logo

2 ముందుకు.. 2 వెనక్కి...

స్వచ్ఛతలో జిల్లాలోని పురపాలికలు ఒక అడుగు ముందుకు.. మరో అడుగు వెనక్కి అన్న చందంగా ఉంది. ఏటా కేంద్రం నిర్వహించే పోటీల్లో రెండు పురపాలికలు గతేడాదితో పోలిస్తే ర్యాంకులో వెనక్కి వెళ్లగా, మరో రెండు ముందడుగు వేశాయి.

Published : 04 Oct 2022 02:56 IST

న్యూస్‌టుడే, మెదక్‌

మెదక్‌ ఎంపీడీవో కార్యాలయం చెంతన వ్యర్థాలు

స్వచ్ఛతలో జిల్లాలోని పురపాలికలు ఒక అడుగు ముందుకు.. మరో అడుగు వెనక్కి అన్న చందంగా ఉంది. ఏటా కేంద్రం నిర్వహించే పోటీల్లో రెండు పురపాలికలు గతేడాదితో పోలిస్తే ర్యాంకులో వెనక్కి వెళ్లగా, మరో రెండు ముందడుగు వేశాయి. పట్టణాలు, గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రం ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలను నిర్వహిస్తోంది. వ్యర్థాల నిర్వహణ, తడి, పొడి చెత్త సేకరణతో పాటు పారిశు ద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలందరినీ ఇందులో భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహిస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు దేశంలోని నాలుగు వేలకు పైగా పురపాలికలను ఎంపిక చేశారు. ఇందులో నిర్దేశించిన అంశాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. జిల్లాలోని నాలుగు పురపాలికలు 50 వేల జనాభాలోపు విభాగంలో పోటీ పడ్డాయి.

చెత్త సేకరణలో లోపం..

గతేడాది మెదక్‌ రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకు సాధించగా.. ఈ సారి 13కు పరిమితమైంది. జిల్లా కేంద్రం మెదక్‌ కొన్నేళ్లుగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకులు సాధిస్తూ వచ్చింది. ఈ ఏడాది పలు కార్యక్రమాలను నిర్వహించినా ఆశించిన స్థాయిలో మార్కులు సాధించలేకపోయింది. 6,000 మార్కులకు 3,481 మాత్రమే వచ్చాయి. దక్షిణాది స్థాయిలో గతేడాది 27వ స్థానంలో ఉండగా ఈ సారి 16వ స్థానానికి చేరడం కాస్త ఊరటనిచ్చేదే. జిల్లా కేంద్రంలో తడి, పొడి చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగడం లేదు. తూప్రాన్‌ గతేడాది 10వ స్థానంలో నిలవగా ఈసారి 22కు పడిపోయింది. 3,000 మార్కులు వచ్చాయి. డంపింగ్‌ యార్డు లేకపోవడంతో తడి, పొడి చెత్త సేకరణ ఆశించిన స్థాయిలో జరగడం లేదు.

దృష్టి సారించడంతో..

నర్సాపూర్‌ పట్టణానికి గతేడాది 51 ర్యాంకు రాగా ఈ సారి 22వ స్థానంలో నిలిచింది. ఇక్కడ తడి, పొడి చెత్తపై ప్రత్యేక దృష్టిసారించారు. ప్లాస్టిక్‌ నిషేధం అమలుకు కృషి చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, తదితర కార్యక్రమాలు చేపట్టడంతో మెరుగుపడింది. రామాయంపేటలోనూ పలు కార్యక్రమాల నిర్వహణతో 66వ ర్యాంకు నుంచి ఈ సారి 44కు చేరింది.

నర్సాపూర్‌లో ఏర్పాటుచేసిన డబ్బాలు

ఇలా చేస్తే మెరుగు

పౌరుల స్పందనలో భాగంగా స్వచ్ఛత యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అభిప్రాయాలు తెలిపేలా ప్రజలను ప్రోత్సహించాలి. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త సేకరణపై దృష్టి సారించాలి. పక్కా ప్రణాళికతో సేంద్రియ ఎరువు తయారు చేయాలి. ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై వ్యర్థాలు పడవేయకుండా అవగాహన కల్పించాలి. కేవలం కార్యక్రమ అమలు సమయంలో కాకుండా ఏడాదంతా నిరంతరం పర్యవేక్షిస్తూ ముందుకు సాగాలి.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని