logo

ఐక్యత.. క్రమశిక్షణ..ఎన్‌సీసీ

ప్రతి విద్యార్థికి ఏకత, క్రమశిక్షణ.. ఐక్యంగా ఉంటే విపత్కర పరిస్థితులను సులభంగా ఎదుర్కోవచ్చు.

Published : 27 Nov 2022 01:47 IST

మెదక్‌లో..

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, సిద్దిపేట, మెదక్‌ టౌన్‌, వికారాబాద్‌ టౌన్‌, వికారాబాద్‌: ప్రతి విద్యార్థికి ఏకత, క్రమశిక్షణ.. ఐక్యంగా ఉంటే విపత్కర పరిస్థితులను సులభంగా ఎదుర్కోవచ్చు. క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ప్రభుత్వం విద్యాలయాల్లో ఎన్‌సీసీ పేరిట ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. నేడు ఎన్‌సీసీ దినోత్సవం సందర్భంగా కథనం.

ప్రతిభ చూపితే..

ఎన్‌సీసీ కేడెట్లు దేశ సేవలో ముందుంటారు. ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే అక్కడికి చేరుకొని సేవలు అందిస్తారు. సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు సంక్షేమ నిధి కోసం విరాళాలు సైతం సేకరిస్తారు. ఎన్‌సీసీలో ప్రతిభచాటే విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల్లోనూ రిజర్వేషన్లు వర్తిస్తాయి. సంగారెడ్డి జిల్లాలో 2400, సిద్దిపేటలో 1600, మెదక్‌లో 200 కేడెట్లు ఉన్నారు.

విద్యార్థినులు సైతం..

ఎన్‌సీసీలో చేరేందుకు గతంలో విద్యార్థినులు అంతగా ఆసక్తి చూపకపోయేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. వారి ఆలోచనల్లో మార్పు వస్తోంది. అమ్మాయిలు కూడా ఎన్‌సీసీలో చేరేందుకు పోటీపడుతున్నారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్‌సీసీ ఇందుకు నిదర్శనం. ప్రతిభచాటుతూ పోలీసు ఉద్యోగాలు లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు.
పాఠశాలల్లోనూ..

వికారాబాద్‌లో మొత్తం ఏడు ఎన్‌సీసీ గ్రూపులు ఉన్నాయి, 1100 మంది కేడెట్లు ఉన్నారు. ప్రతి ఆదివారం శిక్షణ ఇస్తున్నారు. అనంతపద్మనాభ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో బాలికలు, బాలుర బృందాలు కొనసాగుతున్నాయి. యాలాల్‌, అగ్గనూరు, మూజాహిద్‌పూర్‌, కంకల్‌, వికారాబాద్‌ జడ్పీ పాఠశాలల్లో, ఓ ప్రైవేటు బడిలోనూ ఎన్‌సీసీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కేర్‌ టేకర్ల ద్వారా కొనసాగిస్తున్నారు. మెదక్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రిపబ్లిక్‌ పరేడ్‌, తలసేన వంటి శిబిరాలకు ఎంపికయ్యేందుకు ఆర్మీ, ఎన్‌సీసీ అధికారులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

ప్రత్యేక గుర్తింపు..

సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొత్తం 150 మంది కేడెట్లు ఉన్నారు. గత విద్యాసంవత్సరం 23 మంది ‘సీ’ ధ్రువపత్రాలు పొందారు. ప్రస్తుతం ఐజీసీ (ఇంటర్‌ గ్రూపు కాంపీటీషన్‌) శిబిరానికి ఇద్దరు, జాతీయస్థాయి ట్రెక్కింగ్‌ శిబిరానికి ముగ్గురు, ఆర్మీ అనుబంధ శిబిరానికి ఆరుగురు ఎంపికయ్యారు. ఇటీవల సిద్దిపేటలో సీఏటీసీ (కంబైన్డ్‌ యాన్వుల్‌ ట్రైనింగ్‌ క్యాంపు) నిర్వహించగా.. 9-తెలంగాణ బెటాలియన్‌ (కరీంనగర్‌)కు చెందిన 600 మంది పాల్గొన్నారు. కేర్‌ టేకర్‌ డా.ఆర్‌.మహేందర్‌రెడ్డి నేతృత్వంలో వారానికి రెండు మార్లు శిక్షణ సాగుతోంది.


తారా పథం

సంగారెడ్డిలో దివ్యాంగుల క్రీడాపోటీలో పేర్లు నమోదు చేసుకుంటూ..

సంగారెడ్డి జిల్లాలో 25 పాఠశాలలు, 8 కళాశాలల్లో ఎన్‌సీసీ విభాగాలు ఉన్నాయి. సంగారెడ్డి తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్‌సీసీ విద్యార్థులు ఏటా దిల్లీ రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపికవుతుండటం విశేషం. కళాశాలకు చెందిన బీకాం విద్యార్థిని కీర్తన, శ్రుతినాయక్‌ 2023 జనవరిలో జరిగే పరేడ్‌ శిబిరానికి ఎంపికయ్యారు. ఇద్దరు ఎన్‌సీసీ కేడెట్లు అగ్నిపథ్‌ రాత పరీక్షకు ఎంపికయ్యారు. ఇదే కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థి సాయిశివ వాయుసేనలో ఉద్యోగం చేస్తున్నారు. సదాశివపేట, జహీరాబాద్‌ మండలం రంజోల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలోనూ అందుబాటులో ఉంది. జిల్లాలో ముఖ్యమైన కార్యక్రమాలు, ఉత్సవాల నిర్వహణలో కేడెట్లు కీలకపాత్ర పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని