logo

కీలక మార్పు.. పురోగమనం వైపు..

మెతుకుసీమ వివిధ రంగాల్లో పురోగమిస్తోంది. ఆరేళ్ల కిందట మెదక్‌ కేంద్రంగా జిల్లా ఆవిర్భవించగా అభివృద్ధి ఊపందుకుంది. ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో పాటు అర్హులకు సంక్షేమ పథకాలు అందుతుండటంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. కీలక రంగాలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయి.

Published : 05 Oct 2022 00:59 IST

న్యూస్‌టుడే, మెదక్‌


మాతా, శిశుసంరక్షణ కేంద్రం

మెతుకుసీమ వివిధ రంగాల్లో పురోగమిస్తోంది. ఆరేళ్ల కిందట మెదక్‌ కేంద్రంగా జిల్లా ఆవిర్భవించగా అభివృద్ధి ఊపందుకుంది. ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో పాటు అర్హులకు సంక్షేమ పథకాలు అందుతుండటంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. కీలక రంగాలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయి.

వైద్య మణిహారం
వచ్చే ఏడాదిలో జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటుచేయన్నారు. దీని ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. విద్యావ్యవస్థలో ఇది కీలక మార్పనే చెప్పాలి. అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలనూ ఏర్పాటుచేసే అవకాశం ఉంది. గుండె, యూరాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాల్లో 24 గంటల పాటు నిపుణులతో సేవలు అందే అవకాశాలున్నాయి. జిల్లా కేంద్రంలో 100 పడకలతో రూ.17 కోట్లతో నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రం గత జూన్‌లో అందుబాటులోకి వచ్చింది. తల్లీబిడ్డలకు కార్పొరేట్‌ వైద్యం అందుతోంది.

విద్యావ్యవస్థలో..
ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో 313 బడులను ఎంపిక చేశారు. ఇప్పటివరకు 204 చోట్ల పనులు మొదలయ్యాయి. శౌచాలయాలు, మూత్రశాలలు, ప్రహరీ నిర్మాణం, తాగునీటి వసతి, విద్యుత్తు సౌకర్యం సమకూర్చనున్నారు. ప్రస్తుతం నాలుగు కస్తూర్బాలు మంజూరయ్యాయి. నిజాంపేట, మాసాయిపేట, నార్సింగి, హవేలిఘనపూర్‌ మండలాల్లో ఏర్పాటు కానున్నాయి. ఇటీవల మెదక్‌కు ఫులే బాలుర గురుకుల డిగ్రీ కళాళాల, బాలికల గురుకుల పాఠశాల కేటాయించారు.

ఆర్థికాభివృద్ధి దిశగా..
జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు సెర్ప్‌, స్త్రీనిధి ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలతో పాటు పాడిగేదెలు ఇస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2,648 మంది కొత్త వ్యాపారాలు ప్రారంభించగా, ప్రస్తుతం 2,733 మందిని గుర్తించారు. గత ఆర్థిక సంవత్సరంలో 9,375 సంఘాలకు రూ.469.14 కోట్ల బ్యాంకులు రుణాలు ఇవ్వగా, జిల్లా రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 11,486 సంఘాలకు రూ.491.85 కోట్లు ఇవ్వాలన్నది లక్ష్యం. ఇప్పటివరకు 2,956 సంఘాలకు రూ.164.06 కోట్లు ఇచ్చారు.


ఉపాధికి అడుగులు

మనోహరాబాద్‌, తూప్రాన్‌, చేగుంట, చిన్నశంకరంపేట, శివ్వంపేట మండలాల్లో వివిధ పరిశ్రమలు ఉన్నాయి. టీఎస్‌-ఐపాస్‌ ద్వారా 699 యూనిట్లకు 1,833 దరఖాస్తులు రాగా, వాటిలో 1,518 అనుమతులిచ్చారు. 2022-23 సంవత్సరానికి 91 పరిశ్రమల్లో ఎస్సీ, ఎస్టీ రాయితీల ద్వారా రూ.7.39 కోట్లతో 182 మందికి ఉపాధి కల్పించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన ప్రోగ్రాం ద్వారా 2022-23 సంవత్సరానికి 10 యూనిట్లకు రూ.21.74 లక్షల రుణాలను లబ్ధిదారులకు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని