logo

గేట్లెత్తుతున్నారు.. చిక్కుకుపోతున్నారు!

భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో దిగువకు నీరు వదులుతున్నారు. దీంతో మంజీరా పరవళ్లు తొక్కుతోంది. ఏటా వర్షాకాలంలో ఈ పరిస్థితి నెలకొంటుండగా.. తరచూ నదిలో పలువురు

Published : 30 Sep 2022 02:22 IST

గురువారం మంజీరాలో మత్స్యకారులను తాడు సాయంతో ఒడ్డుకు చేర్చుతూ..

న్యూస్‌టుడే, మెదక్‌, పాపన్నపేట, కొల్చారం: భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో దిగువకు నీరు వదులుతున్నారు. దీంతో మంజీరా పరవళ్లు తొక్కుతోంది. ఏటా వర్షాకాలంలో ఈ పరిస్థితి నెలకొంటుండగా.. తరచూ నదిలో పలువురు చిక్కుకుపోతున్న ఘటనలు చేసుకుంటుండటం ఆయా శాఖల అధికారులకు తలనొప్పిగా మారుతోంది. ఒక్కోసారి గేట్ల ఎత్తివేతపై ముందస్తు సమాచారం ఉంటుండగా... ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం వద్ద 29 టీఎంసీల సామర్థ్యంతో సింగూరు జలాశయం నిర్మించారు. దీన్ని సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో తాగునీరు, సాగుకు వినియోగిస్తున్నారు. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురిసే వర్షాలకు ప్రాజెక్టు నిండుతోంది. నీటిమట్టం పెరిగితే దిగువన మెదక్‌ జిల్లా పరిధిలోని ఘనపూర్‌ ఆనకట్టకు వదులుతారు. పంటలకు అవసరమయ్యే నీరు పోను మిగతావి మంజీరా నది గుండా నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి కలుస్తాయి. ఏడేళ్లలో ఇప్పటి వరకు సింగూరు నుంచి 200 టీఎంసీలు ఘనపూర్‌ ఆనకట్టకు వదలగా.. అవి వృథాగా కిందకు చేరాయి. ప్రస్తుతం సింగూరు నుంచి ఐదు విడతలుగా 41 టీఎంసీలు వదలగా... వర్షాలకు మరో రెండు, మూడు టీఎంసీలు ఘనపూర్‌ ఆనకట్ట నుంచి దిగువకు వెళ్లాయి.

ప్రతి ఏటా...
ఏటా గొర్రెలకాపరులు, మత్స్యకారులతోపాటు స్థానికులు మంజీరా పరివాహక ప్రాంతాలకు వస్తుంటారు. గడ్డి లభించడం, నీరు అందుబాటులో ఉండడంతో పలువురు రోజుల తరబడి ఇక్కడ ఉంటారు. పాపన్నపేట మండలం ఎన్కేపల్లి నుంచి కొంపల్లి వరకు మంజీరా ప్రవహిస్తుంది. రామతీర్థం, ముద్దాపూర్‌, ఎల్లాపూర్‌, నాగ్సాన్‌పల్లి, ఏడుపాయల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్తుంటారు. కొల్చారం మండలం పోతంశెట్‌పల్లి, కిష్టాపూర్‌ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ గుట్టలు ఉండడంతో గొర్రెలు, మేకలను కాపరులు తీసుకెళ్తుంటారు. 2016 సెప్టెంబరులో ఏడుపాయలలోని చెక్‌డ్యాం వద్ద పలువురు కార్మికులకు ఇదే పరిస్థితి ఎదురైంది. వాయుసేన హెలిక్యాప్టర్‌ సాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు. గతేడాది కొల్చారం మండలం కిష్టాపూర్‌-రాంపూర్‌ మధ్య నలుగురు చిక్కుకోగా హెలిక్యాప్టర్‌ ద్వారా రక్షించారు. ఇటీవల కొల్చారం మండలం కిష్టాపూర్‌ వద్ద ఇద్దరు, మరుసటి రోజు మరో నలుగురు మంజీరాలో చిక్కుకున్నారు. అధికారులు స్పందించడంతో సురక్షితంగా బయటపడ్డారు. కిష్టాపూర్‌ వద్ద ఇద్దరు. మరుసటి రోజు మరో ఆరుగురు చిక్కుకోగా జాకెట్ల సహాయంతో ఒడ్డుకు చేర్చారు. గురువారం మెదక్‌-పాపన్నపేట మండలాల సరిహద్దులో ఆరుగురిని రక్షించారు. రెవెన్యూ శాఖ అధికారులు ఆయా గ్రామాల్లో టాంటాం వేయిస్తుంటారు. చాలా మందికి ఈ విషయం తెలియకపోవడం...ప్రవాహాన్ని అంచనా వేయకుండా... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం..
- శివనాగరాజు, డీఈఈ, నీటిపారుదల శాఖ

సింగూరు నుంచి దిగువన ఉన్న ఘనపూర్‌కు నీటి విడుదల విషయాన్ని ఎప్పటికప్పుడు ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులకు చేరవేస్తున్నాం. వారు గ్రామాల్లో టాంటాం వేయించి.. అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో నీటి విడుదల సమయంలో సమాచారం ఇస్తున్నాం. ఆ సమయంలో ప్రజలకు విషయం తెలియకపోవడంతో ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సూచనలు చేశాక కూడా వెళ్లే సాహసం చేయడం ఎంతో ప్రమాదకరమని గుర్తించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని