logo

కొలువులు... నిధులు ఏమయ్యాయి?

కేంద్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో కోట్లలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని... జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

Updated : 04 Dec 2022 06:14 IST

భాజపా వాగ్దానాలపై మంత్రి హరీశ్‌రావు ధ్వజం

సమావేశంలో ప్రసంగిస్తున్న హరీశ్‌రావు, వేదికపై ఎంపీ బీబీపాటిల్‌, జడ్పీ
అధ్యక్షురాలు మంజుశ్రీ, ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తదితరులు

నిజాంపేట్‌(కల్హేర్‌), నారాయణఖేడ్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో కోట్లలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని... జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పడిన నిజాంపేట్‌ మండలంలో శనివారం తహసీల్దార్‌ కార్యాలయ ప్రారంభం, రూ.1.56 కోట్లతో పీహెచ్‌సీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని, జన్‌ధన్‌ ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ఏ ఒక్కరికి ఇవ్వలేదన్నారు. రైతుల బోర్లు, మోటార్ల వద్ద మీటర్లు బిగిస్తేనే రాష్ట్రానికి రావాల్సిన రూ.30 వేల కోట్లు నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం మెలిక పెట్టగా... రైతుల సంక్షేమం దృష్ట్యా ఆ నిధులు వదులుకోవడంతోపాటు 24 గంటలు విద్యుత్తు ఇచ్చి అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఖేడ్‌ డివిజన్‌కు గోదావరి జలాలు

కాలువల ద్వారా గోదావరి జలాలను నారాయణఖేడ్‌ డివిజన్‌కు తీసుకొచ్చి రైతుల పాదాలు కడిగి రుణం తీర్చుకుంటామన్నారు. గతంలో నారాయణఖేడ్‌ వెనుకబడిన ప్రాంతంగా ఉండేదని, తెలంగాణ ఏర్పడిన తరువాతే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల నాయకులు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా.. ఇక్కడ ఎందుకు అభివృద్ధి జరగలేదని ప్రశ్నించారు. విద్యాపరంగా గిరిజన, మైనార్టీ, సాంఘిక సంక్షేమ గురుకులాలను ఆంగ్ల మాధ్యమంలో ఏర్పాటుచేసి పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. వైద్యపరంగా ఖేడ్‌ ఆసుపత్రిని ఆధునికీకరించడంతోపాటు మాతాశిశు సంరక్షణ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు. కంగ్టి మండలంలోని తడ్కల్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని జడ్పీటీసీ సభ్యుడు, సర్పంచి మంత్రికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ.పాటిల్‌, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ మంజుశ్రీ, అదనపు పాలనాధికారి రాజర్షిషా, ఆర్డీఓ అంబదాస్‌ రాజేశ్వర్‌, డీఎస్పీ బాలాజీ, ఏడీఏ కరుణాకర్‌రెడ్డి, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, స్థానిక సర్పంచి జగదీశ్వరాచారీ, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని