logo

పాదం కలిపి నడిచారు.. స్వాతంత్య్ర స్ఫూర్తి రగిల్చారు!

అడుగడుగునా దేశభక్తి ఉప్పొంగింది. 750 మీటర్ల జాతీయ పతాకం... ఇరువైపులా విద్యార్థులు, యువత. బోనాలతో కదిలొచ్చిన మహిళలు.. పోతరాజుల విన్యాసాలు... చిందుకళాకారుల నృత్యాలు.. భిన్న కులాల వారు వృత్తి వేషధారణలతో హాజరు..

Published : 14 Aug 2022 01:46 IST

సంగారెడ్డి పట్టణంలో అట్టహాసంగా ఫ్రీడం ర్యాలీ

పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు

ఈనాడు, సంగారెడ్డి

అడుగడుగునా దేశభక్తి ఉప్పొంగింది. 750 మీటర్ల జాతీయ పతాకం... ఇరువైపులా విద్యార్థులు, యువత. బోనాలతో కదిలొచ్చిన మహిళలు.. పోతరాజుల విన్యాసాలు... చిందుకళాకారుల నృత్యాలు.. భిన్న కులాల వారు వృత్తి వేషధారణలతో హాజరు.. ఎన్‌సీసీ క్యాడెట్ల కవాతులు.. సంగారెడ్డి ప్రధాన రహదారిపై ప్రతి ఒక్కరి చేతిలో జాతీయ జెండాలు... జైహింద్‌ నినాదాలు... ఒక్కమాటలో చెప్పాలంటే పండగలన్నీ ఒక్కసారే వచ్చినంత సంబరం. ఇదీ సంగారెడ్డి పట్టణంలో ఫ్రీడం ర్యాలీ నిర్వహణ సందర్భంగా కనిపించిన దృశ్యం. జిల్లా పాలనాధికారి శరత్‌ నేతృత్వంలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, జడ్పీ అధ్యక్షుడు మంజుశ్రీ, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్‌, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌, సంగారెడ్డి పురపాలిక అధ్యక్షురాలు విజయలక్ష్మి, తెరాస జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌.. ఇలా అంతా కలిపి వేల మందితో ర్యాలీలో పాదం కలిపి నడిచారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న గడీల లింగమయ్యగౌడ్‌తో పాటు మరో మహిళకు సన్మానం చేసి గౌరవించారు. త్రివర్ణ బెలూన్లను, పావురాలను ఎగరేశారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో వజ్రోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని 75 అడుగుల ఎత్తైన జెండాను ఏర్పాటు చేశారు. మంత్రి హరీశ్‌రావు దీనిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అన్నమో రామచంద్రా అనే పరిస్థితి నుంచి 75 ఏళ్లలో ఇతర దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి దేశం ఎదిగిందని అన్నారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తిలో మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణలోని పల్లెలు గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి ప్రతీకలుగా మారాయన్నారు. సంసద్‌ ఆదర్శ్‌ యోజనలో అవార్డు పొందిన తొలి 20లో 19 మన రాష్ట్రానికి చెందిన పల్లెలు ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఆగస్టు 15న కొత్తగా 42వేల మందికి ఆసరా పథకంలో భాగంగా పింఛన్లు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. భారీస్థాయిలో ర్యాలీ నిర్వహించడం, దానిని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా పాలనాధికారి శరత్‌ను అభినందించారు. ఈపనిలో భాగస్వామ్యులయిన అదనపు పాలనాధికారులు రాజర్షిషా, వీరారెడ్డిలతో పాటు ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

జెండా వందనం చేస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి,

బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు, క్రాంతికిరణ్‌, అధికారులు


ర్యాలీలో విద్యార్థిని ఉత్సాహం..


మహనీయుల వేషధారణలో చిన్నారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని