logo

అర్ధరాత్రి.. జాతీయ రహదారిపై దందా

దేశంలోనే అత్యంత పొడవైన 44వ జాతీయ రహదారిపై కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అక్రమ వసూళ్ల దందా దర్జాగా సాగిస్తున్నారు. అర్ధరాత్రి వేళ రేడియం స్టిక్కర్లు అతికిస్తామని, అవి లేకపోతే జరిమానా విధిస్తారంటూ భయపెట్టి దౌర్జన్యానికి పాల్పడుతున్నారు.

Updated : 04 Oct 2022 08:47 IST

అల్లాపూర్‌ టోల్‌గేట్‌ వద్ద..

వెలుగులోకి తీసుకొచ్చిన ‘ఈనాడు, ఈటీవీ’

న్యూస్‌టుడే, తూప్రాన్‌

టోల్‌గేట్‌ వద్ద నగదు వసూలు చేస్తున్న ప్రైవేటు వ్యక్తులు

దేశంలోనే అత్యంత పొడవైన 44వ జాతీయ రహదారిపై కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అక్రమ వసూళ్ల దందా దర్జాగా సాగిస్తున్నారు. అర్ధరాత్రి వేళ రేడియం స్టిక్కర్లు అతికిస్తామని, అవి లేకపోతే జరిమానా విధిస్తారంటూ భయపెట్టి దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. తూప్రాన్‌ పురపాలిక పరిధి అల్లాపూర్‌ టోల్‌గేట్‌ వద్ద 15 రోజులుగా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈ అక్రమ దందా సాగిస్తుండటం గమనార్హం. విషయం తెలుసుకున్న ‘ఈనాడు, ఈటీవీ’ బృందం ఆదివారం అర్ధరాత్రి నిఘా వేయడంతో అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. అల్లాపూర్‌ టోల్‌గేట్‌ వద్ద ఆర్టీఏ అధికారుల తరహాలో ట్రాఫిక్‌ జాకెట్లను ధరించిన ఆరుగురు హల్‌చల్‌ చేశారు. లారీలు, ట్రక్కులు, సామగ్రి తరలించే వాహనాల చోదకుల ముఖాలకు టార్చిలైట్‌ కొట్టి ఆపారు. రేడియం స్టిక్కర్లను అతికించి ఒక్కో వాహనదారుడి నుంచి రూ.500 వరకు వసూలు చేశారు. స్టిక్కర్‌ తప్పనిసరని, లేదంటే పోలీసులు కేసులు నమోదు చేస్తారని చోదకులను భయపెట్టించారు. దీన్ని గమనించిన ‘న్యూస్‌టుడే’ ప్రతినిధి వారి వద్దకు వెళ్లి ఎందుకు నగదు వసూలు చేస్తున్నారని ఆరా తీశారు. రేడియం స్టిక్కర్లు అతికిస్తున్నామని, తమకు మెదక్‌ డీఎస్పీ అనుమతి ఉందని సమాధానం ఇచ్చారు. అల్లాపూర్‌ ప్రాంతం తూప్రాన్‌ డీఎస్పీ పరిధిలోకి వస్తుంది కదా, ఇక్కడ ఎలా చేస్తారని ప్రశ్నించగా.. తూప్రాన్‌ డీఎస్పీ అనుమతి సైతం ఉందని పత్రాన్ని చూపించారు. అర్ధరాత్రి వేళ ఎందుకు నగదు వసూలు చేస్తున్నారు, ఏ శాఖకు చెందిన వారని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పారు. బృందం సభ్యుడొకరు అక్కడి పోలీసు పెట్రోలింగ్‌ వాహనంలో ఉన్న అధికారికి ‘ఈనాడు, ఈటీవీ’ బృందం వీడియోలు, ఫొటోలు తీసిననట్లు చెప్పాడు. సదరు అధికారి ఆదేశాలతో ఆ ప్రైవేటు వ్యక్తులంతా ఇప్పుడు వెళ్లిపోతున్నామని, ఉదయం వచ్చి స్టిక్కర్లు అతికిస్తామంటూ మెల్లగా జారుకున్నారు. పోలీసుల ఎదుటే ఇదంతా సాగుతున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డిని వివరణ కోరగా.. తాము స్టిక్కర్లు అతికిస్తామంటే అనుమతి ఇచ్చామని, నగదు వసూలు చేస్తున్న విషయం తెలియదని, వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

లారీ డ్రైవరు నుంచి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని