logo

ఇంటింటికి చేరని మంజీరా!

మిషన్‌ భగీరథ.. ఇంటింటికి నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకం. నర్సాపూర్‌ పట్టణంలో దీని ద్వారా ప్రతి ఇంటికి మంజీరా నీరందించాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఏ వార్డులోనూ పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడంతో ప్రతి ఇంటికి పంపిణీ సాధ్యం కావడం లేదు.

Published : 03 Oct 2022 00:45 IST

4వ వార్డులో ఇలా..

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: మిషన్‌ భగీరథ.. ఇంటింటికి నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకం. నర్సాపూర్‌ పట్టణంలో దీని ద్వారా ప్రతి ఇంటికి మంజీరా నీరందించాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఏ వార్డులోనూ పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడంతో ప్రతి ఇంటికి పంపిణీ సాధ్యం కావడం లేదు. పురపాలికలోని 15 వార్డుల్లో మంజీరా సరఫరా అస్తవ్యస్తంగా మారింది. గతేడాది వర్షాభావ పరిస్థితులతో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. చాలామంది ట్యాంకర్ల మీదే ఆధారపడ్డారు. మంజీరా నీటి సరఫరానూ ఏడాది పాటు నిలిపివేశారు. ఈ సారి సమృద్ధిగా వానలు కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో ఇక ఇబ్బందులు ఉండవని భావించినా ప్రణాళికాలోపంతో లక్ష్యం నెరవేరడం లేదు.  6 వేలకు పైగా నల్లాలు ఉండగా, 3,667 భగీరథ కనెక్షన్లు ఉన్నాయి. రోజూ 2,400 కిలోలీటర్ల నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. 37 బోర్లు వినియోగంలో ఉండగా, 12 పెద్ద, 6 చిన్న ట్యాంకులు ఉన్నాయి.

అస్తవ్యస్త పనులు
సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం చక్రియాల నుంచి హత్నూర మండలం బోర్పట్ల ఫిల్టర్‌బెడ్‌కు మంజీరా నీటి సరఫరా చేస్తారు. అక్కడ శుద్ధి చేశాక నర్సాపూర్‌కు తరలిస్తుంటారు. చక్రియాల ఇన్‌టేక్‌వెల్‌ నుంచి పంపిణీ బాగానే జరుగుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం జరగడం లేదు. పట్టణంలోని ఒకటి, రెండు వార్డులకు మినహా మిగతా అన్ని చోట్లకు సరిగా రావడం లేదు. ప్రధాన, అంతర్గత పైప్‌లైన్ల నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా సాగడంతో ఈ సమస్య తలెత్తుతోంది. చాలా చోట్ల అవసరాలకు అనుగుణంగా పైప్‌లైన్లు వేయలేదు. చిన్నగొట్టాలు బిగించడంతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇబ్బందులు పడుతూ..
పట్టణంలోని 1 నుంచి 8 వార్డులకు మంజీరా నీరే ఆధారం. భగీరథ పథకంలో ప్రతి ఇంటి వరకు పైపులు తీసుకొచ్చి వదిలేశారు. వాటికి నల్లాలు బిగించలేదు. పలు వార్డుల్లో స్వచ్ఛందంగా బిగించుకోవాలని వాటిని ప్రజలకే ఇచ్చేశారు. చాలాచోట్ల బిరడాలు ఏర్పాటుచేయకపోవడంతో నీరంతా వృథాగా పోతోంది.  5, 6, 4, 14, వార్డుల్లో సమస్య తీవ్రంగా ఉంది.

పరిష్కరిస్తాం..:  చాముండేశ్వరి, కమిషనర్‌
కొన్ని వార్డుల్లో నీటి సరఫరాలో ఇబ్బందులున్న మాట వాస్తవమే. ఎప్పటికప్పుడు పథకం నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్తున్నాం. కొన్ని కాలనీలలో పూర్తి స్థాయిలో పైప్‌లైన్ల నిర్మాణం జరగలేదు. మరి కొన్ని చోట్ల కొత్తవి బిగించాల్సి ఉంది. సమస్యను పరిష్కరిస్తాం.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts