logo

సగమైనా భర్తీ కాలే!

ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సులవైపు చూసే విద్యార్థులు ఎక్కువ మందే ఉంటారు. ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, తెలంగాణ(దోస్త్‌) వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే

Published : 14 Aug 2022 01:46 IST

పలు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల తీరిది..

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

సంగారెడ్డి తారా కళాశాలలో ప్రవేశాల సందడి

ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సులవైపు చూసే విద్యార్థులు ఎక్కువ మందే ఉంటారు. ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, తెలంగాణ(దోస్త్‌) వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2016-17 విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీనిద్వారా వారికి ఇష్టమైన కళాశాలల్లో చేరే అవకాశాన్ని కల్పించారు. ఈ విద్యా సంవత్సరానికి మొదటి దశకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, కళాశాలలకు విద్యార్థుల కేటాయింపు (అలాట్‌మెంట్‌)ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. సెల్ప్‌ లాగిన్‌ ద్వారా విద్యార్థులు స్వీయ ధ్రువీకరణ(సెల్ఫ్‌ రిపోర్టింగ్‌) చేసేందుకు గడువు ఈనెల 18తో ముగియనున్న నేపథ్యంలో కథనం.

కొనసాగుతున్న ప్రక్రియ

జిల్లాలో సంగారెడ్డిలో తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, జోగిపేట, జహీరాబాద్‌, సదాశివపేట, పటాన్‌చెరు, నారాయణఖేడ్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం 27 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. దోస్త్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసిన విద్యార్థుల సమాచారం కళాశాల విద్యాశాఖ లాగిన్‌కు చేరుతుంది. అక్కడి నుంచి విద్యార్థుల ఐచ్ఛికాల ఆధారంగా కళాశాలలకు విద్యార్థుల్ని కేటాయిస్తారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ కళాశాలల్లో మొదటి విడతలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసిన విద్యార్థుల్ని ఇప్పటికే ఆయా కళాశాలలకు అలాట్‌ చేశారు.

సీట్లు 4,260.. కేటాయింపు 1,923

ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఈ సంవత్సరం 4,260 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దోస్త్‌ మొదటి విడతలో దరఖాస్తు చేసిన విద్యార్థుల ఐచ్ఛికాల ఆధారంగా 1,923 మందిని ఆయా కళాశాలలకు (అలాట్‌) కేటాయింపు చేశారు. దీంతో మొదటి విడతలో సగం సీట్లు కూడా భర్తీ కాని పరిస్థితి. అలాట్‌ అయిన విద్యార్థులు మీసేవ కేంద్రాలకు వెళ్లి సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే కళాశాలలో ప్రవేశ అర్హతను కోల్పోతారు. విద్యార్థులు కొందరు అవగాహన లోపంతో ఈ ప్రక్రియను పూర్తి చేయడం లేదు. దరఖాస్తు చేయడం, సీటు అలాట్‌మెంట్‌ కావడంతో తమ పని పూర్తయిందని భావిస్తుండటంతో సీట్ల భర్తీ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఈనెల 18లోగా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేస్తేనే కళాశాలలో విద్యార్థులకు సీటు నిర్ధరణ అవుతుంది.

‘తారా’లో డిమాండ్‌

సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్‌ గుర్తింపు కలిగి ఉంది. ఇందులో అత్యధికంగా 1,620 సీట్లు ఉండగా తొలి విడతలోనే 1,010 మంది విద్యార్థులకు సీట్లు అలాట్‌ చేయడం విశేషం. ఎక్కువ మంది విద్యార్థులు తాము ఇచ్చిన ఐచ్ఛికాల్లో ‘తారా’ కళాశాలను ఎంచుకోవడమే దీనికి కారణం. రెండో విడత సీట్లకు పోటీ తీవ్రంగా ఉండనుంది.

రెండో విడతలో చేరికలు పెరిగే అవకాశం - ప్రవీణ, ప్రిన్సిపల్‌, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల(సంగారెడ్డి)

తారా ప్రభుత్వ కళాశాలకు ఇప్పటికే 62 శాతం విద్యార్థుల్ని కేటాయించారు. రెండో విడతలోనే మిగతా సీట్లన్నీ భర్తీ అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో మిగతా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉంటుందని భావిస్తున్నాం. మొదటి విడతలో సీటు అలాట్‌ అయిన విద్యార్థులు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ను గడువు లోగా పూర్తిచేయాలి. జాప్యం చేస్తే సీటు కోల్పోతారు. దోస్త్‌ సహాయ కేంద్రం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని