logo

ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణకు కసరత్తు

రీజినల్‌ రింగురోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. భూసేకరణకు చేపట్టిన సర్వే 90 శాతం పూర్తికాగా.. మిగిలినది వారంలో కొలిక్కి తెచ్చి..

Published : 02 Oct 2022 01:26 IST


సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు

గజ్వేల్‌, న్యూస్‌టుడే: రీజినల్‌ రింగురోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. భూసేకరణకు చేపట్టిన సర్వే 90 శాతం పూర్తికాగా.. మిగిలినది వారంలో కొలిక్కి తెచ్చి.. రైతుల వారీగా నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రింగురోడ్డును ఉమ్మడి జిల్లాలో 110 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఇందుకు 14 గ్రామాల్లో 980 ఎకరాల భూమి అవసరమని గుర్తించిన రెవెన్యూ అధికారులు 5 బృందాలుగా ఏర్పడి సర్వే చేస్తున్నారు. ఇప్పటి వరకు గజ్వేల్‌ రెవెన్యూ పరిధిలోని జగదేవపూర్‌ మండలం పీర్లపల్లి, ఇటిక్యాల, అలిరాజిపేట, మర్కూక్‌ మండలం అంగడి కిష్టాపూర్‌, చేబర్తి, ఎర్రవల్లి, పాములపర్తి, గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్‌, మక్తమాసన్‌పల్లి, బంగ్లవెంకటాపూర్‌, వర్గల్‌ మండలం మైలారం, జబ్బాపూర్‌, నెంటూరు, రాయపోల్‌ మండలం బేగంపేట, ఎల్కల్‌ గ్రామాల్లో 900 ఎకరాల సర్వే పూర్తయింది. మిగిలిన 80 ఎకరాల సర్వే పూర్తి చేసి.. నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌, చిట్యాల నుంచి భువనగిరి-గజ్వేల్‌ మీదుగా సంగారెడ్డి జిల్లా కంది వరకు, అక్కడి నుంచి శంకర్‌పల్లి, చేవెళ్ల, షాద్‌నగర్‌, కడ్తాల్‌, యాచారం నుంచి చౌటుప్పల్‌ వరకు రోడ్డు నిర్మించేందుకు కసరత్తు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మొదటి విడతలో ఉత్తర భాగాన ఉమ్మడి జిల్లాలో 110 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించనున్న నేపథ్యంలో అధికారులు భూసేకరణను వేగవంతం చేశారు. రైతుల వారీగా సర్వే పూర్తికాగనే నోటిఫికేషన్‌ జారీ చేసి అభిప్రాయ సేకరణ చేపడుతామని గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని