ మోగిస్తారు. ఎక్కడివారు అక్కడే నిల్చుని సెల్యూట్‌ చేసి ‘జనగణ మన..’ గీతాన్ని పాడతారు. మొదట్లో యువకులు, విద్యావంతులు స్పందించగా.. ఇప్పుడు వృద్ధులు, మహిళలు సైతం పాటిస్తున్నారని చెప్పుకొచ్చారు సర్పంచి రమేశ్‌.

తిరంగా యాత్ర.. పోరాట బాట
దేశ స్వాతంత్య్రానికి, నిజాం పాలకను వ్యతిరేకంగా పోరాడిన యోధుల్లో జోగిపేటకు చెందిన గడీల లింగమయ్య గౌడ్‌ ఒకరు. స్వస్థలం సదాశివపేట. 60 ఏళ్ల కిందట జోగిపేటకు వచ్చి స్థిరపడ్డారు. సదాశివపేటలో ఉన్న సమయంలో స్థానికంగా 200 మంది యువకులతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఓ సారి జరిగిన సమావేశంలో నైజాం సర్కార్‌ ముర్దాబాద్‌ అంటూ నివాదాలు చేయడంతో నిజాం సైన్యం దాడి చేశారు. అందరూ పారిపోగా లింగమయ్యగౌడ్‌తో పాటు మరో 18 మంది పట్టుబడ్డారు. వారిపై కేసు పెట్టించి జైలు శిక్ష విధించారు. బయటకొచ్చాక రజాకార్లు ఇష్టానుసారంగా చెలరేగిపోగా.. వారి చర్యలను నిలువరించారు. ఎంతోమందిని వారి బారి నుంచి కాపాడారు. దీంతో మళ్లీ ఆయన్ను అరెస్టు చేసి సంగారెడ్డి జైలుకు తరలించారు. అక్కడి నుంచి చంచల్‌గౌడ జైలుకు తరలించారు. ఇక సైనిక చర్యతో హైదరాబాద్‌కు విముక్తి కలిగాక... జైలు నుంచి విడుదలయ్యారు. త్రివర్ణ పతకాలు పట్టుకొని వీధుల్లో తిరుగుతూ సంబరాలు జరిపారు. అప్పట్లో యువతలో స్వాతంత్రోద్యమ వాంఛను రగిలించడంతో కీలకంగా వ్యవహరించారు. ఈయన సేవలను గుర్తించిన ప్రభుత్వం స్వాతంత్య్ర సమయరయోధుడి గుర్తించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా తామ్ర పత్రాన్ని అందుకున్నారు. ఇటీవల 75 ఏళ్ల వేడుక సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా సత్కరించారు.
- న్యూస్‌టుడే, జోగిపేట


జీవిత నినాదం..
నా భారత సంస్కృతి శోభాయమానం
శాంతి సహనమే మా ఆయుధం
అహింసా పథమే మా సంస్కారం
ఎందరో మహానుభావుల త్యాగఫలం
శాశ్వతం మా మువ్వన్నెల పతాకం
సస్యశ్యామలం సుభిక్షం భిన్నత్వంలో ఏకత్వం
ప్రపంచానికి ఇదే మా మార్గ నిర్దేశం
చరితార్థం ఈ భారతావని భవితవ్యం
వందేమాతరం.. అదే మా జీవిత నినాదం
- శేషగిరి,   ఉపాధ్యాయులు, మంతన్‌గౌడ్‌ తండా, బషీరాబాద్‌

- న్యూస్‌టుడే, బషీరాబాద్‌


పెన్సిల్‌ లిడ్‌పై ఆకట్టుకునేలా..
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా తాండూరుకు చెందిన మణిసాయి పెన్సిల్‌ లిడ్‌పై జాతీయ జెండాను చెక్కి కళా నైపుణ్యాన్ని చాటారు. పట్టణంలోని గాంధీ నగర్‌లో నివాసం ఉంటే సురేష్‌, శోభ దంపతుల కుమారుడు మణిసాయి డిగ్రీ చదువుకున్నాడు. సూక్ష కళపై ఆసక్తిఉన్న అతను పెన్సిల్‌ కొన భాగంలో కేవలం 2 ఎంఎం పరిమాణంలో జాతీయ జెండాను తీర్చిదిద్దారు. వజ్రోత్సవాల నేపథ్యంలో జాతీయ భావం ఉట్టపడేలా మరిన్ని కళాకృతులను తయారు చేస్తానని అన్నారు.
- న్యూస్‌టుడే, పాత తాండూరు

భారీగా..మురిసిపోయేలా..

రెపరెపలాడే జాతీయ జెండా.. జాతీయ భావాన్ని తట్టిలేపుతుంది. హృదయంలో పదిలమైన దేశభక్తి.. ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. ఆ దిశగా సిద్దిపేట కలెక్టరేట్‌, కోమటిచెరువు వద్ద భారీ పతాకాలు దర్శనమిస్తాయి. కలెక్టరేట్‌ వద్ద 60 అడుగులు, కోమటిచెరువు చెంతన ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియంలో 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. 2017లో ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియం వద్ద, 2021లో కలెక్టరేట్‌ వద్ద భారీ పతకాలను ఏర్పాటు చేశారు. నిబంధనల మేర నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆయా ప్రాంతాలు స్వీయచిత్రాలకు వేదికలుగా మారుతున్నాయి.  - న్యూస్‌టుడే, సిద్దిపేట

ఊరూరా తిరుగుతూ..
- వీర్‌సంగప్ప, టేక్మాల్‌

ఓ వైపు రజాకార్లపై, మరోవైపు ఆంగ్లేయులపై పోరాటం చేశాం. టేక్మాల్‌ మండలం నుంచి 16 మంది ఉద్యమంలో పాల్గొన్నాం. ఊరూరా తిరుగుతూ చైతన్యం తీసుకొచ్చాం. జెండాలు మోశాం. స్వాతంత్య్రం వచ్చాక మమ్మల్ని అరెస్టు చేసి జైలులో ఉంచారు. ఏడాది పాటు గుల్బర్గాలో శిక్ష అనుభవించాం. తెలంగాణ విమోచనం దక్కాక విడుదలయ్యాం. ఊరికి వచ్చి జాతీయ జెండాను ఎత్తుకుని గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహించాం. ఇప్పటి యువత ఉన్నత చదువులు చదువుకుని సైన్యంలో చేరి దేశ సేవ చేయాలి.
- న్యూస్‌టుడే, టేక్మాల్‌

సంవిధానం..25 ఏళ్ల సంబరం..

స్వాతంత్య్రం వచ్చి 25 ఏళ్లయిన సందర్భంగా నర్సాపూర్‌లో శిలాఫలకం ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. దానిపై ఈ ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు శంకరప్ప పేరును చెక్కడం విశేషం. 1972లో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎదుట అప్పట్లో దీన్ని నెలకొల్పారు. ముందు వైపు హిందీ, తెలుగు భాషల్లో భారత సంవిధానం కోసం వేసిన శిలా శాసనం అని రాసి ఉంది. దానిపై భారతదేశ ప్రజలమైన మేము దేశాన్ని సార్వభౌమిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నెలకొల్పుటకు పౌరులకు ఆర్థిక, రాజకీయ న్యాయం.. భావం, భావ ప్రకటన, ధర్మం, ఆరాధన అంతస్తుతోనూ అవకాశంలోనూ సమానత్వం చేకూర్చేందుకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని.. రాష్ట్ర ఐక్యతను పెంపొందించడానికి తీర్మానించామని ప్రకటించినట్లు రాసి ఉంది. చర్రితకు సాక్ష్యంగా విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచిన ఈ ఫలకం పాలకుల నిర్లక్ష్యంతో దీన్ని తొలగించారు. జహీరాబాద్‌లోని ఉన్నత పాఠశాల ఆవరణలో ఇదే తరహాలో స్తూపాన్ని స్థాపించారు.

 

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts