logo

జమవుతున్న నిధులు.. తీరనున్న ఇబ్బందులు

పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంఘం నిధులను జనాభా ప్రాతిపదికన కేటాయిస్తున్నాయి.

Published : 25 Nov 2022 01:01 IST

న్యూస్‌టుడే, మెదక్‌

పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంఘం నిధులను జనాభా ప్రాతిపదికన కేటాయిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా గ్రామ ప్రత్యేక ఖాతాల్లోనే నిధులను జమచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సందర్భంగానే సర్పంచులతో శూన్య ఖాతాలను తెరిపించింది. గత కొన్ని నెలలుగా నిధులు రాలేదు. తాజాగా జిల్లాకు కొన్ని నిధులు విడుదల అయ్యాయి. స్థానిక సంస్థలకు వివిధ పథకాల కింద వచ్చే నిధులు, ఖర్చులను పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్రం పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్‌కు అనుసంధానంగా బ్యాంకు ఖాతాలు సక్రమంగా ఉన్నాయా? లేవా? అని తెలుసుకునేందుకు పంచాయతీల ఖాతాలో నిధులను జమచేసింది. వీటికి సంబంధించిన డిజిటల్‌ కీలను సర్పంచి, ఉపసర్పంచులకు ఇచ్చారు. ప్రస్తుత ఏడాదిలో మంజూరు కావాల్సిన నిధుల్లో 10 శాతం మాత్రమే విడుదల చేశారు..

ఇప్పటివరకు 429 పంచాయతీల్లో

మిగతావి మంజూరు కావాలంటే పీఎఫ్‌ఎంఎస్‌లో ఓచర్‌ జనరేట్‌ చేయాల్సి ఉంటుంది. వీటిని ఏజెన్సీలు, రెసిడెన్సీలు, పంచాయతీ ఉద్యోగులుగా విభజించి ఆన్‌లైన్‌ చేయాలి. ఆ తర్వాతే చెక్కులను వారి పేరిట అందజేస్తారు. జిల్లాలో 469 పంచాయతీలున్నాయి. వీటికి పల్లె ప్రగతి కింద, కేంద్రం ఇచ్చే 15వ ఆర్థికసంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కలిపి మొత్తం ప్రతి నెలా రూ.6.73 కోట్లు మంజూరవుతాయి. కొత్తగా తెరిచిన ఖాతాల్లో నిధులను జమచేసేందుకు కేంద్రం తాజాగా జిల్లాకు రూ.12 లక్షలు విడుదల చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 429 పంచాయతీల్లో నిధులు జమయ్యాయి. సాంకేతిక కారణాల వల్ల మిగతా వాటిల్లో కాలేదు. వాటిని అధికారులు సరిచేస్తున్నారు.

ఖాతాల స్తంభన లేదిక

మొన్నటి వరకు పంచాయతీల ఖాతాలు స్తంభించిపోవడంతో సర్పంచులు అవస్థలు ఎదుర్కొన్నారు. డబ్బులున్నా ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించడంతో వీరి ఖాతాలను మూడు, నాలుగు నెలల పాటు ఇలాగే జరేగిది. చేసిన పనులకు చెక్కులు పాస్‌ చేయించుకునేందుకు ఖజానా కార్యాలయానికి వెళితే తరచూ ఈ సమస్యే ఎదురయ్యేది. దీంతో సర్పంచులు అప్పులు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం నేరుగా రానుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతాలను పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌(పీఎఫ్‌ఎంఎస్‌)కు అనుసంధానం చేస్తారు. అనంతరం కేంద్రం నుంచి వచ్చే నిధులు 10 రోజుల వ్యవధిలోనే ఈగ్రామ్‌ స్వరాజ్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయాల్సి ఉంటుంది.


అవగాహన కల్పిస్తున్నాం

- తరుణ్‌కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి

ఆర్థికసంఘం నిధులను నేరుగా జమచేసేందుకు పంచాయతీలు తెరిచిన బ్యాంకు ఖాతాల్లో నగదు జమవుతోంది. ప్రయోగాత్మకంగా చెల్లింపులకు నిధులు విడుదలయ్యాయి. అన్ని సక్రమంగా ఉన్న వాటికే ఇవి చేరాయి. మిగతా వాటిలో సాంకేతిక సమస్యలు సరిచేశాక జమచేస్తారు. దీనిపై పాలకవర్గాలు, కార్యదర్శులకు అవగాహన కల్పిస్తున్నాం.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని