logo

మాట వినకుంటే..మూత తప్పదు!

జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పరిశ్రమలున్నాయి. కాలుష్య కారకాలే అధికం. వాయు, జల, శబ్దకాలుష్యాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.

Updated : 27 Nov 2022 05:01 IST

కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో పీసీబీ బృందాల తనిఖీ
జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిక

ఐఐటీ హైదరాబాద్‌ ఆవరణలో  ఏర్పాటు చేసిన గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రం

ఈనాడు, సంగారెడ్డి: జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పరిశ్రమలున్నాయి. కాలుష్య కారకాలే అధికం. వాయు, జల, శబ్దకాలుష్యాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. చలికాలం వస్తే చాలు.. చాలా చోట్ల ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. ఎక్కువ సమయం ఇలాంటి గాలిని పీల్చితే తలతిరగడం, వాంతులవడం లాంటి సమస్యలు వస్తాయి. ప్రధానంగా పాశమైలారం, బోర్పట్ల, గుండ్లమాచనూరు, కొండాపూర్‌, పటాన్‌చెరు, జహీరాబాద్‌ ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉంది.

ఏడు ప్రత్యేక బృందాలు

కాలుష్య తీవ్రత అధికంగా ఉండే హైదరాబాద్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు సంగారెడ్డి జిల్లాలోనూ నిత్యం పర్యవేక్షణకు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలో 14 మంది అధికారులున్నారు. ఫిర్యాదు అందడమే ఆలస్యం.. సంబంధిత ప్రాంతానికి వెళ్లి గాలి నాణ్యతను పరీక్షిస్తున్నారు. ఉల్లంఘనలు గుర్తిస్తే సంబంధిత పరిశ్రమల నుంచి బ్యాంకు గ్యారెంటీని జప్తు చేయడంతో పాటు మూసేసేలా చర్యలుంటున్నాయి. గతేడాది పటాన్‌చెరు నియోజకవర్గంలోని రెండు పరిశ్రమలకు మూసివేతకు ఉత్తర్వులు ఇచ్చారు.

అక్టోబరు మొదట్లోనే ప్రణాళిక

చలికాలం రావడానికి ముందుగానే పీసీబీ అధికారులు ఈసారి కార్యాచరణ రూపొందించారు. కాలుష్య కారక పరిశ్రమలన్నింటినీ హెచ్చరించారు. ఘాటైన వాసనలు వెలువకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బంది కలిసి పరిశ్రమలకు వెళ్లి అక్కడ చేసిన ఏర్పాట్లనూ పరిశీలించారు. ఫార్మా, ఇతరత్రా పరిశ్రమల్లో ప్రత్యేక సెన్సార్‌లను అమర్చారు. నిర్వహణలో ఏదైనా తేడా ఉంటే ఇవి పసిగడతాయి. అధికారులూ ఆన్‌లైన్‌ ద్వారా ఈ డాటాను చూసుకోవచ్చు.

ఐఐటీ, ఇక్రిశాట్‌లలోనూ సమస్య

ఐఐటీలో ఆచార్యులు వారి కుటుంబాలతో ప్రాంగణంలోని బహుళ అంతస్తుల భవనాల్లో నివాసముంటారు. ఇక్రిశాట్‌లోనూ చాలా మంది ఉంటారు. ఘాటైన వాసనల వల్ల సమస్యలు వస్తున్నాయని చాలా సార్లు ఈ సంస్థల నుంచి కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు అందాయి. ఇక్రిశాట్‌, ఐఐటీ ప్రాంగణాల్లో గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు నమోదు చేసే యంత్రాలను బిగించారు.

మీరూ ఫిర్యాదు చేయవచ్చు

మీ ప్రాంతంలో ఘాటైన వాసనలతో ఇబ్బంది పడుతున్నా... జల, శబ్దకాలుష్య సమస్య ఉన్నా.. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. 10741 టోల్‌ఫ్రీ నంబరు ద్వారా సమాచారమిస్తే పీసీబీ సిబ్బందిని పంపి విచారణ చేయిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని