logo

చెమట చుక్క కిందపడకుండా లబ్ధిదారులకు ఇళ్లు

పైసా ఖర్చులేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదలకు ఇళ్లను పంపిణీ చేస్తున్నారని, చెమట చుక్క కిందపడకుండా లబ్ధిదారులకు అందించిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

Published : 29 Nov 2022 06:20 IST

వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు

కేసీఆర్‌నగర్‌లో విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న హరీశ్‌రావు, తదితరులు

న్యూస్‌టుడే - సిద్దిపేట, సిద్దిపేట టౌన్‌: పైసా ఖర్చులేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదలకు ఇళ్లను పంపిణీ చేస్తున్నారని, చెమట చుక్క కిందపడకుండా లబ్ధిదారులకు అందించిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సొంతింటిలో ఆత్మగౌరవంతో జీవించాలని ఆకాంక్షించారు. సిద్దిపేటలోని కేసీఆర్‌ నగర్‌ 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం, గ్రామ దేవతల ఆలయాలకు ప్రహరీ, 1.50 లక్షల లీటర్ల సామర్థ్యంతో భూ ఉపరితల జలభాండాగారం నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. రెడ్డి సంక్షేమ భవనంలో 320 మంది లబ్ధిదారులకు కేసీఆర్‌ నగర్‌లో రెండు పడక గదుల ఇళ్లను కేటాయిస్తూ పట్టాలను పంపిణీ చేశారు. డిసెంబరు-2 తరువాత మంచి ముహూర్తం చూసి సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒక్కో లబ్ధిదారుకు రూ.20 లక్షలు విలువైన ఇల్లు దక్కడం అదృష్టంగా భావించాలన్నారు. లంచాలు, పైరవీలకు తావులేకుండా పేదలకు అందిస్తున్నట్లు వివరించారు. ఇళ్ల విక్రయం, ఇతరులకు అద్దెకు ఇచ్చే ప్రయత్నాలు చేస్తే వేరే వారికి కేటాయిస్తామన్నారు. గతంలో కొందరు నిజాయతీగా ఇళ్లు పొందిన పట్టాదారులు వివిధ కారణాలతో తిరిగి వెనక్కి ఇచ్చారని గుర్తుచేశారు. విద్యుత్తు సమస్యలు ఎదురవకుండా రూ.5.42 కోట్ల ఉపకేంద్ర నిర్మాణం చేపట్టామని, సిద్దిపేటలో ఇది ఏడో కేంద్రంగా మారనుందన్నారు. త్వరలోనే సెల్‌ఫోన్‌ టవర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆటో స్టాండ్‌ ఏర్పాటుకు స్థలం పరిశీలించాలని సూచించారు. వారం రోజుల్లో ఎల్‌అండ్‌టీ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. గ్రూప్‌-4 ప్రకటన వెలువడిన నేపథ్యంలో యువత సన్నద్ధం కావాలన్నారు. పట్టాల పంపిణీ ప్రారంభానికి ముందు కొత్తగా ఇల్లు కేటాయించాలంటూ విన్నవించేందుకు వచ్చిన ప్రజల నుంచి నేరుగా మంత్రి దరఖాస్తులు స్వీకరించారు. పట్టాలు పొందిన ఆనందంలో కొందరు లబ్ధిదారులు మంత్రి పాదాలకు నమస్కరించి కృతజ్ఞత తెలిపారు. ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, సీపీ శ్వేత, అదనపు డీసీపీ మహేందర్‌, ఏసీపీ దేవారెడ్డి, రాజనర్సు, క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు పాల సాయిరాం, కమిషనర్‌ రవీందర్‌రెడ్డి, సుడా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు