logo

స్వచ్ఛస్ఫూర్తి.. వెలుగొందిన కీర్తి!

సిద్దిపేట బల్దియా స్వచ్ఛతలో ప్రత్యేకత చాటుతోంది. వివిధ అంశాల్లో మేటిగా నిలుస్తూ ఆదర్శ పథంలో పయనిస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 పోటీల్లో ఏడు అంశాల్లో తనదైన ముద్ర వేసింది. జిల్లా కేంద్రంలో చెత్త సేకరణకు దాదాపు 50 పారిశుద్ధ్య వాహనాల ద్వారా పాటలను వినిపిస్తూ ప్రజా చైతన్యం తెస్తున్నారు.

Published : 03 Oct 2022 00:45 IST

ఏడు అంశాల్లో విశిష్టత చాటిన సిద్దిపేట బల్దియా

న్యూస్‌టుడే, సిద్దిపేట

సిద్దిపేట బల్దియా స్వచ్ఛతలో ప్రత్యేకత చాటుతోంది. వివిధ అంశాల్లో మేటిగా నిలుస్తూ ఆదర్శ పథంలో పయనిస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 పోటీల్లో ఏడు అంశాల్లో తనదైన ముద్ర వేసింది. జిల్లా కేంద్రంలో చెత్త సేకరణకు దాదాపు 50 పారిశుద్ధ్య వాహనాల ద్వారా పాటలను వినిపిస్తూ ప్రజా చైతన్యం తెస్తున్నారు. తడి చెత్త- 26.8, పొడి... 16.5, నిర్మాణ వ్యర్థాలు- 1.7, పూడిక- 6.85, ఇతరత్రావి- 2.6 టన్నుల మేర వెలువడుతున్నాయి. తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారీ చేస్తుండగా, పొడి చెత్తను విక్రయిస్తున్నారు. వార్డుల్లో ఏర్పాటు చేసిన కంపోస్టు యార్డుల్లో సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేస్తున్నారు. పట్టణంలో 40కి పైగా ప్రజా శౌచాలయాలు నిర్మించారు. మహిళలకు సంచార శౌచాలయాన్ని అందుబాటులోకి తెచ్చారు. మురుగు, మానవ వ్యర్థాలను శుద్ధి చేసి ఎరువుగా మార్చే కేంద్రం, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఇటుకలు, టైల్స్‌ తయారీ, తడి చెత్తతో సీఎన్‌జీ ఉత్పత్తి సహా 34 వార్డుల్లో ఏర్పాటు చేసిన స్టీల్‌ బ్యాంకులు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

విభాగాల వారీగా..
జాతీయస్థాయిలో అత్యధిక ప్రజా భాగస్వామ్యం (సిటిజన్‌ పార్టిసిపేషన్‌) విభాగంలో సిద్దిపేట మున్సిపాలిటీ మూడో స్థానంలో నిలవడం విశేషం. స్వచ్ఛ పట్టణాల జాబితాలో మొత్తం 4354 పట్టణాలు పోటీ పడగా.. అందులో 30వ ర్యాంకు సాధించింది. సర్వేకు 7500 మార్కులు కేటాయించగా.. బల్దియా 5540 మార్కులు సాధించింది. ఈ లెక్కన రాష్ట్రంలో లక్ష నుంచి 3 లక్షల జనాభా కలిగిన పట్టణాల పరంగా చూస్తే తెలంగాణలో ప్రథమస్థానం కైవసం చేసుకుంది. జాతీయస్థాయిలో 20వ ర్యాంకు పొందింది. గార్బేజ్‌ (చెత్త రహిత పట్టణం) ఫ్రీ సిటీ విభాగంలో వన్‌ స్టార్‌ రేటింగ్‌ను పొందింది. స్టార్‌ రేటింగ్‌ రావడం ఇదే ప్రథమం. ఓడీఎఫ్‌ ++ విభాగంలో గత ఏడాది పట్టణం గుర్తింపుపొందిన విషయం తెలిసిందే. ఆ స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకుంది. ప్రేరక్‌ డౌర్‌ సమ్మాన్‌లో భాగంగా తడి, పొడి, హానికర చెత్త సేకరణ, నిర్వహణలో మేటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో గోల్డ్‌ కేటగిరీలో స్థానం సంపాదించింది. ఈ సందర్భంగా బల్దియా అధ్యక్షురాలు మంజుల, కమిషనర్‌ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ..మంత్రి హరీశ్‌రావు ఆదేశాలకు అనుగుణంగా ముందడుగు వేసి చక్కటి ఫలితాలు సాధించామన్నారు.


ఐక్యతకు నిదర్శనం..

- హరీశ్‌రావు, ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖల మంత్రి

జాతీయస్థాయిలో ప్రత్యేకతను చాటడం ఆనందంగా ఉంది. పదేళ్ల కిందటి నుంచే ఎన్నో కార్యక్రమాలను అమలు చేశాం. ప్రజల భాగస్వామ్యం, కౌన్సిల్‌ బృందం, అధికారులు, సిబ్బంది ఐక్యతకు నిదర్శనం. రానున్న రోజుల్లో ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా దేశంలో తొలిస్థానంలో నిలవడమే లక్ష్యంగా ముందడుగు వేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని