logo

ప్రగతి పరుగెలెడితే... ఊరూరా సంబురం

ఉమ్మడి మెదక్‌తో పాటు వికారాబాద్‌ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. సంక్షేమ పథకాలను విస్తృతంగా అందిస్తూ అండగా నిలుస్తోంది.

Published : 05 Oct 2022 00:59 IST

అపరిష్కృత పనులు సత్వరం పూర్తి చేస్తే మేలు
అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవ కీలకం
ఈనాడు, సంగారెడ్డి


ముత్తాయిపల్లి వద్ద మహబూబ్‌నహర్‌ కాలువ దుస్థితి

ఉమ్మడి మెదక్‌తో పాటు వికారాబాద్‌ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. సంక్షేమ పథకాలను విస్తృతంగా అందిస్తూ అండగా నిలుస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా వికారాబాద్‌ జిల్లాను సస్యశ్యామలం చేసేలా ప్రణాళికలు రూపొందించారు. కాళేశ్వరం ద్వారా సిద్దిపేట జిల్లాలో నాలుగు జలాశయాలను ఇప్పటికే నిర్మించారు. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో కాలువల పనులు సాగుతున్నాయి. పర్యాటకంగా నాలుగు జిల్లాలనూ తీర్చిదిద్దుకునే వీలుంది. నాలుగు జిల్లాల్లోనూ ఇంకా కొన్ని చోట్ల పనులు పూర్తికాలేదు. దసరా సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సంకల్పించి.. వాటిపై దృష్టిసారించి పనులు పూర్తి చేస్తే ప్రజలకు ప్రయోజనం దక్కుతుంది.

విశ్వవిద్యాలయానికి డిమాండ్‌
సిద్దిపేట ప్రాంతంలో విశ్వవిద్యాలయం కావాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో నాలుగు వేల మందికి పైగా విద్యార్థులు చదువుతుంటారు. ఇప్పుడు ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తుంది. స్థానికంగానే కొత్త విశ్వవిద్యాలయం ఉండాలంటూ పలువురు విద్యావేత్తలు కోరుతున్నారు. దీంతో పాటు ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల కావాలనే డిమాండ్‌ ఉంది. ఇవి సాకారమైతే సిద్దిపేట సమగ్ర విద్యాహబ్‌గా మారుతుంది.

ఏళ్లుగా జాప్యం..
వికారాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లే మార్గంలో రైల్వే వంతెన ఇరుకుగా మారింది. ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో ఉదయం, సాయంత్రం సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని విస్తరించేందుకు ఇప్పటికే రూ.12కోట్లు మంజూరయ్యాయి. అయినా పనులు మొదలుకాలేదు. త్వరితగతిన ప్రారంభించి వాహనదారులకు ఊరట కల్పించాలి.


నీళ్లందిస్తే రైతులకు ఊరట


అసంపూర్తిగా నల్లవాగు ప్రాజెక్టు కుడి కాలువ

* నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని నల్లవాగు ప్రాజెక్టు ఆయకట్టు లక్ష్యం 5,330 ఎకరాలు. కల్హేర్‌, సిర్గాపూర్‌ మండలాలకు లబ్ధి జరుగుతుంది. 2017లో రూ.24కోట్లు మంజూరయ్యాయి. కాల్వల ఆధునీకరణ చేయాల్సి ఉన్నా... ఇప్పటి వరకు 50శాతమైనా పూర్తికాలేదు. చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు.
* మెదక్‌ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్‌ వద్ద మంజీరా నదిపై వనదుర్గా ప్రాజెక్టు నిర్మించారు. రెండు కాలువల ద్వారా 21,625 ఎకరాలకు నీళ్లందించడం లక్ష్యం. మహబూబ్‌నహర్‌, ఫతేనహర్‌ కాలువల ఆధునీకరణకు సమృద్ధిగా నిధులిస్తున్నా పనులు పూర్తికావడం లేదు. అసంపూర్తి పనులకు రూ.50.32కోట్లు మంజూరైనా.. ఆనకట్ట ఎత్తు పెంపు ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.


పర్యాటకంగా తీర్చిదిద్దే అవకాశాలు


మంజీరా బ్యారేజీ

* సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో మంజీరా బ్యారేజీ ఉంది. ఇది మొసళ్ల అభయారణ్యం. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వారాంతాలు, సెలవుదినాల్లో చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. కనీస సదుపాయాలు లేకపోవడంతో వచ్చిన వారు రెండోసారి రావడానికి ఆసక్తి చూపడం లేదు.
* సిద్దిపేట జిల్లాలోని రంగనాయక్‌ సాగర్‌ను పర్యాటకంగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంది. రూ.100 కోట్లు వెచ్చించాలనుకున్నారు. ఇప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. మల్లన్నసాగర్‌ను ఏకోటూరిజంగా మారుస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కొండపోచమ్మ జలాశయం వద్ద ఇప్పటి వరకు నామమాత్రంగానే పనులు చేశారు. వీటిని పూర్తి చేస్తే పర్యాటకంగా జిల్లా అగ్రస్థానంలో నిలుస్తుంది.
* మెదక్‌ జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌లో దట్టమైన అడవులున్నాయి. పోచారం అభయారణ్యం ఉంది. ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి పలు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి టూరిజం సర్య్కూట్‌గా మార్చితే ప్రయోజనం ఉంటుంది.
* వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. దీనిని పర్యాటకంగా తీర్చిదిద్దేలా గతంలో హామీలిచ్చినా ఆ దిశగా నిర్దిష్టమైన కార్యాచరణ కొరవడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని