logo

సెల్‌ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారో వెల్లడించాలి: ఎమ్మెల్సీ

దిల్లీ మద్యం కేసులో రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న మేరకు శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. సెల్‌ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారో ప్రజలకు వెల్లడించాలని మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 02 Dec 2022 02:02 IST

న్యాయవాదుల దీక్షా శిబిరంలో ప్రసంగిస్తున్న జీవన్‌రెడ్డి

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: దిల్లీ మద్యం కేసులో రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న మేరకు శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. సెల్‌ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారో ప్రజలకు వెల్లడించాలని మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సబ్‌ కోర్టు కోసం న్యాయవాదులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని మంగళవారం సందర్శించి మద్దతు తెలిపారు. అనంతరం పీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి, సహకార సంఘం ఛైర్మన్‌ బొలిశెట్టి శివయ్యతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మద్యం కేసులో సంబంధం ఉన్న విషయం గురించి ఎవరూ మాట్లాడకుండా చేసేందుకే న్యాయస్థానానికి వెళ్లి ఆమె గతంలో ఉత్తర్వులు తెచ్చుకున్నారన్నారు. సెల్‌ఫోన్లను ధ్వంసం చేయడం సాక్ష్యాలను తారుమారు చేయడం కాదా అని ప్రశ్నించారు. బతుకమ్మ ఆడితేనే తెలంగాణ వచ్చిందని చెబుతున్న కవితను మద్యం కుంభకోణంలో భాగస్వామ్యం కమ్మని బతుకమ్మ చెప్పిందా అన్నారు. శాసనసభ్యుల కొనుగోలు వ్యవహారంలో నిందితుడుగా పేర్కొన్న భాజపా నేత బీఎల్‌ సంతోష్‌ విచారణకు హాజరుకానని పేర్కొనడాన్ని తప్పుబట్టారు. ఏ పదవీ లేనపుడే కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని చెబుతున్న కేసీఆర్‌.. అధికారం ఉండీ విభజన హామీలు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఐటీఐఆర్‌ ప్రాజెక్టును ఎందుకు తేలేకపోయారని విమర్శించారు. భాజపా, తెరాస తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పరస్పరం కేసులు నమోదు చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించేది కాంగ్రెస్‌ పార్టీయేనని ఎమ్మెల్సీ తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వి.రత్నాకర్‌, హుస్నాబాద్‌, అక్కన్నపేట మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు బంక చందు, జంగపల్లి అయిలయ్య, డీసీసీ కార్యదర్శులు చిత్తారి రవీందర్‌, కౌన్సిలర్లు చిత్తారి పద్మ, బూక్య సరోజన, వల్లపు రాజు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని