logo

ప్రతి క్లస్టర్‌ పరిధిలో ఆయిల్‌పామ్‌ సాగు

‘గత ఏడాది యాసంగితో పోల్చితే ఈసారి సాగు లక్ష్యాన్ని పెంచాం. జిల్లాలో దాదాపు 80 శాతం మేర వరి కోతలు పూర్తయ్యాయి. రైతులు కొత్తగా నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు.

Published : 30 Nov 2022 05:27 IST

యాసంగికి అందుబాటులో విత్తనాలు, ఎరువులు
‘న్యూస్‌టుడే’తో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్‌

న్యూస్‌టుడే, సిద్దిపేట: ‘గత ఏడాది యాసంగితో పోల్చితే ఈసారి సాగు లక్ష్యాన్ని పెంచాం. జిల్లాలో దాదాపు 80 శాతం మేర వరి కోతలు పూర్తయ్యాయి. రైతులు కొత్తగా నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయానికి తావులేకుండా పకడ్బందీగా తనిఖీలు చేస్తున్నాం. ఎవరైనా దుకాణదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్టు కింద కేసులు తప్పవు..’ అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్‌ అన్నారు. యాసంగి (రబీ) సీజన్‌కి అన్నదాతలు సిద్ధమవుతున్న తరుణాన వ్యవసాయ శాఖ ప్రణాళికపై ‘న్యూస్‌టుడే’ మంగళవారం ముఖాముఖి నిర్వహించింది. వివిధ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ఇలా..

న్యూస్‌టుడే: పంటల సాగు లక్ష్యం ఏమిటి?

జిల్లా వ్యవసాయ అధికారి: వరి 3.60 లక్షల ఎకరాలు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న 20 వేల చొప్పున, శనగ 10 వేలు... వచ్చే మార్చిలోపు 15 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగును లక్ష్యంగా విధించుకున్నాం. పొద్దుతిరుగుడు, శనగ 30 వేల ఎకరాల చొప్పున, వేరుశెనగ - 5 వేల ఎకరాలకు సరిపడా విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. 6 వేల టన్నుల యూరియా, 2 వేల టన్నుల పొటాషియం, 10 వేల టన్నుల కాంప్లెక్సు నిల్వలు ఉన్నాయి. దశాబ్దాలుగా కాంప్లెక్స్‌, డీఏపీ వినియోగం కారణంగా బాస్వరం శాతం ఎక్కువగా ఉంది. అది కరిగించేలా పీఎస్‌బీని విరివిగా వాడాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.

న్యూ: రైతు వేదికల నిర్వహణ తీరుపై విమర్శలు వస్తున్నాయి.. మీరేమంటారు?

జి.వ్య.అ.: ప్రతి శుక్రవారం ఏఈవోలు రైతువేదికలు సందర్శిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో వేదిక నిర్వహణకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.9 వేలు వెచ్చిస్తోంది. వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతోంది. ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేస్తున్నారు.

న్యూ: విత్తనోత్పత్తి, భూసార పరీక్షల పరిస్థితి..?

జి.వ్య.అ.: 23,500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసేలా దిశానిర్దేశం చేశాం. ఖరీఫ్‌లో 60 క్లస్టర్ల పరిధిలో ఒక్కో చోట 50 నమూనాల చొప్పున సేకరించాం. 15 రోజుల్లో ఫలితాలు  అందించాం. ఏడాదిగా కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. ఖరీఫ్‌లో కలెక్టర్‌ అనుమతితో శాఖ నిధులతో ఈ ప్రక్రియను చేపట్టాం. సేంద్రియ సాగు ప్రోత్సహిస్తున్నాం. చేర్యాల మండలంలో దాదాపు 300 ఎకరాల్లో ఆ విధానంలో సాగు జరుగుతోంది.

న్యూ: జిల్లాలో ఆయిల్‌పామ్‌ తోటల పెంపకం తీరు..?

జి.వ్య.అ.: జిల్లాలో 127 క్లస్టర్లు ఉన్నాయి. మంత్రి హరీశ్‌రావు ఆదేశాలకు అనుగుణంగా ప్రతి క్లస్టర్‌ పరిధిలో 160 ఎకరాల మేర సాగు చేయించాలని నిర్ణయించాం. డీడీ తీయించడంతో పాటు ఉద్యాన శాఖ, ఆయిల్‌ఫెడ్‌ నుంచి రాయితీ ఇప్పించి.. మొక్కలు పెంచేలా ముందుకు సాగుతున్నాం. వచ్చే ఏడాది ముగింపులోపు 20 వేల ఎకరాల్లో పెంపకం లక్ష్యంగా విధించుకున్నాం.  

న్యూ: నాసిరకం విత్తనాలు, పురుగుమందుల అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్యలు..?

జి.వ్య.అ.: నిఘా పెంచాం... జిల్లాలో 559 దుకాణాలు ఉండగా 540 నమూనాలు సేకరించాం. 13 కంపెనీలను సందర్శించాం. నాణ్యత లేని, నాసిరకం విత్తనాలు, ఉత్పత్తులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశాం. అధిక ధరలకు యూరియా, ఇతర విక్రయాలు చేపడితే చర్యలు తప్పవు. రైతులు జాగ్రత్త వహించాలి. డిసెంబరు చివరిలోపు వరి నాట్లు పూర్తి చేయాలి.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు