logo

ఊరంతా లాభాల ‘బంతి’

దసరా, దీపావళి వచ్చిందంటే పూలకు ఉండే డిమాండ్‌ అంతాఇంతా కాదు. ఇక ఈ పండగలు ముగియగానే కార్తీక మాసమంతా వీటి కొనుగోళ్లు జోరుగా సాగుతాయి. బతుకమ్మ పండగ సాగే 9 రోజుల పాటు పూలు అవసరం ఉంటాయి. ఇదే క్రమంలో బంతి పూలకు గిరాకీ అధికంగా ఉంటుంది.

Published : 03 Oct 2022 00:45 IST

న్యూస్‌టుడే, చేగుంట

సరా, దీపావళి వచ్చిందంటే పూలకు ఉండే డిమాండ్‌ అంతాఇంతా కాదు. ఇక ఈ పండగలు ముగియగానే కార్తీక మాసమంతా వీటి కొనుగోళ్లు జోరుగా సాగుతాయి. బతుకమ్మ పండగ సాగే 9 రోజుల పాటు పూలు అవసరం ఉంటాయి. ఇదే క్రమంలో బంతి పూలకు గిరాకీ అధికంగా ఉంటుంది. ఇదే బాటలో నడుస్తూ ఊరంతా లాభాలు ఆర్జిస్తుండటం విశేషం. ఆ గ్రామమే మెదక్‌ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్‌.

ఎనిమిదేళ్ల కిందటి వరకు రుక్మాపూర్‌ గ్రామంలో రైతులంతా సంప్రదాయ పంటలు సాగు చేస్తుండేవారు. నీటి వసతి ఉన్న వారికి ఎలాంటి ఢోకా లేకపోయినా, బోర్లు లేని వారు నష్టాలపాలయ్యారు. ఈ తరుణంలో గ్రామానికి చెందిన తొడుపునూరి లింగం అనే రైతు తన బంధువులు బంతి పూలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిసుండటాన్ని గమనించి ఇదే తరహాలో ముందడుగు వేశారు. దీంతో ఆయన లాభాలు ఆర్జించడాన్ని గమనించిన 80 మంది రైతులు సైతం అదేబాటలో నడిచారు. ఇలా ఒకరిని చూసి మరొకరు.. ఊరంతా బంతి సాగుకు ఉపక్రమించారు.

తక్కువ నీటితో..
బంతి సాగుకు తక్కువ నీరే అవసరం కావడంతో అందరూ ఇటు వైపు దృష్టిసారించారు. కొంతమంది వాన నీటిని ఒడిసిపట్టుకొని అవసరమైన మేర వినియోగించుకుంటున్నారు. ఓ వైపు బంతితో పాటు వరి, కంది, పత్తి వంటివి సైతం పండిస్తున్న వారూ ఉన్నారు. ఎరుపు, తెలుపు రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విత్తనం తెచ్చుకొని విత్తుకుంటున్నారు. తొలినాళ్లలో లింగం ఈ ప్రాంత రైతులకు బంతి సాగుపై అవగాహన కల్పించారు. కొందరు రైతులు బిందు పరికరాలు బిగించి నీటి తడులు అందిస్తున్నారు. రైతులు తమ దిగుబడులను చేగుంటతో పాటు హైదరాబాద్‌ మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నారు. ఏడాది పొడవునా ఈ గ్రామంలో బంతి సాగే కనిపిస్తుంది. ఇలా ఇక్కడి వారు నష్టాలను అధిగమించి లాభాల వైపు పయనిస్తుండటం విశేషం. విత్తనాలు, ఎరువులు, మందులు ఇతర ఖర్చులన్నీ పోగా నెలకు రూ.20 వేల వరకు ఆర్జిస్తున్నారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts