logo

విద్యుత్తు బకాయిలు రూ.4,27,297

పై చిత్రంలో మీరు చూస్తున్న పూరి గుడిసె శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లికి చెందిన వడ్ల లక్ష్మీకి చెందినది. భర్త సత్తయ్య. అప్పట్లో వీరికి పెంకుటిల్లు ఉండేది.

Updated : 04 Dec 2022 02:24 IST

కరెంటు కనెక్షన్‌ తొలగించిన గుడిసె

పై చిత్రంలో మీరు చూస్తున్న పూరి గుడిసె శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లికి చెందిన వడ్ల లక్ష్మీకి చెందినది. భర్త సత్తయ్య. అప్పట్లో వీరికి పెంకుటిల్లు ఉండేది. అది శిథిలమవ్వడంతో ప్రస్తుతం గుడిసె ఏర్పాటు చేసుకున్నారు. పదేళ్ల క్రితం సత్తయ్య మృతి చెందాడు. కాగా అతని పేరు విద్యుత్తు బిల్లు రూ.10వేల వరకూ బకాయి ఉందని ఆ శాఖా సిబ్బంది ఇటీవల కరెంటు కనెక్షన్‌ను తొలగించారు. లక్ష్మి బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉందని తెలుసుకుని, స్థానికంగానే ఉంటున్న వారి కొడుకులు లక్ష్మణ్‌, వెంకటేశ్‌ల ఇళ్లకూ విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. బకాయి ఉందని ముందస్తు నోటీసుగానీ, సమాచారంగానీ ఇవ్వకుండా అప్పటికప్పుడే బిల్లు కట్టాలని ఒత్తిడి తెచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడో వినియోగించిన విద్యుత్తుకు ఇప్పుడు బిల్లు చెల్లించాలనడం సరికాదని వాపోతున్నారు.  

ఏళ్ల క్రితం వినియోగించినవి..

జిల్లాలో 1,85,098 సర్వీసులు ఉన్నాయి. దశాబ్దాల క్రితం వినియోగించిన విద్యుత్తుకు ఇప్పుడు లెక్కలు కట్టి మరీ వసూలు చేస్తున్నారు. తండ్రి పేర విద్యుత్తు బిల్లు బకాయి ఉంటే అతని కుమారులు చెల్లించాల్సిందేనని ముడి పెడుతున్నారు. తండ్రి భారాన్ని అనివార్యంగా తనయులు భరించాల్సిందేనంటూ అధికారులు వాదిస్తున్నారు.  

చెల్లించకపోతే  సరఫరా నిలిపివేత

విద్యుత్తు పంపిణీ సంస్థ మొండి బకాయిల వసూలులో కఠినంగా వ్యవహరిస్తోంది. తాతల, తండ్రుల కాలం నాటి బకాయిలను వారసుల నుంచి రాబట్టేందుకు నిర్ణయించింది. బకాయి పేరుకుపోగా కనెక్షన్‌ను వినియోగించకపోవడం, ఆ మీటరు పక్కన పెట్టి కొత్తది తీసుకుని నెట్టుకొస్తున్న వారిని గుర్తించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. గ్రామాలు, పట్టణాల్లో పాత ఇళ్లు శిథిలావస్థకు చేరడంతో వాటిని కూల్చివేసి కొత్తవి నిర్మించుకున్నారు. ఆ సమయంలో పాత మీటరు వదిలేసి కొత్తవి పొందారు. మరికొందరు ఉమ్మడి కుటుంబంలో నుంచి వేరు పడ్డారు. ఇంకొందరు వలసబాట పట్టారు. ఇలాంటి సందర్భాల్లో ఇంటి యజమాని పేర బకాయి ఉంటే ఆ కుటుంబ సభ్యులను బాధ్యులను చేస్తున్నారు. బకాయిలను చెల్లించాలని లేని ఎడల రక్త సంబంధీకుల కనెక్షన్లు తొలగిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కొన్నిచోట్ల సరఫరా నిలిపి వేసేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

న్యూస్‌టుడే, నర్సాపూర్‌


ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..

ఉన్నతాధికారుల ఆదేశానుసారమే పాత బకాయిలు వసూలు చేస్తున్నాం. ఇందుకు కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది. సర్వీస్‌ వద్దనుకునే వారు దాని మీద అప్పటివరకు ఉన్న బకాయిని చెల్లించాలి. లేదంటే ఎప్పటికైనా ఆ సర్వీసు మీద ఉన్న బకాయిని అనుబంధంగా ఉన్న సర్వీస్‌ కనెక్షన్ల దారులు చెల్లించాల్సిందే. ఇళ్లు కొనుగోలు చేసే ముందు ఇంటి, నల్లా పన్నుల బకాయిలు ఉన్నాయా లేదా.. ఎలా సరిచూసుకుంటారో విద్యుత్తు బకాయిలపై వివరాలు అలానే తెలుసుకోవాలి. లేదంటే ఎప్పటికైనా ఆ బకాయి స్థానంలో ఉన్నవారిపై భారం పడుతుంది.

భాస్కర్‌రెడ్డి, ఏడీఈ


 

Read latest Medak News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు