logo

మర్కటాలతో వణికిపోవాల్సిందేనా..!

శివ్వంపేట మండలం చుట్టూ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. వానరాల బెడదతో ఇక్కడి రైతులు కూరగాయల సాగు మానేయడం గమనార్హం. ధైర్యం చేసి వేసినా కనీసం కిలో కూడా అమ్ముకోలేని దుస్థితి.

Updated : 30 Nov 2022 05:33 IST

ఈనాడు, మెదక్‌

రూప్లాతండాలో చేను చుట్టూ వల

* శివ్వంపేట మండలం చుట్టూ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. వానరాల బెడదతో ఇక్కడి రైతులు కూరగాయల సాగు మానేయడం గమనార్హం. ధైర్యం చేసి వేసినా కనీసం కిలో కూడా అమ్ముకోలేని దుస్థితి. వాటి దాడులతో పంటలు నాశనం అవుతున్నాయి.

* నర్సాపూర్‌లో డాబాపైకి వెళ్లిన ఓ వృద్ధుడు వానరాలను చూసి భయాందోళన చెందాడు. కింద పడిపోగా మృతి చెందాడు. మరో ఘటనలో బాలుడు సైతం మృత్యువాతపడ్డాడు.

జిల్లాలోని పురపాలికలు, పల్లెల్లో ప్రజలను వానరాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మెదక్‌, నర్సాపూర్‌ పురపాలికల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రామాయంపేట, తూప్రాన్‌లలో ఇటీవల వీటి సంచారం కొంత తగ్గింది. రోడ్డు మీదకే కాదు ఇంటిపైకి వెళ్లాలన్నా వణికిపోవాల్సిందే. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో భాగంగా పండ్ల మొక్కలు పెంచాలని నిర్ణయించింది. పూర్తిస్థాయిలో అమలు కాక ఆశించిన ఫలితం దక్కడం లేదు.

వివిధ ప్రయత్నాలు..

నర్సాపూర్‌, మెదక్‌, రామాయంపేట పురపాలికల్లో ఇటీవల కోతులను పట్టుకున్నారు. వాటికి కు.ని. శస్త్రచికిత్సలు చేసి తిరిగి అడవుల్లో వదిలిపెట్టారు. రామాయంపేటలో సత్ఫలితం దక్కింది. బెడద కొంత తగ్గుముఖం పట్టింది. మెదక్‌, నర్సాపూర్‌లలో మాత్రం పెరిగింది. మూడు పురపాలికల్లో సుమారు 6,500 కోతులు పట్టుకెళ్లి అడవుల్లో వదిలామని అధికారులు చెబుతున్నారు.

నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలో సూచిక..

అడవుల సమీపంలో..

అడవుల సమీపంలోని గ్రామాల్లో పంటలను నాశనం చేస్తుండటంతో రైతులు భయపడుతున్నారు. కూరగాయల సాగు మానేసి వరి, ఇతరత్రా వాటికే మొగ్గుచూపుతున్నారు. పొలాల చుట్టూ వలలు కడుతున్నారు. నర్సాపూర్‌, మెదక్‌ శివారు అవుసులపల్లి తదితర చోట్ల ఏ దుకాణం చూసినా గ్రిల్స్‌ కనిపిస్తాయి. కోతులు సామాన్లు ఎత్తుకెళ్లకుండా ప్రతి దుకాణానికి ఇవి ఉండాల్సిందే. నర్సాపూర్‌, తూప్రాన్‌, కౌడిపల్లిలో పలువురు గాయపడ్డారు.

కార్యాచరణ రూపొందించినా..

మర్కటాల బెడద తప్పించేందుకు అడవుల్లో మారేడు, చింత, పనస, జువ్వి, సీమచింత, బాదం, వెలగ, మేడి, సీతాఫలం తదితర వాటిని పెంచాలని నిర్ణయించారు. దీనిపై ప్రత్యేక దృష్టిసారించి కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో భిన్నంగా ఉంది. ఆయా పండ్ల మొక్కలు నాటిన దాఖలాలే లేవు. ఇకనైనా సమస్యకు పరిష్కారం లభించేలా ప్రణాళికను పక్కాగా అమలు చేసేలా చొరవ చూపాల్సిన అవసరం ఉంది.

రోడ్డుపై వేయొద్దంటూ..

వానరాలకు పలువురు ఆహారం వేస్తుంటారు. నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలో పండ్లు అందిస్తుంటారు. అవి రోడ్లపైకి వచ్చేస్తుండగా వాహనాల కింద పడి చనిపోతున్నాయి. ఇక అవి దాడి చేస్తాయని వాహన చోదకులు భయపడుతుంటారు. దీంతో అధికారులు ఆయా చోట్ల సూచికలు ఏర్పాటు చేశారు. కోతులకు ఆహారం వేస్తే రూ.25 వేల జరిమానా లేదా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. నర్సాపూర్‌ రేంజ్‌లో ఏటా సుమారు 10 వేల వరకు పండ్ల మొక్కలు నాటుతున్నామన్నారు. 100 హెక్లార్టలో 35 వేలు నాటామని, సంరక్షణ కరవై ఎదగలేదని సంబంధిత అధికారులు చెప్పారు. ఈ విషయమై డీఎఫ్‌వోతో మాట్లాడేందుకు పలుమార్లు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని