logo

బృందంగా అడుగేసి.. అండగా నిలిచి..

కేవలం రుణాలు తీసుకొని స్వయం ఉపాధి పొందడమే కాకుండా అన్నదాతలకూ అండగా నిలుస్తున్నారు స్వయం సహాయక సంఘాల మహిళలు. ఆరుగాలం శ్రమించి పండించే పంటను కొనుగోలు చేస్తూనే, మరోవైపు కమీషన్‌ పొందుతున్నారు.

Published : 29 Nov 2022 06:20 IST

ధాన్యం కొనుగోలులో  దూసుకెళ్తున్న మహిళా సంఘాలు
న్యూస్‌టుడే, మెదక్‌

వెంకటాయిపల్లిలో..

కేవలం రుణాలు తీసుకొని స్వయం ఉపాధి పొందడమే కాకుండా అన్నదాతలకూ అండగా నిలుస్తున్నారు స్వయం సహాయక సంఘాల మహిళలు. ఆరుగాలం శ్రమించి పండించే పంటను కొనుగోలు చేస్తూనే, మరోవైపు కమీషన్‌ పొందుతున్నారు. వచ్చిన డబ్బు సంఘం ద్వారా అప్పులిచ్చి, వాటిపై వచ్చే వడ్డీతో ముందుకు సాగుతుండటం విశేషం.

అన్నింటా..

మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి రుణాలు పొంది సొంత వ్యాపారం, కుటుంబ అవసరాలకు వినియోగిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఇలా ముందుడుగు వేసిన వీరికి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల బాధ్యత అప్పగించింది. ఏటా ఖరీఫ్‌, రబీలలో వరి దిగుబడులను ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ) ఆధ్వర్యంలో కొంటున్నారు. గన్నీ సంచులు, తేమ కొలిచే, తూకం వేసే యంత్రాలు, టార్పాలిన్లు, కనీస వసతులు కల్పించడం వీరి బాధ్యత. కేంద్రానికి వచ్చే ధాన్యాన్ని కొని లారీల్లో మిల్లులకు పంపించడం, ట్రక్‌షీట్‌ రూపొందించడం, మిల్లుకు చేరాక ట్యాబ్‌లో వివరాలు నమోదు వంటివి నిరంతరం కొనసాగిస్తున్నారు.

కమీషన్‌తో నిర్వహణ..

ధాన్యం సేకరణకు ఐకేపీ మహిళలకు క్వింటాకు రూ.32 కమీషన్‌ అందుతుంది. ఇందులో 90 శాతం గ్రామసంఘానికి, 10 శాతం జిల్లా సమాఖ్యకు చేరుతుంది. వచ్చే కమీషన్‌లో 40 శాతం మేర వ్యయమవుతాయి. ఇలా గ్రామసంఘం ఖాతాల్లో జమైన డబ్బును అప్పుగా అందజేస్తున్నారు. వాటిపై వచ్చే వడ్డీతో సంఘాన్ని నడిపిస్తున్నారు. 11 సీజన్లలో సంఘాల మహిళలకు రూ.13.78 కోట్లు కమీషన్‌గా సంపాదించగా, ఇప్పటి వరకు రూ.7.36 కోట్లు జమయ్యాయి. 2020-21 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రూ.5.38 కోట్లు రావాల్సి ఉంది. ఈ విషయమై డీపీఎం మోహన్‌ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో సంఘాల మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో పాటు ఉన్న సమస్యలను తొలగించి, సకాలంలో కొనుగోలు, ట్యాబ్‌ నమోదు, ఖాతాల్లో నగదు జమపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. కమీషన్‌తో సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయని వివరించారు.

43 లక్షల క్వింటాళ్లు..

జిల్లా ఆవిర్భావం నుంచి ఐకేపీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 43 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 2017-18 ఖరీఫ్‌ నుంచి ప్రక్రియ మొదలైంది. ఆరంభంలో 52 కేంద్రాలు ఏర్పాటు చేయగా 2.30 లక్షల టన్నుల మేర కొనుగోలు చేయగా, రూ.73.87 లక్షలు కమీషన్‌ పొందారు. ఆ తర్వాత సీజన్ల వారీగా కేంద్రాలను పెంచుతూ వచ్చారు. 2020-21 రబీలో 9.51 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 106 కేంద్రాలు అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పటి వరకు 10,838 మంది నుంచి రూ.106.59 కోట్ల విలువైన 5.17 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని