logo

పురపాలికల్లో.. పనులు చేయలేం!

పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేసినా వాటిని మున్సిపల్‌ ఖాతాలకు జమ చేయలేదు. దీంతో ఆయా పనులు చేపట్టిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోంది. వీటి ప్రభావం కొత్త పనుల టెండర్లపైనా పడుతోంది.

Published : 03 Oct 2022 00:45 IST

టెండర్లు పిలిచినా ముందుకు రాని గుత్తేదార్లు

సంగారెడ్డి పట్టణంలో ఓ రోడ్డు దుస్థితి

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, జహీరాబాద్‌, సదాశివపేట, జోగిపేట టౌన్‌, నారాయణఖేడ్‌: పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేసినా వాటిని మున్సిపల్‌ ఖాతాలకు జమ చేయలేదు. దీంతో ఆయా పనులు చేపట్టిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోంది. వీటి ప్రభావం కొత్త పనుల టెండర్లపైనా పడుతోంది. గిట్టుబాటు కాదేమోనని కొందరు, బిల్లులు వెంటనే వస్తాయో రావోనని ఇంకొందరు పనులు చేపట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. కొన్నింటికి రెండు, మూడు సార్లు టెండర్లు పిలిచినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం..
ఇదీ పరిస్థితి..

సంగారెడ్డి పురపాలికకు రూ.50 కోట్లు కేటాయించగా రెండు నెలల క్రితం ఈ నిధులకు సంబంధించిన పాలకవర్గం ప్రతిపాదనలు రూపొందించింది. రూ.9.50 కోట్లతో ఐదు విభాగాలు, రూ.2 కోట్లతో మరో విభాగం టెండర్లు సభ్యులు రూపొందించి రెండు సార్లు టెండర్లు పిలిచినా ఎవరు రాలేదు. మూడోసారి నాలుగింటికి ఒక్కో టెండర్‌ మాత్రమే వచ్చింది. మిగిలిన రెండింటికి దాఖలు కాలేదు. రెండ్రోజులు క్రితం నాలుగోసారి పిలిచారు. 7వ తేదీ వరకు సమయం ఉంది.

సదాశివపేటకు రూ.25 కోట్లు కేటాయించగా ఇక్కడా అదే పరిస్థితి నెలకొంది. రెండు సార్లు ప్రకటించినా ఎవరూ రాలేదు. ఇటీవల రూ.3 కోట్ల పనులకు సంబంధించి ఒక్కటి మాత్రమే దాఖలైంది.

జహీరాబాద్‌ పురపాలికలో అధికారులు పూర్తిగా వెనకబడ్డారు. పనులకు సంబంధించిన అనుమతులు తెచ్చుకున్న తరువాతే టెండర్లకు వెళతారు. ప్రతిపాదనలు రూపొందిచండలో ఆలస్యం చేశారు.

అందోలు- జోగిపేటలో రూ.25 కోట్లకు సంబంధించి రెండు సార్లు ఎవరూ రాలేదు. ఇటీవల రూ.11.50 కోట్ల టెండర్లకు మాత్రమే గుత్తేదార్లు వచ్చారు. వీటి కింద 18 పనులను కేటాయించారు.

నారాయణఖేడ్‌లో రూ.25 కోట్లు కేటాయించగా గుత్తేదార్లు ముందుకు రావడం లేదు.

నిధులు విడుదల చేస్తే ప్రయోజనం..
పురపాలికలకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసినా ఇప్పటి వరకు విడుదల కాలేదు. దీంతో పనులు చేసిన తరువాత బిల్లులు వస్తాయో లేదోనని గుత్తేదార్లు ముందుకు రావడం లేదు. కొందరు కౌన్సిలర్లు హామీ ఇచ్చిన చోట గుత్తేదార్లు ఒకటి, రెండు టెండర్లు వేశారు. మరి కొన్ని చోట్ల కౌన్సిలర్లు బినామీ పేర్లతో వేసినట్లు తెలుస్తోంది. నిధులు విడుదల చేసి పురపాలికల ఖాతాలో జమ చేస్తే పనులు చేసేందుకు గుత్తేదారుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని