logo

ఆధార్‌ ఉంటేనే ప్రయోజనం

విద్యార్థులందరికీ ఆధార్‌ గుర్తింపు కార్డు తప్పనిసరి.. ఈ నెంబరు ఉంటేనే ప్రతి ఏడాది పుస్తకాలు, ఏకరూప దుస్తులు, ఇతర సదుపాయాలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. కొత్తగా బడుల్లో చేరిన విద్యార్థుల్లో చాలా మందికి ఆధార్‌ కార్డులు లేవని విద్యాశాఖ

Published : 14 Aug 2022 01:46 IST

6,900 మంది విద్యార్థులకు లేవని గుర్తించిన విద్యాశాఖ

ఎమ్మార్సీల్లో నమోదుకు ఆదేశం

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ

విద్యార్థులందరికీ ఆధార్‌ గుర్తింపు కార్డు తప్పనిసరి.. ఈ నెంబరు ఉంటేనే ప్రతి ఏడాది పుస్తకాలు, ఏకరూప దుస్తులు, ఇతర సదుపాయాలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. కొత్తగా బడుల్లో చేరిన విద్యార్థుల్లో చాలా మందికి ఆధార్‌ కార్డులు లేవని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఇటీవల హైదరాబాద్‌లో ఎంఐఎస్‌ సమన్వయకర్తలు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు శిక్షణ సమావేశం నిర్వహించారు. పాత మండలాల్లోని ఎమ్మార్సీల్లో గతంలోనే పంపిణీ చేసిన ఆధార్‌ కిట్లు ఉన్నాయి. కరోనా పరిస్థితులు కుదుటపడినా.. వీటిని వినియోగించలేదు. వీటిలో సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడ్‌ చేసి ఆధార్‌ కార్డులు విద్యార్థులకు ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. మండల కేంద్రాల్లోనే శిబిరాలు నిర్వహించి ఈ సేవలు అందించనున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

పరికరాలు వినియోగించేలా..

జిల్లాలోని 1,247 పాఠశాలల్లో 1,23,289 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఈ ఏడాది 1వ తరగతిలో 9,230 మంది విద్యార్థులు నూతనంగా చేరారు. వీరికి ఆధార్‌ నంబర్‌ లేకున్నా పాఠశాలల్లో చేర్చుకున్నారు. నమోదు చేసుకొని కార్డులు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకపోవడంతో విద్యాశాఖ ఇచ్చే సదుపాయాలకు దూరం కావాల్సి వస్తోంది. దీన్ని గుర్తించిన విద్యాశాఖ నూతన విద్యార్థులకు మండల వనరుల కేంద్రంలోనే ఆధార్‌ నమోదు చేయించేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి సంవత్సరం యూ డైస్‌ (డిస్ట్రిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం..ఎడ్యుకేషన్‌) పేరుతో ప్రతి ఏడాది పాఠశాలల్లో సదుపాయాలతో పాటు విద్యార్థుల పూర్తి వివరాలు నమోదు చేసుకుంటారు. ఇందుకోసం విద్యార్థి పూర్తి వివరాలతో పాటు ఆధార్‌ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ ఏడాది 1వ తరగతిలో చేరిన వారిలో 6,900 మందికి ఆధార్‌ కార్డులు లేవని గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది గ్రామాల్లో చదివే విద్యార్థులే ఉన్నారు. అలాంటి వారికి ఉపాధ్యాయుల సహకారంతో ఎమ్మార్సీల్లోని పాత కిట్లను వినియోగంలోకి తెచ్ఛి. వాటి ద్వారా ఆధార్‌ కార్డులకు నమోదు చేయించేలా కసరత్తు చేస్తున్నారు. ఈ నంబర్‌ కేటాయిస్తే వచ్చే ఏడాదికి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. ఇప్పటికే పాఠశాలల్లో చేరిన విద్యార్థుల ఆధార్‌ కార్డుల్లో ఏమైనా సవరణలు చేయాల్సి ఉన్నా.. పరిశీలిస్తారు. అడ్రస్‌ మార్పు, ఫొటో అప్‌లోడ్‌, పేర్ల మార్పులాంటి వాటికి అవకాశం కల్పిస్తారు.

పాత మండలాల్లోనే కిట్లు

జిల్లాలో 27 మండలాలు ఉన్నాయి. పాత మండలాలైన 19 చోట్లనే ఆధార్‌ కిట్లు ఉన్నాయి. ఇవీ మూలకు చేరాయి. వీటిని తీసి మరమ్మతులు చేయించాలి. కొత్త ఆధార్‌ కార్డులు కావాలన్నా.. మార్పులు చేయించుకోవాలన్నా.. పాత మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు వెళ్లాల్సిందే. కొత్త మండలాలకు కూడా కొత్త కిట్లు కేటాయించాలని పలువురు కోరుతున్నారు. విద్యార్థులను ఎమ్మార్సీలకు తీసుకువచ్ఛి. మళ్లీ పాఠశాలలకు తీసుకెళ్లే బాధ్యతను ఉపాధ్యాయులతో పాటు ఆయా పాఠశాల సముదాయాల్లో పని చేసే సీఆర్పీలు పర్యవేక్షించాలి.

అందరికీ అందించాలని..: రాజేశ్‌, జిల్లా విద్యాధికారి

ప్రతి ఒక్కరికి ఆధార్‌ నంబర్‌ ఉంటేనే ప్రభుత్వం కల్పించే పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం ఇతర వసతులు కల్పిచగలం. లేని వారి కోసం ప్రత్యేకంగా ఎమ్మార్సీల్లో క్యాంపులు నిర్వహించాలని ఉన్నతాధికారులు సూచించారు. వారి కోసం ఎమ్మార్సీల్లో కిట్లతో ఆధార్‌ నంబర్‌ కేటాయిస్తాం.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని