logo

హక్కులపై ఆశలు..!

తరతరాలుగా సాగు చేస్తున్న భూమిపై హక్కుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పోడు వ్యవసాయాన్ని గుర్తించి సాగు చేస్తున్న వారికే దక్కాలని పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హక్కులు దక్కని పోడు రైతుల సమస్యకు పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి 11 నెలల కిందట శ్రీకారం చుట్టింది.

Published : 03 Oct 2022 00:45 IST

‘పోడు’ దరఖాస్తుల పరిశీలన పూర్తి

సర్వే ప్రక్రియ షురూ  

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, కల్హేర్‌

క్రిష్ణాపూర్‌లో వివరాలు సేకరిస్తున్న అధికారులు

రతరాలుగా సాగు చేస్తున్న భూమిపై హక్కుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పోడు వ్యవసాయాన్ని గుర్తించి సాగు చేస్తున్న వారికే దక్కాలని పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హక్కులు దక్కని పోడు రైతుల సమస్యకు పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి 11 నెలల కిందట శ్రీకారం చుట్టింది. దరఖాస్తులూ స్వీకరించింది. ఆ తరువాత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందకపోవడంతో ఎదురుచూపులే మిగిలాయి. ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణ ఫలించనుంది. ఎట్టకేలకు క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభమైంది.

అత్యధికంగా కల్హేర్‌లోనే..
గతేడాది నవంబరు 8-16వరకు దరఖాస్తులు స్వీకరించగా జిల్లా వ్యాప్తంగా 3,934 దరఖాస్తులు వచ్చాయి. 7,109 ఎకరాల భూమికి హక్కు పత్రాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తులు చేశారు. జిల్లాలో కల్హేర్‌, మొగుడంపల్లి, ఝరాసంగం, హత్నూర, నారాయణఖేడ్‌, చౌటకూరు, కోహీర్‌, సిర్గాపూర్‌, వట్‌పల్లి, జహీరాబాద్‌ మండలాల్లో ‘పోడు’ సమస్యలు ఉన్నాయి. అత్యధికంగా కల్హేర్‌ మండలం 1324 మంది 2,344 ఎకరాల్లో తమకు హక్కులు కల్పించాలంటూ దరఖాస్తు చేసుకున్నారు.

క్షేత్రస్థాయిలో జీపీఎస్‌ ఆధారితంగా..
పోడు దరఖాస్తులపై సమగ్ర వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. దీనిపై ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించింది. ప్రస్తుతం ఆయా శాఖల అధికారులు భూములపై జీపీఎస్‌ ఆధారిత సర్వే నిర్వహిస్తున్నారు. ఎంతమేర భూమిలో కబ్జా ఉన్నారన్న వివరాలను నమోదు చేస్తున్నారు. సర్వే ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. హక్కు పత్రాలు దక్కాలంటే 2005కు ముందు నుంచి అటవీ భూముల్లో సాగు చేస్తున్నట్లు ఆధారాలు ఉండటంతో పాటు అటవీశాఖ కేసులు ఉంటే దరఖాస్తుదారులు జత చేయాల్సి ఉంటుంది. గిరిజనేతరులైతే మూడు తరాలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలి. ప్రస్తుతం అందిన దరఖాస్తుల్లో ఇందుకు అనుగుణంగా ఉన్న వాటికే ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

నివేదిక రాగానే..: ఫిరంగి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి
పోడు భూముల సమస్య పరిష్కారంపై ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తున్నాం. హక్కు పత్రాల కోసం అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన ఇప్పటికే పూర్తి చేశాం. అర్హులుగా తేలిన వారికి మాత్రమే హక్కు పత్రాలు అందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పోడు భూముల సర్వే ప్రక్రియ కొనసాగుతోంది.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts