logo

కొత్తవి వస్తాయని.. పాతవి పారేసుకుంటారా!

‘రాజుల సొమ్ము రాళ్ల పాలు’ అనే నానుడికి హుస్నాబాద్‌ ఆసుపత్రిలోని పరికరాలు సరిపోలుతాయి. ఈ దవాఖానాను వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందుకు అవసరమైన వైద్య సేవలకు కొత్తగా ఆధునిక పరికరాలు, యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

Updated : 16 Aug 2022 07:08 IST

ఆసుపత్రి పాత భవనం బయట పడవేసిన పరికరాలు, యంత్రాలు

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌: ‘రాజుల సొమ్ము రాళ్ల పాలు’ అనే నానుడికి హుస్నాబాద్‌ ఆసుపత్రిలోని పరికరాలు సరిపోలుతాయి. ఈ దవాఖానాను వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందుకు అవసరమైన వైద్య సేవలకు కొత్తగా ఆధునిక పరికరాలు, యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పాతవి కొద్దిపాటి మరమ్మతులు చేసి పునర్వినియోగంలోకి తేకుండా మూలన పడేస్తున్నారు. మట్టిలో, వర్షంలో పరికరాలు, సామగ్రి ఉండటంతో తుప్పు పడుతున్నాయి. తర్వాత దశలో దేనికి పనికిరాకుండా వ్యర్థాల్లోకి చేరే అవకాశముంది. హుస్నాబాద్‌లోని 30 పడకల ప్రాథమికోన్నత శ్రేణి ఆరోగ్య కేంద్రానికి చెందిన లక్షలాది రూపాయల విలువ చేసే వైద్య పరికరాలు, మంచాలను బయట పడేశారు. ఇందులో కొన్ని అసలు ఉపయోగించనివీ ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించడానికి పదేళ్ల క్రితం ఈ ఆసుపత్రికి లక్షలాది రూపాయలు వెచ్చించి పరికరాలను ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిని వినియోగించకుండానే వృథాగా పడేసి పనికి రాకుండా చేస్తుండటం గమనార్హం.

తుప్పు పడుతున్న మంచాలు

మూలకు ఇంక్యుబేటర్‌..

కొన్ని పరికరాలను కనీసం ఉపయోగంలోకి తెచ్చే ప్రయత్నాలు జరగటం లేదు. అవకాశాలు ఉన్నా అందుకు అనుగుణంగా సిబ్బంది లేరు. దీంతో వాటిని మూలన పడేశారు. ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్‌లోకి మారిన తర్వాత మంత్రి హరీశ్‌రావు, శాసనసభ్యుడు సతీశ్‌కుమార్‌ ఎప్పటికప్పుడు సంబంధిత నిర్మాణ పనులపై సమీక్ష చేస్తున్నారు. దాదాపు 35 ఏళ్ల క్రితం నిర్మించిన 30 పడకల ఆసుపత్రి పాత భవనాన్ని ఆధునీకరిస్తున్నారు. మరమ్మతులు చేయాల్సిన వైద్య పరికరాలను పాత భవనంలో ఆరుబయట వేశారు. ఇందులో నవజాత శిశువులకు ఉపయోగించే ఇంక్యూబేటర్‌, శస్త్ర చికిత్స విభాగంలో వినియోగించే వివిధ రకాల సామగ్రి ఉన్నాయి. 20 మంచాలు బయట పడవేశారు. గతంలో ఎక్స్‌రే ప్లాంటునూ మూలన పడేశారు. ఎంతో ఖర్చు చేసి ప్రజలకు ఉపయోగపడటానికి తెచ్చిన వైద్య పరికరాలను ఇలా వృథా అయ్యేలా పారేయడంతో స్థానికులు విస్తుబోతున్నారు. సొంతంగా ఇళ్లల్లో సామగ్రిని ఇలాగే పడేసుకుంటారా.. ప్రజాధనమంటే చులకనా.. అని ప్రశ్నిస్తున్నారు. వీటిని రోగులకు ఉపయోగపడే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆసుపత్రి పనితీరుపై తరచూ పర్యవేక్షణ జరపాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు