logo

గొల్లభామ మెరిసింది.. మగ్గం మురిసింది!

ఈ ప్రాంత కళాత్మక వైభవాన్ని చాటే గొల్లభామ చీర.. మరోసారి మెరిసింది. నేతన్న నైపుణ్య సృష్టికి తార్కాణంగా.. యునెస్కో విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది. ‘21 శతాబ్దం కోసం తయారీ చేసిన చేనేత వస్త్రాలు - సంప్రదాయ భారతీయ వస్త్రాల సంరక్షణ’..

Updated : 02 Oct 2022 06:04 IST

న్యూస్‌టుడే, సిద్దిపేట


చీర నేత పనిలో కార్మికుడు

ఈ ప్రాంత కళాత్మక వైభవాన్ని చాటే గొల్లభామ చీర.. మరోసారి మెరిసింది. నేతన్న నైపుణ్య సృష్టికి తార్కాణంగా.. యునెస్కో విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది. ‘21 శతాబ్దం కోసం తయారీ చేసిన చేనేత వస్త్రాలు - సంప్రదాయ భారతీయ వస్త్రాల సంరక్షణ’ పేరిట విడుదల చేసిన నివేదికలో తెలుగు రాష్ట్రాల్లో మూడింటికి చోటు దక్కింది. పల్లె సిగలో నడయాడే మగువ (గొల్ల వనిత) తలమీద చల్లకుండ.. కుడిచేతిలో గురిగి.. కాళ్లకు గజ్జెలు, కొప్పులో పూలు ధరించి.. సంచరించే గొల్లభామ నేతన్న చీరల్లో దశాబ్దాల కిందటే ఇమిడిపోయింది. చూపరులను మంత్ర ముగ్ధులను చేసే ఈ ప్రత్యేకమైన చీర.. చేనేతల కళా నైపుణ్యానికి మచ్చుతునకలా నిలుస్తోంది. సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో 1960లోనే గొల్లభామ చీరలు నేసేవారు. వేలాదిగా కార్మికులు ఉపాధి పొందేవారు.  కాలక్రమంలో మార్పు వచ్చింది. ఆరేళ్ల కిందట జాకార్డు మగ్గాలు అందుబాటులోకి రావడంతో నాటి వైభవాన్ని క్రమంగా సంతరించుకుంటోంది. గతంలో ఫ్రేమ్‌ (గుంత) మగ్గాలను వినియోగించారు. చీర తయారీ కావాలంటే వారం నుంచి పది రోజుల సమయం పట్టేది. జాకార్డ్‌ మగ్గంపై మూడు నుంచి నాలుగు రోజుల్లో నేస్తున్నారు. ఒకటి రూ.2500 నుంచి రూ.4 వేల వరకు పలుకుతోంది. టెస్కో కొనుగోలు చేసి విపణిలోకి తెస్తోంది. బహిరంగ విపణితోపాటు ఆన్‌లైన్‌లో విక్రయాలు సాగుతున్నాయి. ఒక చీరపై 10 నుంచి 15 వరకు గొల్లభామ బొమ్మలు తీర్చిదిద్దుతారు. జిల్లాలో 45 వరకు జాకార్డ్‌ మగ్గాలు అందుబాటులో ఉన్నాయి. కొందరు ఇప్పటికీ పాతవిధానంలోనే తయారీ చేస్తున్నారు.

నెలలో 300కి పైగా..
జిల్లాలో 18 చేనేత సహకార సంఘాలు ఉండగా 500 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వారిలో 40 మంది కార్మికులు గొల్లభామ చీరలు, దుప్పట్టాలు నేస్తున్నారు. చీరకు 2012లో విశిష్ట భౌగోళిక గుర్తింపు లభించింది. పేటెంటు హక్కులను సిద్దిపేట పొందడం మరో విశేషం. ప్రస్తుతం  నెలకు 300కిపైగా ఉత్పత్తి చేస్తున్నారు. పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారిణులు, ఎన్నారైలు, సినీతారలు ఆసక్తి కనబర్చుతుంటారు. గొల్లభామ పట్టు చీరలు సైతం తయారీ చేస్తున్నారు. దీని ధర రూ.10 వేలకు పైగా పలుకుతోంది. మరిన్ని మార్పులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కార్మికులు శ్రమిస్తున్నట్లు ఆదర్శ చేనేత సహకార సంఘం మేనేజర్‌ హన్మంతు చెబుతున్నారు.


ఆరేళ్లుగా తయారీ..

గొల్లభామ చీరలు, దుప్పట్టాలను ఆరేళ్లుగా నేస్తున్నా. గొల్లభామ చీర తయారీకి మూడు రోజుల సమయం పడుతోంది. ఒక రోజులో దుప్పట్టా (చున్నీ) తయారు చేయవచ్చు. నెలకు రూ.10వేల వరకు ఆదాయం సమకూరుతోంది. యునెస్కో చీరను గుర్తించడం ఆనందంగా ఉంది. కూలీ పెంచితే మా జీవితాలు మెరుగవుతాయి.

- సత్యం, చేనేత కార్మికుడు, సిద్దిపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని