logo

నిధులు రాబట్టేలా.. అభివృద్ధికి వెచ్చించేలా..

జిల్లాలోని ప్రతి పరిశ్రమ నుంచి వచ్చిన ఆదాయంలో 2 శాతం నిధులు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ఇవ్వాలన్న నిబంధన ఉంది. జిల్లాలో అత్యధికంగా పరిశ్రమలున్నా ఈ నిబంధనను పాటించడం లేదు.

Published : 05 Oct 2022 00:59 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌

జిల్లాలోని ప్రతి పరిశ్రమ నుంచి వచ్చిన ఆదాయంలో 2 శాతం నిధులు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ఇవ్వాలన్న నిబంధన ఉంది. జిల్లాలో అత్యధికంగా పరిశ్రమలున్నా ఈ నిబంధనను పాటించడం లేదు. దీనిపై ఇటీవల జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు ప్రస్తావించారు. దీంతో ఈ విషయమై పాలనాధికారి శరత్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఆ నిధుల సేకరణకు, పర్యవేక్షణకు ప్రత్యేకంగా కమిటీ నియామకం పూర్తిచేశారు. సంబంధిత శాఖ అధికారులకు దిశానిర్దేశం సైతం చేశారు.

కార్యాచరణ ఇలా..
సీఎస్‌ఆర్‌ నిధుల పర్యవేక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా కమిటీని ఏర్పాటుచేశారు. ఛైర్మన్‌గా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హరీశ్‌రావు, కో-ఛైర్మన్‌గా పాలనాధికారి శరత్‌, కో-కన్వీనర్‌గా అదనపు పాలనాధికారి (రెవెన్యూ), కన్వీనర్‌గా సీపీవో, సభ్యులుగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, జిల్లా జనరల్‌ మేనేజర్‌ (డీఐసీ), పీసీబీ ఈఈ, పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌, ఆబ్కారీ జిల్లా అధికారి, భూగర్భ జల వనరుల శాఖ ఏడీ, జిల్లా రవాణాధికారి, వ్యవసాయ శాఖ జేడీలతో పాటు ఇలా 19 మంది అధికారులకు కమిటీలో చోటు కల్పించారు. అత్యధిక పరిశ్రమలు ఉన్న మండలాలను అయిదు క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో అధికారికి మూడు నుంచి నాలుగు పరిశ్రమల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. వీరంతా 15 రోజుల్లోగా సర్వే చేసి లెక్క తేల్చి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. ఈ విషయమై సీపీవో మనోహర్‌ మాట్లాడుతూ.. త్వరలోనే కమిటీ సభ్యులు నిధులపై లెక్క తేలుస్తారన్నారు. సీఎస్‌ఐ నిధులతో జిల్లాలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి వెచ్చిస్తామని చెప్పారు.

జడ్పీ సమావేశంలో..
జిల్లాలో 15కు పైగా భారీ, 2 వేలు మధ్యతరహా, 5 వేలకు పైగా చిన్నతరహా పరిశ్రమలు కొనసాగుతున్నాయి. పటాన్‌చెరు నియోజకవర్గంలో అత్యధికంగా పరిశ్రమలు ఉన్నాయి. ఆ తర్వాత హత్నూర, సదాశివపేట, కొండాపూర్‌, సంగారెడ్డి, పుల్కల్‌, అందోల్‌, చౌటకూర్‌, కంది, జహీరాబాద్‌, కోహీర్‌, రాయికోడ్‌, మునిపల్లి మండల కేంద్రాల్లో వెలిశాయి. కొన్నేళ్లుగా సీఎస్‌ఆర్‌ నిధులను ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా జడ్పీ సమావేశంలో ఇది చర్చకు రావడంతో కదలిక మొదలైంది. పాలనాధికారి చొరవ చూపడంతో నిధుల వసూళ్లకు సమాయత్తమవుతున్నారు. సదరు నిధులు వసూలైతే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. వసతిగృహాలు, విద్యాలయాల్లో సౌకర్యాల కల్పనకు దోహదం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని