logo

వినియోగదారు గోస వినేదెప్పుడు?

కాలానికి అనుగుణంగా విద్యుత్తు పంపిణీ వ్యవస్థలో మార్పులు రాకపోవటం వినియోగదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఒక చోట విద్యుత్తు మరమ్మతులు చేయాలంటే పది చోట్ల సరఫరా నిలిపివేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

Published : 03 Dec 2022 01:23 IST

విద్యుత్తు పంపిణీ వ్యవస్థ తీరు మారక ఇక్కట్లు
న్యూస్‌టుడే - చేర్యాల, గజ్వేల్‌, ములుగు

ములుగులో తీగలను అల్లుకున్న వైనం

కాలానికి అనుగుణంగా విద్యుత్తు పంపిణీ వ్యవస్థలో మార్పులు రాకపోవటం వినియోగదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఒక చోట విద్యుత్తు మరమ్మతులు చేయాలంటే పది చోట్ల సరఫరా నిలిపివేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. పొలాల వద్ద కిందికి వేలాడుతున్న తీగలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికప్పుడు సరి చేయాల్సిన ఆ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఒకెత్తయితే.. చిన్నపాటి గాలులకే సరఫరా నిలిచిపోయి ప్రజలు చిమ్మచీకట్లో బాధలు పడుతున్నారు. సమస్యలు రాకముందు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వచ్చిన తర్వాత తంటాలు పడుతున్నారు.

ప్రత్యేక లైన్లేవి?

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియా పరిధిలో ప్రధాన రోడ్డు మీదుగా ఒకే హెచ్‌టీ లైన్‌ ఉండటంతో నియంత్రికలు కానీ, ఆ పరిధిలోని ఇళ్లకు విద్యుత్తు సరఫరాలో మరమ్మతులు చేయాల్సి ఉన్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఎల్‌సీ(లైన్‌క్లీయర్‌) తీసుకుంటుంటారు. లైన్‌ మొత్తానికి సరఫరా నిలిపివేస్తుండటంతో చాలా కాలనీలకు విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుంది. పట్టణాలకు వేర్వేరు లైన్లు ఏర్పాటు చేసి సమస్య తీర్చుతామని అధికారులు చెబుతున్నా అమలుకునోచుకోవటం లేదు. బల్దియాలో సుమారు 10 వేలకుపైగా గృహ కనెక్షన్లున్నాయి. పాతికకు పైగా నియంత్రికల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఎక్కువ కనెక్షన్లు గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌ పరిధిలోనే ఉన్నాయి. ప్రత్యేక లైన్లు వేసి అంతరాయాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది.

చిరుగాలికే తెగుతున్న తీగలు

మండల కేంద్రమైన ములుగులో విద్యుత్తు శాఖ అధికారులు నాలుగు దశాబ్దాల కిందట 33/11 కేవీ ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఉపకేంద్రం ద్వారా ములుగుతోపాటు ఉద్యాన విశ్వవిద్యాలయం, అటవీ కళాశాల పరిశోధన, ఫలపరిశోధన కేంద్రం, కోళ్లపారంతోపాటు రెండు పడక గదుల ఇళ్లు, గురుకుల విద్యాలయం, ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాలు, పలు పరిశ్రమలకు అందిస్తున్నారు. ఉప కేంద్రంపై అధిక భారం పడుతోంది. కొన్నిచోట్ల తీగలు చెట్ల కొమ్మల మధ్య ఇరుక్కొని ప్రమాదకరంగా ఉన్నాయి. ములుగులో తీగలు ఏర్పాటు చేసి సుమారు నలభై ఏళ్లు కావొస్తోంది. పాతవి కావడంతో గాలులకు తెగిపోతున్నాయి. సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ములుగు మండలంలో అంతరాయం వాస్తవమేనని.. క్షేత్ర స్థాయిలో పరిశీలించి, శాశ్వత చర్యలు తీసుకుంటామని ఏఈ మహ్మద్‌ రియాజ్‌ అహ్మద్‌ పేర్కొన్నారు.

ప్రతి సభలోనూ ప్రస్తావన

చేర్యాల మండల సభలో ప్రతిసారి అజెండాలో విద్యుత్తు సమస్యలు ఉండటం గమనార్హం. వేలాడుతున్న తీగల కారణంగా కొందరు రైతులు పంటలు వేయటం లేదని దొమ్మాట సర్పంచి సుభాషిణి అనేకసార్లు సభ దృష్టికి తెచ్చినా సరి చేయలేదు. చేర్యాల మండలం ఆకునూరు శివారులో నాగసముద్రం కట్ట వద్ద కేవలం ఐదు అడుగుల ఎత్తులో తీగలున్నాయని రైతు కడారి కుమార్‌ వాపోయారు. పొలంలో పంట సాగు చేయలేదని.. పశువులు అటువైపు మేతకు వెళ్లకుండా కాపలా ఉంటున్నామన్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఆ శాఖ పట్టణ ఏఈ టాబ్రెజ్‌ మాట్లాడుతూ త్వరలో సిబ్బందిని పంపించి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని