logo

నెరవేరిన కల.. వసతి లేక డీలా!

కలల గూడును సమకూర్చిన అధికారులు.. వసతుల కల్పనపై దృష్టి సారించడంలేదు. దీంతో లబ్ధిదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

Published : 02 Dec 2022 02:02 IST

న్యూస్‌టుడే, మెదక్‌

కలల గూడును సమకూర్చిన అధికారులు.. వసతుల కల్పనపై దృష్టి సారించడంలేదు. దీంతో లబ్ధిదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. కొన్నింటిలో మాత్రమే సౌకర్యాలను కల్పించి వదిలేేశారు. అనంతరం ఎవరూ పట్టించుకోకపోవడంతో రెండు పడక గదుల ఇళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ అంశంపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం.

జిల్లా కేంద్రం మెదక్‌ పట్టణం పిల్లికొట్టాల్‌లో 950 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. తొలి విడతలో 561 మందికి ఇళ్లను కేటాయించారు. ఆగస్టు 23న లబ్ధిదారులను డ్రా పద్ధతిన ఎంపిక చేసి, 24న మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా గృహప్రవేశాలు చేయించారు. ప్రస్తుతం 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రారంభంలో ప్రధాన రహదారి వెంట ఇరువైపులా ఉన్న బ్లాక్‌లకు విద్యుత్తు, డ్రైనేజీ, తాగునీటి వసతి కల్పించారు. ముందు వరుసలో ఉన్న బ్లాక్‌లకు ట్యాంకులు బిగించినా, నీళ్లు తక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. ఉదయం ఒక సారి మాత్రమే బోరు వేసి వదిలివేస్తున్నారని, సరిపోవడంలేదని పేర్కొంటున్నారు. ఉదయం 9గంటల తర్వాత మున్సిపల్‌ ట్యాంకర్‌ రాగానే  డ్రమ్ముల్లో నింపుతున్నారు.  

నివాసానికి వెనుకంజ

లబ్ధిదారుల్లో చాలా మంది పట్టణంలోని అద్దె ఇళ్లలో ఉంటున్నారు. 50 నుంచి 75వ బ్లాక్‌ల వరకు విద్యుత్తు సౌకర్యం లేదు. స్తంభాలను బిగించినా తీగ లాగలేదు. డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. అయినా మూడు, నాలుగు కుటుంబాలు అందులోనే నివసిస్తున్నాయి. ఇక కొన్ని ఇళ్లల్లో శౌచాలయాలు పూర్తికాలేదు. 50, 51 బ్లాక్‌ల్లో మీటర్లు బిగించినా వాటికి విద్యుత్తు కనెక్షన్‌ ఇవ్వలేదు. అంతర్గత రోడ్లు నిర్మించాల్సి ఉంది.

అమలుకు నోచని హమీలు

అందుబాటులో రేషన్‌ దుకాణం, అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయినా ఇంత వరకు అడుగు ముందుకు పడలేదు.


విద్యుత్తు, నల్లా కనెక్షన్‌ లేదు : శాంతమ్మ

పట్టా రావడంతో మూడు నెలల కిందట ఈ ఇంటికి వచ్చాం. సరైన వసతులు లేవు. శౌచాలయాలను అసంపూర్తిగా నిర్మించడంతో ఆరుబయటకు వెళ్తున్నాం. విద్యుత్తు, నల్లా కనెక్షన్‌ లేక ఇబ్బందులు పడుతున్నాం.


ఆరు బయటే వంట: మంజుల

పదిహేను రోజుల కిందట ఇక్కడికి వచ్చాం. ఎలాంటి వసతులు లేవు. చీకట్లోనే నివాసం ఉంటున్నాం. శౌచాలయం లేక అవస్థలు పడుతున్నాం. ఇంటి నిర్మాణంలో నాణ్యత పాటించలేదు. వంట గది అసంపూర్తిగా ఉండటంతో ఆరుబయట వంట చేసుకుంటున్నాం.


మార్చి లోపు పూర్తి చేస్తాం

సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. మార్చి వరకు ప్రస్తుతం నిర్మించిన, ఇంకా పురోగతిలో ఉన్న వాటిలో వసతులు కల్పిస్తాం. లబ్ధిదారుల ఇబ్బందులు దూరం చేస్తాం. వ్యర్థాలు సెప్టిక్‌ ట్యాంక్‌లోకి వెళ్లాక, వాటి నుంచి వచ్చే మురుగును బయటకు పంపేందుకు పైప్‌లైన్లను బిగిస్తున్నాం.

చంద్రపాల్‌, పురపాలిక అధ్యక్షులు, మెదక్‌

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు