logo

నీటి వనరుల బాగే లక్ష్యంగా..

గత మేలో తొలి విడత పనులు మొదలయ్యాయి. ఇప్పటికే చెరువులు, కుంటల బలోపేతానికి శ్రీకారం చుట్టాం. ఈనెల 15 నాటికి 20 శాతం పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పనులు పూర్తయిన చోట జెండావిష్కరణ చేపడతాం. ఈ పథకంతో అన్నదాతలకు ప్రయోజనం కలుగుతుంది

Updated : 13 Aug 2022 02:37 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, బొంరాస్‌పేట

గత మేలో తొలి విడత పనులు మొదలయ్యాయి. ఇప్పటికే చెరువులు, కుంటల బలోపేతానికి శ్రీకారం చుట్టాం. ఈనెల 15 నాటికి 20 శాతం పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పనులు పూర్తయిన చోట జెండావిష్కరణ చేపడతాం. ఈ పథకంతో అన్నదాతలకు ప్రయోజనం కలుగుతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి.
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా నీటి వనరుల బలోపేతానికి కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. జలాన్ని వృద్ధి చేసి సాగు, తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చేయాలన్న సంకల్పంతో దేశ వ్యాప్తంగా అమృత్‌ సరోవర్‌ పథకాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా నీటి వనరులను ఎంపిక చేసి వాటి బాగుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆగస్టు 15 వరకు వాటిల్లో పూడికి తీసి, పనులు పూర్తయిన చోట జాతీయ జెండాను ఆవిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా జిల్లాల్లో పనులు సాగుతున్నాయి.

గ్రామాలు, పట్టణాల్లో కొన్నేళ్లుగా చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నాయి. కొన్ని చోట్ల శికం భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. వీటి పరిరక్షణకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, చర్యలు తీసుకుంటున్నా ఫలితం శూన్యమే. కుంటలు, చెరువుల కబ్జాలతో నీటి నిల్వకు విస్తీర్ణం తగ్గడంతో వీటి ప్రభావం భూగర్భ జలాలపై పడుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు, భూగర్భ జలాల వృద్ధికి అమృత్‌ సరోవర్‌ పథకాన్ని కేంద్రం చేపట్టింది. చెరువుల్లో పూడిక తీయడంతో పాటు వాటిని అభివృద్ధి చేసి, వెదురు, టేకు మొక్కలు నాటాల్సి ఉంటుంది.
జిల్లాల్లో ఇలా..
*సంగారెడ్డి జిల్లాలో 101 నీటి వనరులను ఎంపిక చేశారు. తొలి విడతలో 75 చోట్ల పనులు పూర్తి చేయాలని లక్ష్యం విధించారు. అందులో 20 శాతం చొప్పున ఆగస్టు 15 వరకు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయగా ఆ దిశగా పనులు సాగుతున్నాయి. 21 వనరుల్లో పూడికతీత పనులు పూర్తి చేశారు. వాటిలో కల్హేర్‌లో మూడు, అందోల్‌, గుమ్మడిదల, నాగల్‌గిద్ద, నారాయణఖేడ్‌లలో రెండు చొప్పున ఎనిమిది, హత్నూర, సిర్గాపూర్‌, న్యాల్‌కల్‌, పటాన్‌చెరు, సంగారెడ్డి, రాయికోడ్‌, వట్‌పల్లి, కంగ్టి, మొగుడంపల్లి, కొండాపూర్‌లో ఒకటి చొప్పున నీటి వనరుల్లో ఆయా పనులు పూర్తయ్యాయి.
* వికారాబాద్‌ జిల్లాలో 75 నీటి వనరులను ఎంపిక చేసింది. రూ.7.50 కోట్లు ఖర్చు చేయటానికి అంచనాలు రూపొందించి పనులు చేపట్టారు. ముందుగా నీటి నిల్వకు అవకాశాలున్న ప్రాంతాల్లోని 52 చెరువుల్లో ఉపాధి కూలీలతో పనులు చేపట్టారు. వీటిలో 20 ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయి.


పనుల తీరు..
రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పూడికతీత కార్యక్రమాన్ని నాలుగు విడతలుగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ‘మిషన్‌ అమృత సరోవర్‌’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉపాధి హామీ పథకం నిధులను వెచ్చిస్తోంది. ఇందులో కూలీలకు ఒక్కో చెరువుకు 300 నుంచి 500 వరకు పని దినాలు కల్పించేలా లక్ష్యంగా నిర్దేశించారు. ఎంపిక చేసిన వనరుల్లో పూడికతీత, కట్టను బలోపేతం, ముళ్ల పొదలు తొలగించడం వంటి పనులు చేపడతారు.
- శ్రీనివాస్‌రావు, డీఆర్డీవో, సంగారెడ్డి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని