logo

పశుగ్రాసం వివాదం.. తీసింది ప్రాణం

పశుగ్రాసం విషయంలో వివాదం ఓ నిండుప్రాణాన్ని బలి తీసుకుంది. వ్యక్తిని హత్య చేయడంతో పాటు పెట్రోల్‌ పోసి తగులబెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా కలబ్‌గూరులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

Published : 02 Dec 2022 02:02 IST

హత్య చేసి.. పెట్రోల్‌ పోసి దహనం

సంగారెడ్డి టౌన్‌, సంగారెడ్డి గ్రామీణం, న్యూస్‌టుడే: పశుగ్రాసం విషయంలో వివాదం ఓ నిండుప్రాణాన్ని బలి తీసుకుంది. వ్యక్తిని హత్య చేయడంతో పాటు పెట్రోల్‌ పోసి తగులబెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా కలబ్‌గూరులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సంగారెడ్డి గ్రామీణ సీఐ శివలింగం తెలిపిన వివరాలు.. కలబ్‌గూర్‌కు చెందిన గూడెపు పాండు(38) పాల వ్యాపారి. పశువుల మేత కోసం తమ పొలంలో గ్రాసాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ గడ్డిని అదే గ్రామానికి చెందిన అక్తర్‌ పశువులు మేయడంతో పాండు ఆగ్రహానికి గురయ్యాడు. బుధవారం రాత్రి అక్తర్‌ ఇంటికి వెళ్లి ప్రశ్నించాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. అక్తర్‌, ఆయన కుమారుడు ఇస్మాయిల్‌ కలిసి పాండును పారతో బలంగా కొట్టారు. మెడకు తాడు చుట్టి లాగడంతో పాండు అక్కడే కుప్పకూలాడు. మృతదేహాన్ని లాక్కొని వెళ్లి మండల పరిధిలోని ఇర్గిపల్లి రోడ్డు పక్కన పొదల్లో వేశారు. పెట్రోల్‌ పోసి దహనం చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో వారి రోదన అందరికీ కంట తడిపెట్టించింది. పాండు భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని