logo

ఉద్యానం...ఆహ్లాదం గగనం

ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు వార్డుల్లో పట్టణ ప్రకృతి వనాలు(పార్కుల) నిర్మించాలని నిర్ణయించారు

Updated : 29 Nov 2022 06:54 IST

సంఖ్య ఘనం.. వసతులు శూన్యం
రూ.లక్షలు ఖర్చు చేసినా వినియోగంలోకి రాని పట్టణ ప్రకృతి వనాలు

జహీరాబాద్‌ సాయిరాం నగర్‌ కాలనీలో అధ్వానంగా..

ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు వార్డుల్లో పట్టణ ప్రకృతి వనాలు(పార్కుల) నిర్మించాలని నిర్ణయించారు. అధికారుల నిర్లక్ష్యం.. నిధులు పూర్తి స్థాయిలో కేటాయించక పోవడంతో ఇవి ప్రజలకు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడం లేదు. కొన్ని చోట్ల ప్రారంభించకుండా తాళాలు వేయగా.. మరికొన్ని చోట్ల అరకొర వసతులతో సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కథనం.

అధికారులు దృష్టి సారిస్తేనే..

ప్రజలకు ఆహ్లాదమే లక్ష్యంగా పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. లక్షలాది రూపాయలు వెచ్చించినా ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. అధికారులు స్పందించి చిన్నపాటి మరమ్మతులు చేయిస్తే వినియోగంలోకి తీసుకురావచ్చు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఈ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
* జహీరాబాద్‌లో సాయిరాంనగర్‌, ఆదర్శనగర్‌, చెన్నారెడ్డినగర్‌ కాలనీతో పాటు 21 పార్కులను అభివృద్ధి చేశారు. వీటిలో మూడు మాత్రమే బాగున్నాయి. మిగితా చోట్ల మొక్కలు నాటి వదిలేశారు. నడక దారి, చిన్న పిల్లలు ఆడుకునేందుకు సౌకర్యాలు కల్పించలేదు.
* సదాశివపేటలో 20 ప్రకృతి వనాలు నిర్మించారు. ఇక్కడ మొక్కలు నాటి వదిలేశారు. నడక దారులు, పిల్లలు ఆడుకునేందుకు వస్తువులు చాలా చోట్ల ఏర్పాటు చేయలేదు. కొన్ని చోట్ల నాటినా.. వాటిని సంరక్షించకపోవడంతో ఎండిపోతున్నాయి. నిర్వహణ ధ్వానంగా మారింది.

జిల్లా కేంద్రంలోనూ నిర్లక్ష్యం

సంగారెడ్డి పట్టణం 29వ వార్డు పరిధి చాణక్యపురి కాలనీలో ఏడాది క్రితం రూ.10 లక్షలతో పార్కు నిర్మించారు. చిన్న పాటి వనులు చేస్తే వినియోగించే అవకాశం ఉన్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. గేటుకు తాళం వేయడంతో ప్రజలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అందులో నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. 28వ వార్డు శాంతి నగర్‌లోని మహిళా పార్కు నిర్వహణ అధ్వానంగా మారింది. మంజీరానగర్‌లోనూ నిర్వహణ సరిగా లేదు.

బొల్లారం, అందోలు-జోగిపేటలో..

* అందోలు-జోగిపేటలో ఐదు చోట్ల ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ప్రభు మందిరం సమీపంలో ప్రకృతి వనాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇక్కడ నాటిన కొన్ని మొక్కలు ఎండిపోయాయి. గేటు సరిగా లేకపోవడంతో పందులు సంచారం చేస్తున్నాయి.
* బొల్లారంలోని శ్రీరాంనగర్‌ కాలనీ పక్కనున్న పట్టణ ప్రకృతి వనం అధ్వానంగా ఉంది. మొక్కలు సరిగా లేవు. గేటు నామమాత్రంగా ఏర్పాటు చేయడంతో పందులు తిరుగుతున్నాయి. ప్రజల ఆహ్లాదానికి అనువుగా ఏర్పాట్లు లేవు. సౌకర్యాలు కల్పిస్తే వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని