logo

అమ్మతోడుగా.. చదువే లక్ష్యంగా!

చదవాలనే సంకల్పం ముందు వైకల్యం అడ్డుకాదని నిరూపిస్తోంది ఓ బాలిక. అమ్మ తోడుగా విద్యాభ్యాసం చేస్తోంది. సిద్దిపేట పరిధి ఇమాంబాద్‌కు చెందిన భార్గవి నడవలేని స్థితిలో సమస్యలను ఎదురీదుతూ ముందుకు సాగుతోంది.

Published : 30 Nov 2022 05:27 IST

భార్గవిని తరగతి గదిలోకి తీసుకువెళుతున్న తల్లి హైమావతి

న్యూస్‌టుడే, సిద్దిపేట: చదవాలనే సంకల్పం ముందు వైకల్యం అడ్డుకాదని నిరూపిస్తోంది ఓ బాలిక. అమ్మ తోడుగా విద్యాభ్యాసం చేస్తోంది. సిద్దిపేట పరిధి ఇమాంబాద్‌కు చెందిన భార్గవి నడవలేని స్థితిలో సమస్యలను ఎదురీదుతూ ముందుకు సాగుతోంది. అరుదైన కాలి ఎముకల వ్యాధి కారణంగా నడుము భాగం మొదలు కాళ్ల వరకు పీలగా మారి నడవలేని స్థితికి చేరింది. తల్లిదండ్రులు హైమావతి, చిరంజీవి.. ఒక్కగానొక్క కూతురైన ఆమెను గాజుబొమ్మగా పెంచుతున్నారు. ప్రస్తుతం సిద్దిపేటలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం (ఎంపీసీ) చదువుతోంది. నిత్యం ఆమె వెంట తల్లి తోడుగా కళాశాలకు హాజరవుతోంది. తరగతులు ముగిసే వరకు ఆవరణలో బీడీలు చుడుతోంది. ఒక తరగతి గది నుంచి మరో తరగతి గదికి, వాష్‌రూమ్‌కు వెళ్లినపుడు అక్కడే ఉండే అమ్మ ఎత్తుకొని తీసుకెళుతోంది. ఇమాంబాద్‌ నుంచి కళాశాలకు 5 కి.మీ. మేర నిత్యం ఆటోలో రాకపోకలు సాగిస్తున్నారు. పట్టణంలోనే ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేయగా 8.5 జీపీఏ సాధించింది.  

పేదరికంలో ఉన్నా...

భార్గవి పుట్టినపుడు కాళ్లు బాగానే ఉన్నా నెలలోపు ఆమెకు అరుదైన సమస్య మొదలైంది. అంబాడే క్రమంలో ముందుకు సాగలేక నేలవాలింది. ఆసుపత్రుల్లో చూపినా పరిష్కార మార్గాన్ని పూర్తిస్థాయిలో అన్వేషించలేకపోయారు. కాలి ఎముకలపై బరువుపడితే విరిగే పరిస్థితి తలెత్తింది. అలా బాల్యంలో ఏళ్లపాటు అవస్థ పడింది. దీంతో ఆమె తల్లి ఒకటో తరగతి నుంచే వెంట వెళ్లడం మొదలైంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ముందుకు సాగింది. పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని తండ్రి చిందు, యక్షగాన కళాకారుడు. సరైన ఉపాధి లేక కూలి పనులు చేస్తున్నాడు. తల్లి బీడీలు చుడుతోంది. ప్రతి నెలా కుటుంబం గడవడానికి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. బాలికకు దివ్యాంగ పింఛను సహా వచ్చే కొద్దిపాటి ఆదాయంతో రోజులు వెళ్లదీస్తున్నారు. ఆటో కిరాయి చెల్లింపునకు ప్రతి నెలా నానా ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం ప్రణాళికతో చదువుతున్నానని, సర్కారు సాధించడమే లక్ష్యమని భార్గవి చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని