logo

వంతెన నిర్మించారు.. రోడ్డు మరిచారు!

వంతెనలు నిర్మించిన ఏడాది కావస్తున్నా రహదారులను నిర్మించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Published : 05 Oct 2022 00:59 IST

న్యూస్‌టుడే, శివ్వంపేట


చెన్నాపూర్‌ వద్ద..

వంతెనలు నిర్మించిన ఏడాది కావస్తున్నా రహదారులను నిర్మించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఇరుకు వంతెనలతో ఇబ్బందులు ఏర్పడటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసి వాటిని విస్తరింపజేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా వాటికి ఇరువైపులా రహదారులను అలాగే వదిలేయడంతో పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

నాలుగేళ్ల కిందట..
శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల నుంచి మనోహరాబాద్‌, జీడిపల్లి వెళ్లేందుకు గతంలో ఒకే వరుస దారి ఉండటంతో దాన్ని రెండు వరుసలకు విస్తరించారు. నాలుగేళ్ల కిందట రూ.15 కోట్లతో 12 కి.మీ. మేర పనులు చేపట్టి పూర్తిచేశారు. ఈ మార్గంలో చెన్నాపూర్‌, గోమారం గ్రామాల వద్ద కొత్త వంతెనలు నిర్మించారు. చెన్నాపూర్‌ వద్ద రూ.1.80 కోట్లు వెచ్చించి నిర్మాణం చేపట్టి గత డిసెంబరులో పూర్తిచేశారు. గోమారం వద్ద రూ.1.30 కోట్లతో ఫిబ్రవరిలో వంతెన పూర్తయింది. ఇంతవరకు ఆయా వంతెనలకు ఇరువైపులా రహదారులను మాత్రం మరచిపోయారు. మట్టి వేసి కంకర పోశారు. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు మట్టి కుంగిపోయి గుంతలమయమైంది. ఇప్పుడా దారిలో వెళ్తున్న వాహనాలు అదుపు తప్పుతున్నాయి.

* చెన్నాపూర్‌ వద్ద వంతెనపై నుంచి ఓ కారు అదుపు తప్పి కిందకు దూసుకొచ్చి పలువురికి గాయాలైన ఘటన ఇటీవల జరిగింది. కొత్త నిర్మాణం వద్ద ఇరువైపులా బీటీ నిర్మాణం చేయకపోవడంతో కంకర దారి అధ్వానంగా మారింది. గుంతల కారణంగా వాహనాలు వాటిల్లో పడి అదుపు తప్పి పడిపోతున్నాయి. వెంటనే బీటి రోడ్డు నిర్మించి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు విన్నవిస్తున్నారు.


వంతెనపై నుంచి కింద పడ్డ కారు

త్వరలోనే రహదారి నిర్మిస్తాం : - శ్రీనివాస్‌, డీఈ, ఆర్‌అండ్‌బీ
చెన్నాపూర్‌, గోమారం గ్రామాల్లో వంతెనల వద్ద మట్టి దారులు అధ్వానంగా మారాయి. ప్రస్తుతం పాత రోడ్డు గుత్తేదారుతోనే పనులు చేయిస్తాం. వర్షాలు పూర్తిగా తగ్గాక బీటీ నిర్మింపజేస్తాం. సమస్య తీరుస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని