logo

క్రైమ్‌ వార్తలు

అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ నీటి కుంటలో మృతి చెందిన ఘటన పాపన్నపేట మండలం నామాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. టేక్మాల్‌ మండలం చంద్రు తండాకు చెందిన వసురాం, దర్మి (35) దంపతులకు ఇద్దరు కుమార్తెలు చిట్టి, జాన ఉన్నారు.

Published : 03 Oct 2022 00:45 IST

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

పాపన్నపేట, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ నీటి కుంటలో మృతి చెందిన ఘటన పాపన్నపేట మండలం నామాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. టేక్మాల్‌ మండలం చంద్రు తండాకు చెందిన వసురాం, దర్మి (35) దంపతులకు ఇద్దరు కుమార్తెలు చిట్టి, జాన ఉన్నారు. వసురాం ఐదు నెలల క్రితం తమ పొలంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. పెద్ద కుమార్తె చిట్టికి వివాహం జరగ్గా, దర్మి, చిన్న కూతురు జాన కలిసి ఉంటున్నారు. గత నెల 28న ఉదయం దర్మి పింఛను తీసుకునేందుకని ఇంట్లో నుంచి బయలకు వెళ్లింది. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు అన్ని చోట్ల వెతికారు. ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఆదివారం పాపన్నపేట మండలం నా మాపూర్‌ గ్రామ శివారులో ఉన్న మొండి కుంటలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలికి చేరుకొని దర్మిగా గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. తన సోదరి మృతిపై అనుమానం ఉందని మృతురాలి తమ్ముడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.


విద్యుదాఘాతంతో రైతు..

చేగుంట, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన చేగుంట మండలం రుక్మాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ ప్రకాష్‌గౌడ్‌ తెలిపిన వివరాలు.. రుక్మాపూర్‌కు చెందిన శ్రీరాం కాశయ్య (52), పెంటమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాశయ్య సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం కుటుంబీకులతో కలిసి కాశయ్య గ్రామంలో ఏర్పాటుచేసిన దుర్గామాత మండపం వద్దకు వెళ్లాడు. అక్కడే భోజనం చేసి తిరిగి ఇంటికొచ్చారు. కిటికీలో ఉన్న తాళం చెవిని తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు తీగ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీన్ని గమనించిన పొరుగింట్లో ఉండే భాగ్యమ్మ కేకలు వేయడంతో కొంతమంది వచ్చి కాపాడేందుకు యత్నించారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన కాశయ్యను నార్సింగిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తేల్చిచెప్పారు. మృతుడి సోదరుడు శివ్వయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.


అప్పులతో సతమతం..  యువకుడి బలవన్మరణం

రాయపోల్‌: తండ్రి వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక యువకుడు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మహబూబ్‌ తెలిపిన వివరాలు.. రాయపోల్‌కు చెందిన కొంగరి రాజవ్వ, బాల్‌నర్యయ్య దంపతులకు విజయ్‌(22).. ఒక్కడే కుమారుడు. విజయ్‌ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. బాల్‌నర్యయ్య అనారోగ్యానికి గురి కావడంతో అనేక ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేదు. గత సంవత్సరం మృతి చెందాడు. చికిత్సలకైన అప్పులు ఎలా తీర్చాలో తెలియక పలుమార్లు తల్లితో చర్చిస్తూ బాధపడుతుండేవాడు. శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts