logo

మహాత్ముడి స్ఫూర్తి..ఆదర్శ దీప్తి!

పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. ఇది మహాత్ముడి మాట. నిజమే అవి అభివృద్ధి చెందితే దేశం స్వయంసమృద్ధి సాధించినట్లే. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ, మహాత్ముడిని స్ఫూర్తిగా సమష్టిగా అడుగేసి అభివృద్ధి

Published : 14 Aug 2022 01:46 IST

- ఈనాడు, సంగారెడ్డి

పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు.. ఇది మహాత్ముడి మాట. నిజమే అవి అభివృద్ధి చెందితే దేశం స్వయంసమృద్ధి సాధించినట్లే. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ, మహాత్ముడిని స్ఫూర్తిగా సమష్టిగా అడుగేసి అభివృద్ధి దిశగా సాగుతున్నాయి. అక్షరాస్యత, పరిశుభ్రత, మద్య నిషేధం.. ఇలా పలు అంశాల్లో మేటిగా నిలిచాయి. 75 ఏళ్ల స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ఆయా పల్లెలను మిగతావి ఆదర్శంగా తీసుకొని ఆ బాటలో పయనించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాలపై ‘ఈనాడు’ స్ఫూర్తిదాయక కథనం.

ఆడపిల్లకు.. ఊరంతా అండ

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం హరిదాస్‌పూర్‌ ఆడపిల్లలకు అండగా నిలుస్తోంది. ఇక్కడ అమ్మాయి పుడితే పండగ చేస్తారు. పంచాయతీ ఆధ్వర్యంలో అమ్మాయి పేరిట సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి తొలి నాలుగు ప్రీమియాలు చెల్లించేందుకు రూ.1000 అందిస్తున్నారు. ఆడపిల్లంటే భారం కాదని.. పురుషులతో సమానమేననే భావనను పెంచేందుకు 2020 జనవరి 1న దీనికి శ్రీకారం చుట్టారు. 12 ఏళ్లున్న ఆడపిల్లలందరి పేరిట ఖాతాలు తీయించారు. ఇప్పటివరకు 80 మందికి పైగా లబ్ధిపొందారు. ఈ స్ఫూర్తిని మిగతా పల్లెలూ అందిపుచ్చుకుంటున్నాయి.

స్వచ్ఛతలో భేష్‌..

సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం పలు అంశాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. పల్లెప్రగతి స్ఫూర్తిని అందిపుచ్చుకుంది. 2020 ఏడాది చివరి నుంచి ప్రణాళికతో ముందడుగు వేశారు. 490 ఇళ్లుండగా.. నిత్యం ఆరు ట్రైసైకిళ్ల ద్వారా చెత్త సేకరిస్తున్నారు. సేంద్రియ ఎరువు తయారీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎరువు విక్రయం ద్వారా పంచాయతీకి రూ.86 వేల వరకు ఆదాయం వచ్చింది. ఊరంతా వినిపించేలా అక్కడక్కడ మైక్‌సెట్లు, సీసీ కెమెరాలు అమర్చారు. చెత్త బయటపడేస్తే నిఘా కళ్లకు దొరికిపోతారు. జరిమానా తప్పదు. ఇప్పటి వరకు ఎవరూ అలా చెత్త బయట పడేయలేదు. యువ సర్పంచి మల్లారెడ్డి చొరవతో గ్రామస్థులు భాగస్వాములయ్యారు.

ప్రగతిపథం..

గ్రామస్థులంతా కలిసికట్టుగా అభివృద్ధికి బాటలు వేసుకున్నారు మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌ గ్రాస్థులు. సర్పంచి దివ్య, పాలకవర్గ సభ్యులు.. స్థానికుల సహకారంతో రాళ్లురప్పలతో ఉన్న ఏనగుట్టను చదును చేసి రైతువేదిక, వేడుక మందిరం నిర్మాణంతో పాటు పంట ఉత్పత్తులు ఆరబెట్టేందుకు 4 ఎకరాలు కేటాయించారు. కొనుగోలు కేంద్రానికి ఎకరం స్థలాన్ని కేటాయించారు. సహకార సంఘానికి మరో ఎకరం అప్పగించారు. ఇలా అందరూ కలిసి పల్లెను అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. - న్యూస్‌టుడే, కౌడిపల్లి

మద్యాన్ని నిషేధించి..

మద్యాన్ని నిషేధించి పక్కాగా అమలుచేస్తున్నారు చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట గ్రామస్థులు. మద్యంతో ఎంతో మంది నష్టపోయారు. కుటుంబాల్లో నిత్యం గొడవలు జరిగాయి. విసిగి వేసారిపోయిన మహిళలు, యువకులతో కలిసి సమావేశమై మద్యం విక్రయం, తాగడం పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. మహిళా సంఘం నాయకురాలు శివమ్మ ఆధ్వర్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించేలా కట్టుదిట్టం చేశారు. ఇప్పటికీ పక్కాగా దీన్ని అమలు చేస్తూ ఆదర్శంగా నిలిచారు. - చిన్నశంకరంపేట

సమష్టితత్వానికి నిదర్శనం

సమష్టి కృషి.. పట్టుదల.. ఆచరణకు నిదర్శనం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్‌ గ్రామం. 280 కుటుంబాలు ఉండగా, 1300 మంది జీవిస్తున్నారు. అందరికీ వ్యవసాయమే జీవనాధారం. 2014 ఆగస్టులో మంత్రి హరీశ్‌రావు దత్తత తీసుకోగా.. ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. పరిసరాల శుభ్రత, ఇంకుడు గుంతల నిర్మాణం, శుద్ధినీరు, మొక్కల సంరక్షణ, పాఠశాల అభివృద్ధి, సామూహిక గొర్రెల షెడ్లు, పశువుల వసతిగృహం, కందకాల నిర్మాణం, పందిరి సాగు, పురాతన బోరుబావుల రీఛార్జి, గ్రామస్థులందరికీ ఒకే దఫాలో మోటారు డ్రైవింగ్‌ లైసెన్సులు ఇలా అన్ని కార్యక్రమాలను చేపట్టి ఆదర్శంగా నిలిచారు. - న్యూస్‌టుడే, సిద్దిపేట అర్బన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని