logo

ఆపసోపాలు తప్పేలా ఆధునికీకరణ!

అరకొర నిధులతో కేవలం కొంత వరకే సిమెంట్‌ లైనింగ్‌ పనులు పూర్తిచేయడంతో చివరి ఆయకట్టుకు నీరందక రైతులకు అవస్థలు తప్పలేదు. రెండు పంటల సాగుకు ఆపసోపాలు పడ్డారు.

Published : 30 Nov 2022 05:27 IST

ఎంఎన్‌ కెనాల్‌ పనులు ప్రారంభం

మహబూబ్‌నహర్‌ కాలువ

న్యూస్‌టుడే, మెదక్‌, హవేలిఘనపూర్‌: అరకొర నిధులతో కేవలం కొంత వరకే సిమెంట్‌ లైనింగ్‌ పనులు పూర్తిచేయడంతో చివరి ఆయకట్టుకు నీరందక రైతులకు అవస్థలు తప్పలేదు. రెండు పంటల సాగుకు ఆపసోపాలు పడ్డారు. ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే సమయంలో కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగించేందుకు అగచాట్లు పడాల్సి వచ్చేది. ఏటా ఇదే పరిస్థితి. ఎట్టకేలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కాలువ ఆధునికీకరణ పనులు షురూ అయ్యాయి.

21,625 ఎకరాలు..

ఘనపూర్‌ ప్రాజెక్టు ఏటా రెండు పంటలకు సాగు నీరందిస్తోంది. మంజీరాపై 0.2 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కొల్చారం మండలం చిన్నఘనపూర్‌ వద్ద ఆనకట్ట నిర్మించారు. మెదక్‌, హవేలిఘనపూర్‌, కొల్చారం, పాపన్నపేట మండలాల్లో 21,625 ఎకరాల ఆయకట్టును స్థీరికరించారు. దీని కింద మహబూబ్‌నహర్‌ (ఎంఎన్‌), ఫతేనహర్‌ (ఎఫ్‌ఎన్‌) కాలువలు ఏర్పాటుచేశారు. ఎంఎన్‌ కెనాల్‌ ద్వారా మెదక్‌, హవేలిఘనపూర్‌, కొల్చారం మండలాలకు, ఎఫ్‌ఎన్‌ ద్వారా పాపన్నపేట మండలంలోని చివరి ఆయకట్టుకు సాగు నీరందేలా కాలువలు నిర్మించారు. సింగూరు ప్రాజెక్టులో 0.4 టీఎంసీల వాటా ఉండగా, ఏడాదిలో ఖరీఫ్‌, రబీలలో నీటిని ఘనపూర్‌ ప్రాజెక్టుకు విడుదల చేస్తుంటారు.

సిమెంట్‌ లైనింగ్‌..

టెండరు దక్కించుకున్న గుత్తేదారు ముత్తాయిపల్లి వద్ద పనులు మొదలుపెట్టారు. సిమెంట్‌ లైనింగ్‌ చేపట్టారు. నక్కవాగు నుంచి పోచమ్మరాల్‌ వరకు 10 కి.మీ. మేర ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. సిమెంట్‌ లైనింగ్‌తో పాటు బొల్లారం మత్తడి వద్ద రెండు, పోచమ్మరాల్‌ వరకు మరో నాలుగు పాత వంతెనలు తొలగించి కొత్తవి నిర్మించనున్నారు.

* ఫతేనహర్‌ ప్రధాన కాలువ 12.8 కి.మీ.కు గాను 12 కి.మీ. సిమెంట్‌ లైనింగ్‌ పూర్తవగా, 27 కి.మీ. డిస్ట్రిబ్యూషన్‌ కాలువలు ఉన్నాయి. ప్రస్తుత నిధులతో వీటినీ ఆధునికీకరించనున్నారు. దీనిపై నీటిపారుదలశాఖ డీఈఈ శివనాగరాజు మాట్లాడుతూ.. పనులు త్వరగా పూర్తిచేసి రైతులకు వెతలు తప్పిస్తామని చెప్పారు.

రూ.55 కోట్లతో..

ప్రాజెక్టు పరిధి రెండు కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందాలంటే సిమెంట్‌ లైనింగ్‌ చేపట్టాలి. తెరాస ప్రభుత్వం వచ్చాక జైకాతో పాటు ఇతర నిధులను కేటాయించారు. 43 కి.మీ. పరిధి ఉన్న మహబూబ్‌నహర్‌ కాలువ పనులను 32 కి.మీ. వరకు పూర్తి చేశారు. కొల్చారం, మెదక్‌ మండలాల్లో పనులు పూర్తవగా, హవేలిఘనపూర్‌ మండలం నక్కవాగు వద్ద నిలిచిపోయాయి. ఇవి పూర్తయితేనే హవేలిఘనపూర్‌ మండలం ముత్తాయిపల్లి, శాలిపేట, జక్కన్నపేట మీదుగా పోచమ్మరాల్‌ వరకు నీళ్లు అందుతాయి. ఎంఎన్‌ కెనాల్‌ మిగిలిన ఆధునికీకరణ, పాపన్నపేట మండలంలో డిస్ట్రిబ్యూషన్‌ కాలువల మరమ్మతులకు రూ.55 కోట్లతో గతేడాది నీటిపారుదలశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించగా.. కొద్దినెలల క్రితం వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని