logo

పల్లె సేవకు సై..

తరగతి గదులు.. పుస్తకాలు ఇదే లోకం. ఇప్పుడు వారంతా పల్లె బాట పట్టారు. తరగతి గదికి బయటి ప్రపంచానికి తేడాని గమనిస్తున్నారు. అన్నదాతలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ఎంచుకున్న వ్యవసాయ

Published : 02 Oct 2022 01:26 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, కంది


రైతులకు అవగాహన కల్పిస్తూ..

తరగతి గదులు.. పుస్తకాలు ఇదే లోకం. ఇప్పుడు వారంతా పల్లె బాట పట్టారు. తరగతి గదికి బయటి ప్రపంచానికి తేడాని గమనిస్తున్నారు. అన్నదాతలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ఎంచుకున్న వ్యవసాయ డిగ్రీ కోర్సులో భాగంగా జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రత్యేక శిబిరంలో ప్రజలతో మమేకం అవుతున్నారు. కంది మండలం మామిడిపల్లిలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో శిబిరం కొనసాగుతున్న తీరుపై కథనం.

ఏం చేస్తున్నారంటే..
* ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు మొక్కలు నాటుతున్నారు. మొక్కల సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన పెంపొందించేందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచిస్తున్నారు.
* రైతులు ఎక్కువగా కలుపు మొక్కల బెడదతో నష్టపోతున్నారు. పంట పెట్టుబడిలో అధికంగా దీని కోసమే వెచ్చించాల్సి వస్తోంది. దీన్ని గుర్తించిన వాలంటీర్లు  కలుపు మొక్కలు, వయ్యారి భామ నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు.
* గ్రామంలో ఎక్కువ మంది పత్తి పంటను పండిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటే విధానాన్ని వివరిస్తున్నారు.
* గ్రామంలో పశు సంపదను గుర్తించేందుకు సర్వే నిర్వహించారు. ఇందులో 535 పశువులు ఉన్నట్లు తేల్చారు. పశువైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా టీకాలు వేయించడంతో పాటు మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
* పంట దిగుబడులు అధికంగా రావాలంటే భూసార పరీక్షలు చేయించడం ముఖ్యం. మామిడిపల్లిలో ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరంలో అదే చేశారు. రైతుల పంట పొలాల నుంచి మట్టిని తెప్పించి భూసార పరీక్షలు చేయించారు.
* ప్లాస్టిక్‌ వినియోగంతో కలిగే అనర్థాలపై ర్యాలీలు నిర్వహిస్తూ చైతన్యం తీసుకువస్తున్నారు. గ్రామంలో ప్లాస్టిక్‌ నిషేధం పక్కాగా అమలయ్యేలా అందరూ బాధ్యతగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు.

113 మంది వాలంటీర్లు
ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక శిబిరంలో భాగంగా 113 మంది వాలంటీర్లు మామిడిపల్లి గ్రామానికి వచ్చారు. వారం రోజుల పాటు శిబిరం కొనసాగుతుంది. అందరూ ఇదే గ్రామంలో బస చేస్తున్నారు. వీరంతా ఇప్పుడు గ్రామీణ ప్రాంత పరిస్థితులపై ప్రత్యక్షంగా అవగాహన పెంచుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని