logo

ఆసరాకు ఎదురుచూపులు!

ఏ ఆసరా లేని వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పింఛను పథకాన్ని అమలు చేస్తోంది. అభాగ్యులకు ఇది వరంలా మారింది.

Published : 02 Dec 2022 02:02 IST

మూడు నెలల బకాయిలు

లబ్ధిదారుల ఇబ్బందులు

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

ఆసరా లేని వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పింఛను పథకాన్ని అమలు చేస్తోంది. అభాగ్యులకు ఇది వరంలా మారింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. సాయం కోసం లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. పింఛను ఎప్పుడు అందుతుందా అని ప్రతినెలా ఒకటో తారీఖు నుంచి బ్యాంకులు, తపాలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మూడు నెలల బకాయిలు విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కథనం.

1.62 లక్షల మంది..

జిల్లాలో జులై వరకు 1.28 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు ఉండేవారు. ఆగస్టులో 34వేల మంది కొత్తవారిని ఆ జాబితాలో చేరారు. వారికి గుర్తింపు కార్డులు అందజేశారు. జిల్లాకు ప్రతినెలా రూ.30కోట్లు పింఛను రూపంలో సాయం అందుతుండగా.. కొత్త పింఛన్లకు రూ.5 కోట్లు కలుపుకొని ఈ మొత్తం రూ.35 కోట్లకు చేరింది. దివ్యాంగులకు నెలకు రూ.3,016 ఇస్తుండగా మిగతా వారికి రూ.2,016 చొప్పున ఇస్తున్న పంపిణీ చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

ఆసరా పింఛను ప్రతి నెలా ఆలస్యంగా అందుతుండటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నిత్యాసవర సరకుల కొనుగోలుకు పింఛను డబ్బులపైనే ఆధారపడిన వారి పరిస్థితి దయనీయం. ఆగస్టు నెలకు సంబంధించిన పింఛను సెప్టెంబరులో విడుదల కాగా.. ఆ నెల రెండో వారం వరకు పంపిణీ చేశారు. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలలకు సంబంధించిన పింఛను లబ్ధిదారుల చేతికి ఇప్పటికీ అందలేదు.


ఈకేవైసీ లేక ఇక్కట్లు

జిల్లాలో కొత్తగా పింఛను మంజూరైన వారిలో 1200 మందికి సంబంధించిన బ్యాంకు ఖాతాలకు ఈకేవైసీ ప్రక్రియ పూర్తికాలేదు. ఈ కారణంతో వారికి పింఛన్లు అందని పరిస్థితి. దరఖాస్తు సమయంలో ఏదో ఒక ఖాతా నంబరు ఇవ్వడం, అది ఇప్పుడు మనుగడలో లేకపోవడం, ఆధార్‌తో ఖాతా అనుసంధానం కాకపోవడం తదితర కారణాలతో వీరికి సాయం అందటంలేదు. వరుసగా మూడు నెలలు పింఛను తీసుకోకపోతే తాత్కాలికంగా రద్దయ్యే అవకాశమూ ఉంది.


నిధులు విడుదల కాగానే పంపిణీ

గాచార్యులు, ఏపీవో పింఛన్లు

ఆసరా పింఛను నిధుల విడుదలలో జాప్యంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఆలస్యమైనా నిధులు విడుదలవుతాయి. సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించిన నిధులు రెండు, మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. విడుదలైన వెంటనే పంపిణీకి చర్యలు తీసుకుంటాం. బ్యాంకుల ద్వారా అందుకునే వారికి సంబంధించిన పింఛను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని