logo

నాయకత్వం.. ప్రజాచైతన్యం!

విద్యార్థి దశ నుంచే సమాజం గురించి ఆలోచించాలి. అప్పుడే సమసమాజానికి బాటలు పడతాయి. విద్యార్థుల్లో సామాజిక దృక్పథాన్ని అలవర్చాలన్న సంకల్పంతో ప్రారంభించిందే జాతీయ సేవా పథకం. డిగ్రీ విద్యార్థులు ఇందులో వాలంటీర్లుగా ఉంటారు.

Published : 29 Nov 2022 06:20 IST

డిగ్రీ కళాశాలల్లో ఒయాసిస్‌ మిజల్‌ ప్రాజెక్టుకు శ్రీకారం
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, మెదక్‌ టౌన్‌, సిద్దిపేట, వికారాబాద్‌ టౌన్‌

విద్యార్థి దశ నుంచే సమాజం గురించి ఆలోచించాలి. అప్పుడే సమసమాజానికి బాటలు పడతాయి. విద్యార్థుల్లో సామాజిక దృక్పథాన్ని అలవర్చాలన్న సంకల్పంతో ప్రారంభించిందే జాతీయ సేవా పథకం. డిగ్రీ విద్యార్థులు ఇందులో వాలంటీర్లుగా ఉంటారు. చదువుతో పాటు సమాజంలో మార్పు, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు కృషి చేస్తారు. ఇప్పటికే వివిధ రూపాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఒయాసిస్‌ మిజల్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం విశేషం.

ప్రాజెక్టు రూపకల్పన ఇలా..

గుజరాత్‌లోని వడోదరలో ఓయాసిస్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల పెంపు, ప్రతిభకు పదను పెట్టే కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. తద్వారా యువతలో మార్పునకు బాటలు పడ్డాయి. దీన్ని గమనించిన రాష్ట్ర కళాశాల విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించారు. ఇందుకు అనుగుణంగా ఒయాసిస్‌ మిజల్‌ పేరు ప్రాజెక్టు అమలుపై ఉత్తర్వులు జారీచేశారు.

పర్యవేక్షణ బృందాలు..

కళాశాలల్లో అమలుచేస్తున్న ఒయాసిస్‌ మిజల్‌ ప్రాజెక్టు సక్రమంగా సాగేలా పర్యవేక్షణ బృందాలనూ ఏర్పాటుచేశారు. కేంద్ర, ప్రాంతీయ బృందాలు ఉంటాయి. ఆచార్యులు, సహాయ ఆచార్యులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలోనూ కార్యక్రమ అధికారులు ఉంటారు. సంగారెడ్డి జిల్లాకు తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి పద్మజ, మెదక్‌కు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి విశ్వనాథం, సిద్దిపేటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల(సిద్దిపేట) ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి భైరయ్య, వికారాబాద్‌కు కొడంగల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి సోమ్లా పర్యవేక్షణ అధికారులుగా వ్యవహరించనున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి: ప్రవీణ, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌

ఒయాసిస్‌ మిజల్‌ ప్రాజెక్టుతో విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లంతా భాగస్వాములు కావాలి. పోటీల్లో పాల్గొని తమ ప్రతిభ చాటాలి. కళాశాలల్లో అత్యధికులు ముందుకొచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని అంశాల్లో చురుగ్గా ఉండటం అవసరం.

మూడు విడతల్లో..

ప్రాజెక్టును మూడు విడతల్లో అమలు చేస్తారు. తొలి విడతలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. దేశభక్తి, సామాజిక అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు. కళాశాలల్లోనే విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. రెండో దాంట్లో విడతలో బృంద చర్చలు ఉంటాయి. తమకు కేటాయించిన అంశంపై మాట్లాడాల్సి ఉంటుంది. ఇందులో నిర్దేశించిన అంశంపై విద్యార్థులు ధైర్యంగా మాట్లాడేలా, తమ మనసులోని భావాలను వ్యక్తంచేసేలా ప్రోత్సహిస్తారు. మూడో విడతలో ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రణాళికలు తయారు చేస్తారు. సృజనాత్మకంగా ఉండేలా దిశా నిర్దేశం చేస్తారు. అనంతరం వాటిని ప్రదర్శిస్తారు. ఇలా విద్యార్థుల్లో ప్రతిభ వెలికి తీయడంతో పాటు పాటు నాయకత్వల లక్షణాలు పెంపొందించేలా ఆయా పోటీలు కొనసాగిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు