logo

మెతుకుసీమ హోరు.. పురోగతి జోరు

స్వాతంత్య్ర సమరంతోపాటు, తెలంగాణ విమోచనోద్యమానికి ఎందరో యోధులను అందించిన వీరగడ్డ.. ప్రధానమంత్రిని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన ఘనత.. రెడ్డిరాజుల ‘రాచవీడు’గా, గోల్కోండ సుల్తానుల ‘గుల్షాణాబాదు’గా.. నిజాం నవాబుల ‘సుభా’గా వెలుగొందిన కేంద్రం.. ఇలా ఎన్నో విశిష్టతలతో విరాజిల్లింది మన మెతుకుసీమ. స్వాతంత్య్రం, తెలంగాణ

Published : 15 Aug 2022 02:36 IST

న్యూస్‌టుడే, మెదక్‌

స్వాతంత్య్ర సమరంతోపాటు, తెలంగాణ విమోచనోద్యమానికి ఎందరో యోధులను అందించిన వీరగడ్డ.. ప్రధానమంత్రిని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన ఘనత.. రెడ్డిరాజుల ‘రాచవీడు’గా, గోల్కోండ సుల్తానుల ‘గుల్షాణాబాదు’గా.. నిజాం నవాబుల ‘సుభా’గా వెలుగొందిన కేంద్రం.. ఇలా ఎన్నో విశిష్టతలతో విరాజిల్లింది మన మెతుకుసీమ. స్వాతంత్య్రం, తెలంగాణ విమోచనం అనంతరం ఉమ్మడి జిల్లాగా కొనసాగి.. ఆరేళ్ల కిందట కొత్త జిల్లాగా ఆవిర్భవించి పురోగతి దిశగా దూసుకెళ్తోంది. నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రగతిపథంపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

జిల్లాలో ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టడంతో ఆయకట్టు విస్తీర్ణం పెరిగింది. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు అందుతుండటంతో సాగుకు మరింత దోహదపడింది. ఆయా పంటలపై పరిశోధనలు సాగించడమే కాకుండా సేంద్రియాన్ని ప్రోత్సహిస్తున్నారు. పాలనా సౌలభ్యానికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో 2016 అక్టోబరులో 20 మండలాలతో మెదక్‌ పట్టణ కేంద్రంగా జిల్లా ఆవిర్భవించింది. ప్రస్తుతం 21 మండలాలు, నాలుగు పురపాలికలు ఉన్నాయి.


నూతన వంగడాలకు మేలు..

ఏమిటి: వ్యవసాయ పరిశోధనా స్థానం

ఎక్కడ: నత్నాయిపల్లి, నర్సాపూర్‌

స్థాపించింది: 2010లో..  విస్తీర్ణం: 75 ఎకరాలు

అన్నదాతలు మూస పద్ధతిలో పంటలు సాగు చేయకుండా ప్రయోగాలతో నూతన వంగడాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో. ఆయా విత్తనాలను రైతులకు అందిస్తూ సాగుకు ప్రోత్సహిస్తున్నారు. వరి పంటపై ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. మేలురకం విత్తనాలను విక్రయిస్తున్నారు.


సేంద్రియ సాగుకు ప్రోత్సాహం

ఏమిటి: కృషి విజ్ఞాన కేంద్రం

ఎక్కడ: తునికి, కౌడిపల్లి

ఎప్పుడు: 2017లో..  * శాస్త్రవేత్తలు: 6 మంది

జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడి శాస్త్రవేత్తలు నిరంతరం సేంద్రియ సాగుపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. రసాయనాలతో కలిగే అనర్థాలపై చైతన్యం తీసుకొస్తున్నారు. కేంద్రం ఆవరణలో కూరగాయలు, మిశ్రమ పంటలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ వాటి ఫలితాలను వివరిస్తున్నారు.


పర్యాటకులను అలరిస్తోంది..

ఏమిటి: వన్యప్రాణి అభయారణ్య

ఎక్కడ: పోచారం, హవేలిఘనపూర్‌

ఈ అభయారణ్యం మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల మధ్యన ఉంది. 164 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండగా, జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం 125 హెక్టార్లలో, రెండో కేంద్రం 39 హెక్టార్లలో ఏర్పాటుచేశారు. నిజాం కాలంలో ‘షికార్‌ ఘర్‌’గా వెలుగొందిన ఈ ప్రాంతం నేడు సందర్శన కేంద్రంగా మారింది. అటవీ ప్రాంతం, వన్యప్రాణులను తిలకించేందుకు మూడు వాచ్‌ టవర్లను నిర్మించారు. అభయారణ్యంలో పలు జంతువులు ఉండగా, వాటిని తిలకించేందుకు పర్యాటకులకు అనుమతి ఉంది.


నెరవేరిన కల..

ఏమిటి: రైలు సౌకర్యం

ఎక్కడ: అక్కన్నపేట నుంచి మెదక్‌ వరకు..

వ్యయం: రూ.204 కోట్లు * దూరం: 17.2 కి.మీ.

జిల్లాలో మనోహరాబాద్‌, మాసాయిపేట, వడియారం, మిర్జాపల్లి, అక్కన్నపేటల మీదుగా రైల్వేలైన్‌ సౌకర్యం ఉంది. మెదక్‌ పట్టణానికి రైలుమార్గం ఏర్పాటు దశాబ్దాల కల. మెదక్‌ ఎంపీగా గెలుపొంది, ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఇందిరాగాంధీ హయాం నుంచి ఈ హామీ ఉంది. ఎట్టకేలకు 2012-13లో రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్‌ వరకు లైన్‌ మంజూరైంది. రేక్‌పాయింట్‌ మంజూరు కావడంతో ఇటీవల గూడ్స్‌ రైలు పట్టాలెక్కింది.


నలువైపులా జాతీయ రహదారులు

44వ జాతీయ రహదారి మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ నుంచి రామాయంపేట మండలం దామరచెరువు వరకు 55 కి.మీ. విస్తరించింది. 161: అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌ నుంచి పెద్దశంకరంపేట జంబికుంట వరకు 28 కి.మీ.ల మేర.. 765 (డి): నర్సాపూర్‌ మండలం కొండాపూర్‌ నుంచి మెదక్‌ పట్టణం వరకు 43 కి.మీ. హవేలిఘనపూర్‌ నుంచి బోధన్‌ వరకు ఈ రహదారిని విస్తరించనున్నారు.


ఉమ్మడిలో.. తొలి జలాశయం

ఏమిటి: ఘనపూర్‌ ప్రాజెక్టు

ఎక్కడ: మంజీరాపై కొల్చారం మండలం చిన్నఘనపూర్‌ వద్ద

ఎప్పుడు: 1905లో..   ఆయకట్టు: 30 వేల ఎకరాలు

ఉమ్మడి జిల్లాలో తొలి జలాశయం. రైతులకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో నిజాం పాలనా కాలంలో నిర్మించారు. తొలుత 21,625 ఎకరాలు ఆయకట్టుగా నిర్దేశించారు. దీని పరిధిలోని ఫతేనహర్‌, మహబూబ్‌నహర్‌ కాలువల ఆధునికీకరణ, బ్రాంచ్‌ కెనాళ్ల పనులు చేపట్టడంతో ఆయకట్టు 30 వేలకు పెరిగింది. ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం 0.135 టీఎంసీలు. ప్రస్తుతం ఆనకట్ట ఎత్తును పెంచే పనులు మొదలుపెట్టారు. ఇవి పూర్తయితే మెదక్‌, హవేలిఘనపూర్‌, కొల్చారం, పాపన్నపేట మండలాలకు ప్రయోజనం చేకూరుతోంది.

1918లో రాయిన్‌పల్లి..

మెదక్‌ మండలం రాయిన్‌పల్లి ప్రాజెక్టును 1918లో పూర్తయింది. రామాయంపేట మండలం పర్వాతాపూర్‌, కాట్రియాల నుంచి అటవీ ప్రాంతాల ద్వారా వరద ఈ ప్రాజెక్టులోకి చేరుతోంది. కొన్నేళ్లుగా ప్రాజెక్టు నీళ్లను కొంటూర్‌ చెరువుకు మళ్లిస్తున్నారు. ఈ చెరువు ఏడు గ్రామాలకు అదెరువు. మెదక్‌ గోసంద్రం చెరువులోకి చేరేందుకు కాలువను నిర్మించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు