logo

వనితల చొరవ కొనుగోళ్లలో హవా!

ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోళ్లలో జిల్లా ఐకేపీ మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు.

Published : 27 Nov 2022 01:47 IST

కమీషన్‌ రూపేణా లబ్ధి పొందుతున్న ఐకేపీ మహిళలు

శనిగరంలో ధాన్యం తూకం వేయిస్తూ..

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌, హుస్నాబాద్‌ గ్రామీణం, కోహెడ గ్రామీణం: ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోళ్లలో జిల్లా ఐకేపీ మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. కమీషన్‌ రూపంలో అందుతున్న ఆదాయంతో లబ్ధి పొందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చినప్పటి నుంచి ఆరబెట్టడం, వర్షం నుంచి తడవకుండా సూచనలు, సలహాలు ఇవ్వడం..  తేమశాతం చూడటం, ఎప్పటికప్పుడు తూకాలు వేయించడం అనంతరం మిల్లులకు తరలిస్తున్నారు. కేంద్రాలను సమన్వయంతో నిర్వహిస్తూ కష్టపడి ఫలితం పొందుతున్నారు. మొదట్లో పదుల సంఖ్యలో మొదలైన కొనుగోలు కేంద్రాలు ప్రస్తుతం 225కు చేరడం విశేషం. ఏటా రెండు సీజన్లు కలిపి సుమారు రూ.40లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తుండగా కోట్లలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. అధికమొత్తంలో కమీషన్‌ పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.


ఆరేళ్లుగా నిర్వహిస్తున్నాం..

ఆరేళ్లుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. గతేడాది వానాకాలం సీజన్‌లో 318 మంది రైతుల నుంచి 14,083, యాసంగిలో 342మంది నుంచి 14,217 క్వింటాళ్లు కొనుగోలు చేశాం. వీటికి సంబంధించి ఈ ఏడాది ఆగస్టులో కొంత కమీషన్‌ ఇచ్చారు. ఇంకా రావాల్సి ఉంది.

బెక్కంటి అనిత, జనగామ వీఓఏ


ఓర్పు అవసరం..

మూడేళ్ల నుంచి కొనుగోళ్లు చేస్తున్నాం. మా వీవోఏ పుల్లె లక్ష్మి కీలకపాత్ర పోషిస్తున్నారు. గతేడాది రెండు సీజన్లు కలిపి 392మంది రైతుల నుంచి 17,468 క్వింటాళ్ల ధాన్యం కొన్నాం. తూకం వేయడం, మిల్లుకు తరలింపు విషయంలో ఇబ్బందులు, రాజకీయ ఒత్తిడి ఉంటుంది. వాటన్నింటిని ఓపికతో పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నాం.

- వంగ రమ్యశ్రీ, పోతారం(ఎస్‌) వీవో అధ్యక్షురాలు  


ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నాం..

ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు 121 కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశాం. నిర్వాహకులు, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నాం. ఇప్పటి వరకు 8.21లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశాం. రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చూస్తున్నాం.

కరుణాకర్‌, డీపీఎం(మార్కెటింగ్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని