logo

తిరుగుడు తిప్పలు... తప్పుతున్నాయ్‌!

ధరణి ద్వారా పట్టాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. సాంకేతిక సమస్యల కారణంగా తలెత్తిన లోపాలను సవరించే పనిలో నిమగ్నమైంది.

Published : 30 Nov 2022 05:27 IST

ధరణి సమస్యలు వేగంగా పరిష్కారం

కలెక్టరేట్‌లో ప్రజలనుండి అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు

ఈనాడు, సంగారెడ్డి: ధరణి ద్వారా పట్టాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. సాంకేతిక సమస్యల కారణంగా తలెత్తిన లోపాలను సవరించే పనిలో నిమగ్నమైంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కలెక్టర్‌ శరత్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కలెక్టరేట్‌లో దాదాపు 12 రోజులకు పైగా సాగుతున్న కార్యక్రమం ద్వారా రికార్డు స్థాయిలో పరిష్కారం చూపుతున్నారు. తమ బాధలను తీర్చాలని నెలల తరబడి ప్రదక్షిణలు చేసినా, పరిష్కారం కాని వాటికి రోజుల వ్యవధిలోనే మోక్షం లభిస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫోన్లు చేసి కృతజ్ఞతలు చెబుతున్నారు. జిల్లాలో తాజా గణాంకాల ప్రకారం 3,48,945 ఖాతాల్లో కలిపి 8,62,644 ఎకరాల భూమి నమోదయింది. అటవీ, ఇతర భూములన్నీ కలిపితే జిల్లాలో భూవిస్తీర్ణం 11.11 లక్షల ఎకరాలుంటుందని తేల్చారు.

మాడ్యూల్స్‌ అందుబాటులోకి

నిషేధిత జాబితాలో చేరినా, ఏవైనా పొరపాట్లు దొర్లినా పట్టాదారులు వాటి పరిష్కారానికి అర్జీలు చేసుకున్నా ప్రయోజనం దక్కలేదు. ఇలాంటి వారికి ఊరట దక్కేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. సుమోటోగా కొన్ని, దరఖాస్తులతో మరికొన్నింటిని పరిష్కరిస్తున్నారు. 12 రోజుల వ్యవధిలో 44,731 సమస్యలను తీర్చారు.  

అవగాహన పెంచేందుకు..

పాసుపుస్తకంలో దొర్లిన తప్పులను సవరించడం, అపరిష్కృతంగా ఉన్న పట్టామార్పిడిలు, ఫౌతీ, నిషేధిత జాబితా నుంచి తొలగించడం, న్యాయస్థానాల ఉత్తర్వుల ద్వారా పాసుపుస్తకాలు పొందడం, ఇంకా ముఖ్యమైన పొరపాట్లను సవరించేలా ఆరు మాడ్యూల్స్‌ ఉన్నాయి. ఏ మాడ్యూల్‌లో ఏ సమస్య పరిష్కారానికి మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలనే వివరాలతో తహసీల్దారు కార్యాలయాలు, మీసేవా కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు అందుబాటులో ఉంచనున్నారు.

టీఎం-33లో..: పట్టాదారు పాసుపుస్తకంలో దొర్లిన తప్పులను సవరించేందుకు గతంలో అవకాశం లేదు. ఇటీవల టీఎం-33 మాడ్యూల్‌ను తెచ్చారు. పట్టాదారు పేరు, తండ్రిపేరు, కులం, భూమి వర్గీకరణ, స్వభావం, భూమి పొందిన విధానం, భూవిస్తీర్ణం సవరణ, సర్వే సంఖ్య చేర్చడం, ప్రభుత్వ ఖాతా నుంచి పట్టాదారు వ్యక్తిగత ఖాతాకు మార్చడం ఇలాంటి వాటిని ఈ మాడ్యుల్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. తక్షణం పరిష్కరించేలా చర్యలుంటాయని స్పష్టం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని