logo

ఆలన.. ఊరట!

క్యాన్సర్‌.. ఒకానొక దశలో తగ్గని మహమ్మారిలా పీడిస్తుంది. నిర్దేశిత దశలు దాటితే.. ముప్పుగా పరిణమిస్తుంది. దీనికి చికిత్స అందించడం ఓ సుదీర్ఘమైన ప్రక్రియ. ఈ తరుణంలో ప్రధాన చికిత్సకు అనుసంధానంగా సహకార సేవలు అందించేందుకు పాలియేటివ్‌ కేర్‌ కేంద్రాలు ఉపకరిస్తాయి.

Published : 04 Oct 2022 02:56 IST

జిల్లాకు మరో పాలియేటివ్‌ కేర్‌ కేంద్రం..

న్యూస్‌టుడే, సిద్దిపేట

సిద్దిపేట సర్వజన ఆసుపత్రిలో సిద్ధమవుతున్న పాలియేటివ్‌ కేర్‌ కేంద్రం

క్యాన్సర్‌.. ఒకానొక దశలో తగ్గని మహమ్మారిలా పీడిస్తుంది. నిర్దేశిత దశలు దాటితే.. ముప్పుగా పరిణమిస్తుంది. దీనికి చికిత్స అందించడం ఓ సుదీర్ఘమైన ప్రక్రియ. ఈ తరుణంలో ప్రధాన చికిత్సకు అనుసంధానంగా సహకార సేవలు అందించేందుకు పాలియేటివ్‌ కేర్‌ కేంద్రాలు ఉపకరిస్తాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చొరవతో జిల్లాలో ఇప్పటికే గజ్వేల్‌లో ఓ కేంద్రం కొనసాగుతుండగా.. సిద్దిపేటకు మరొకటి మంజూరైంది. ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ సర్వజన ఆసుపత్రిలో ఈ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. క్యాన్సర్‌ బాధిత కుటుంబాల్లో అత్యధిక శాతం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ప్రభుత్వ క్యాన్సర్‌ ఆసుపత్రి సహా వివిధ కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు తరచూ నిర్దేశిత ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో స్థానికంగానే సహకార సేవలు అందించేందుకు పాలియేటివ్‌ కేర్‌ కేంద్రం దోహదం చేస్తుంది. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా చితికిపోకుండా భరోసా ఇస్తుంది. బాధితులు, కుటుంబీకుల్లో ఆత్మస్థైర్యం పెంపొందిస్తారు. ఆలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 24వ కేంద్రంగా సిద్దిపేటలో ప్రారంభం కానుంది.

దీర్ఘకాలిక రోగులకు..

ఈ కేంద్రం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి సేవలు అందిస్తుంటారు. అందులో ప్రధానంగా క్యాన్సర్‌, పక్షవాతం, ఇతరత్రా వాటిపై ఎక్కువ దృష్టి సారిస్తారు. ఓపీ, ఐపీ, హోమ్‌ కేర్‌ సేవలు అందుతాయి. ఆసుపత్రితో పాటు ఇళ్ల వద్దకు వైద్య సిబ్బంది వెళతారు. మానసిక స్థైర్యం పెంపొందించేలా క్యాన్సర్‌, బాధిత కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ చేస్తారు. తీవ్రత మేర ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిందిగా సూచనలు చేస్తుంటారు. పుండు లేదా గాయం వద్ద డ్రెస్సింగ్‌ను స్వతహాగా చేసుకునే విధానంపై వివరిస్తారు. ప్రధాన ఆసుపత్రుల్లో చికిత్స అనంతరం నొప్పి నివారణ చర్యలు, సైడ్‌ ఎఫెక్ట్స్‌ను తగ్గించేలా చర్యలు తీసుకుంటారు. తుది దశలో ఉన్న వారికి కుటుంబ సభ్యుల మాదిరి సేవలు అందిస్తారు. గజ్వేల్‌లో 2018లోనే పాలియేటివ్‌ కేర్‌ కేంద్రం ఏర్పాటైంది. ఎనిమిది పడకలు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఇప్పటి వరకు 2663 మంది సేవలు పొందారు.

సేవలు విస్తృతం.. సమీపంగా..

సిద్దిపేటలో కేంద్రం ఏర్పాటుతో సేవలు సమీపంగా, విస్తృతమయ్యే అవకాశం ఏర్పడింది. సర్వజన ఆసుపత్రిలోని నాలుగో అంతస్తులో ఏడు పడకలు ఏర్పాటు చేశారు. వైద్యుడు, ఫిజియోథెరపిస్టు, నలుగురు స్టాఫ్‌నర్సులు సేవలు అందించనున్నారు. కేంద్రం పరిధిలో పేగు క్యాన్సర్‌ బాధితులకు కోలోస్టోమీ బ్యాగును మార్చడం, అవసరం మేర ఫీడింగ్‌ ట్యూబ్‌ను అమర్చడం-మార్చడం, పుండ్లకు డ్రెస్సింగ్‌ చేయడం, గొంతు క్యాన్సర్‌ బాధితులకు ట్రాకియోష్టమీ ట్యూబ్‌ను శుభ్రం చేయడంతో పాటు ఫిజియోథెరపీ చేయిస్తారు. వాంతులు, విరేచనాలు, నొప్పులు ఉంటే తగ్గించేందుకు ఔషధాలు అందిస్తారు. జావ, అంబలి, మెత్తటి అన్నంతో కూడిన భోజనం పంపిణీ చేస్తారు. అన్ని రకాల వసతులు అందుబాటులో ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని